Begin typing your search above and press return to search.

బిగ్ బ్రదర్స్ ఇద్దరూ గెలుస్తారా...!?

అంటే పన్నెండేళ్ల పాటు పెద్దల సభలో ఇద్దరూ ఎంపీలుగా ఉండగలిగారు.

By:  Tupaki Desk   |   9 April 2024 1:30 AM GMT
బిగ్ బ్రదర్స్ ఇద్దరూ గెలుస్తారా...!?
X

తెలుగుదేశం పార్టీయే వారి రాజకీయ జీవితానికి ఆరంభంగా నిలిచింది. ఆ పార్టీలో ఉంటూ తాము ఎదిగారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఆ ఇద్దరే ఒకరు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, మరొకరు రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్. ఈ ఇద్దరికీ చంద్రబాబు పూర్తి న్యాయం చేశారు. ఇద్దరికీ రెండేసి మార్లు రాజ్యసభ సీట్లు ఇచ్చారు. అంటే పన్నెండేళ్ల పాటు పెద్దల సభలో ఇద్దరూ ఎంపీలుగా ఉండగలిగారు.

అయితే అనూహ్యంగా 2019లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఇద్దరూ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇది రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వారు అంతా షాక్ కి గురి అయిన విషయంగా మారింది. చంద్రబాబు కుడి ఎడమలుగా ఉన్న ఈ ఇద్దరు పార్టీ మారడమేంటి అని అంతా చర్చించుకున్నారు. అయితే వారిని చంద్రబాబే బీజేపీలోకి పంపించారు అని వైసీపీ వంటి పార్టీలు ఈ రోజుకీ విమర్శలు చేస్తూనే ఉంటాయి.

మరో వైపు చూస్తే బీజేపీలో ఇద్దరి రాజ్యసభ సభ్యత్వం పూర్తి అయ్యాక రెన్యూవల్ చేయలేదు. కానీ ఇద్దరికీ 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు కల్పించింది. దాంతో మొదటిసారి ఈ ఇద్దరి బిగ్ బ్రదర్స్ ప్రత్యక్ష ఎన్నికలను ఫేస్ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరికీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

ముందుగా తీసుకుంటే కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ అనకాపల్లి జిల్లాకు తరలివచ్చారు. ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అంగబలం అర్ధబలం కలిగి ఉన్న సీఎం రమేష్ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఆయన నాన్ లోకల్ అని గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండరని వైసీపీ విమర్శలు చేస్తోంది.

ఆయన మీద పోటీకి దిగిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఓటమి ఎరగని వీరుడిగా ఉన్నారు. ఆయన ఎంపీగా తొలిసారి పోటీ చేస్తున్నారు. బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయన గెలుపు నాదే అంటున్నారు. లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అని అంటున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే మాడుగుల, చోడవరం, పాయకరావుపేట లో వైసీపీ ఆధిపత్యం చూపిస్తోంది. అనకాపల్లి నర్శీపట్నం పెందుర్తిలలో టీడీపీకి అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.

ఇక ఎలమంచిలిలో రెండు పార్టీలకు గట్టి పట్టు ఉంది. అయితే వైసీపీ మాత్రం మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో తమకు బలం ఉందని అంటూంటే టీడీపీ మొత్తం అసెంబ్లీ పార్లమెంట్ సీటుతో కలిపి గెలుస్తామని అంటోంది. అయితే ఇద్దరికీ ఇది హోరా హోరీ పోటీగానే ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ గా చెప్పాలీ అంటే సీఎం రమేష్ కి ఈ సీటు అంత ఈజీ కాదు అనే అంటున్నారు.

మరో వైపు సుజనా చౌదరి విషయం తీసుకుంటే ఆయన వెళ్ళి మరీ బీసీలు మైనారిటీలు అధికంగా ఉన్న విజయవాడ వెస్ట్ నుంచి పోటీకి దిగారు. అది కూడా చివరి నిముషంలో. అక్కడ బీజేపీ అభ్యర్థిగా అంటే గట్టి సవాల్ ని ఆయన స్వీకరించినట్లే అంటున్నారు. ఇక అక్కడ వైసీపీ గత రెండు ఎన్నికలను గెలిచింది. ఆ పార్టీకి బలం ఉంది. ఈసారి మైనారిటీలకు టికెట్ ఇచ్చింది. మైనారిటీలు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు.

అదే విధంగా టీడీపీ అక్కడ గెలిచి దశాబ్దాలు దాటింది. ఈ విధంగా చూస్తే వెరీ టఫ్ సీటు ఇది టీడీపీ కూటమికి అని అంటున్నారు. జనసేన మద్దతు ఉంటే గెలుపు ఆశలు ఉంటాయనుకుంటే అక్కడ బీసీ లీడర్ గా ఉన్న పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మెజారిటీ జనసేన నేతలు అంతా పార్టీని వీడిపోతున్నారు. దానితో ఇది గట్టి దెబ్బ అని అంటున్నారు

ఇక బీజేపీకి ఇక్కడ బలం చాలా తక్కువ. టీడీపీ సాయంతోనే ఆ పార్టీ గెలవాల్సి ఉంది. మొత్తం మీద సుజనా చౌదరికి విషయం చూస్తే అంగబలం అర్ధబలం దండీగా ఉన్న నేత అయినప్పటికీ రాజకీయంగా విజయవాడ పశ్చిమ ఆయనకు పెను సవాల్ కానుంది అని అంటున్నారు. దీంతో ఆయన గెలుపు మీద అంతా చర్చించుకుంటున్నారు. అలాగే సీఎం రమేష్ చేతికి అనకాపల్లి చిక్కుతుందా అన్నది మరో చర్చగా ఉంది.