Begin typing your search above and press return to search.

బ్రాహ్మణి, భువనేశ్వరి వ్యూహాలు ఫలిస్తాయా?

కానీ ఆయన అరెస్టు తర్వాత వారిద్దరు రాజకీయంగా చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అయిన నాటి నుంచి రాజమండ్రిలోనే ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Oct 2023 7:48 AM GMT
బ్రాహ్మణి, భువనేశ్వరి వ్యూహాలు ఫలిస్తాయా?
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసి నెల రోజులు దాటిపోయింది. ఆయన అరెస్టుపై టీడీపీ నేతలు, శ్రేణులు రోజుకో విధంగా తమ నిరసనను తెలియజేస్తూ వస్తున్నారు. రిలే దీక్షలు, నిరాహార దీక్షలు, నిరసనలు, మౌన వ్రతాలు, క్యాండిల్‌ ర్యాలీలు ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ దేశాల్లోనూ టీడీపీ సానుభూతిపరులు చంద్రబాబుకు మద్దతుగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఇక హైదరాబాద్‌ లో మాదాపూర్‌ లో భారీ ర్యాలీలు తీశారు. అలాగే తాజాగా మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ నుంచి ఎల్బీ నగర్‌ వరకు ప్రయాణించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.


అవినీతి, అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలులో ఉన్న ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తన అహాన్ని చల్లబర్చుకోవడానికి, చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైలులో ఉంచాలనే ఆయనను అరెస్టు చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు టీడీపీ నేతలు, శ్రేణులు, సానుభూతిపరులు, మద్దతుదారులు చేస్తున్న కార్యక్రమాలు ఒక ఎత్తయితే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఆయన కోడలు నారా బ్రాహ్మణి సైతం వినూత్న నిరసనలతో హాట్‌ టాపిక్‌ గా మారారు. ముఖ్యంగా బ్రాహ్మణి, భువనేశ్వరి ఇద్దరూ సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటున్నారు. ట్విట్టర్‌ (ప్రస్తుతం ఎక్స్‌)లో నిత్యం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

చంద్రబాబు అరెస్టు ముందు వరకు సోషల్‌ మీడియాలో భువనేశ్వరి, బ్రాహ్మణి అంత చురుగ్గా లేరు. కానీ ఆయన అరెస్టు తర్వాత వారిద్దరు రాజకీయంగా చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అయిన నాటి నుంచి రాజమండ్రిలోనే ఉంటున్నారు.

నిత్యం తమకు మద్దతు ప్రకటించడానికి, సంఘీభావం తెలియజేయడానికి రాజమండ్రికి వస్తున్న టీడీపీ నాయకులు, శ్రేణులు, మహిళలు, ఐటీ ఉద్యోగులు, జనసేన పార్టీ నేతలను బ్రాహ్మణి, భువనేశ్వరి కలుస్తున్నారు. మీడియాలోనూ వీరిద్దరి వ్యాఖ్యలకు మంచి ప్రాధాన్యతే లభిస్తుంది.

అలాగే చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఇప్పటికే టీడీపీ.. ‘మోత మోగిద్దాం’, ‘క్రాంతితో కాంతి’, ‘న్యాయానికి సంకెళ్లు’ వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టింది.

ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 30న ‘మోత మోగిద్దాం’ కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రిలో భువనేశ్వరి, బ్రాహ్మణి గంటలు మోగిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అలాగే అక్టోబర్‌ 7న క్రాంతితో కాంతి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దీపాలు, టార్చిలైట్లు, కొవ్వొత్తులు వెలిగించారు. తద్వారా తమ నిరసనను తెలిపారు. ఇక అక్టోబర్‌ 15న న్యాయానికి సంకెళ్లు అనే కార్యక్రమం ద్వారా తమ చేతులకు బేడీలు తగిలించుకుని బ్రాహ్మణి వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త లోకేశ్‌ కూడా పాల్గొన్నారు.

ఇలా వినూత్న కార్యక్రమాల ద్వారా బ్రాహ్మణి, భువనేశ్వరి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ పైబర్‌ గ్రిడ్‌ లేదా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ ఎలైన్మెంట్‌ మార్పు కేసులో లోకేశ్‌ ను కూడా అరెస్టు చేస్తే పార్టీ బాధ్యతలు చేపట్టడానికి తాము సిద్ధమేనని ఈ అత్తాకోడళ్లు (భువనేశ్వరి, బ్రాహ్మణి) నిరూపిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. మరి వీరి వ్యూహాలు ఫలిస్తాయా అనేది వేచిచూడాల్సిందే!