Begin typing your search above and press return to search.

కీలక నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేత గెలిచేనా?

మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బరిలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   1 April 2024 2:30 PM GMT
కీలక నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేత గెలిచేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో మచిలీపట్నం (బందరు) ఒకటి. ఇక్కడ వైసీపీ తరఫున ఆ పార్టీకి మంచి గొంతుకగా పేరున్న పేర్ని నాని కుమారుడు పేర్ని నాని కిట్టు పోటీ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బరిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, పురందేశ్వరిలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్న పేర్ని నానికి ఝలక్‌ ఇవ్వాలని కూటమి కృతనిశ్చయంతో ఉంది. వైసీపీ తరఫున మంచి సాధికారికంగా, సెటైరికల్‌ గా, పుల్ల విరుపుగా మాడ్లాతారని పేర్ని నానికి పేరుంది. వైసీపీ సైతం ప్రతిపక్షాలపై ముఖ్యమైన సందర్భాల్లో విమర్శలు చేయాలంటే పేర్ని నానినే వినియోగిస్తోంది.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. తనకు బదులుగా తన కుమారుడు పేర్ని కిట్టును పోటీ చేయిస్తున్నారు. 1989 ఎన్నికల్లో పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి బందరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక 1994లో ఆయన తిరిగి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో బందరు నుంచి తొలిసారి పేర్ని నాని పోటీ చేశారు. అయితే కొల్లు రవీంద్ర మామ, మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావుపై ఓడిపోయారు.

2004లో పేర్ని నాని తొలిసారి గెలుపు రుచిని చవిచూశారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లోనూ మరోసారి అదే పార్టీ నుంచి విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన పేర్ని నాని... టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో ఓడిపోయారు. తిరిగి 2019లో వైసీపీ నుంచే బరిలోకి దిగి నాని విజయం సాధించారు. వైఎస్‌ జగన్‌ తొలి విడత కేబినెట్‌ లో సమాచార, ప్రసార, రవాణా శాఖల మంత్రిగా వ్యవహరించారు. తిరిగి రెండో విడత కేబినెట్‌ లో తన మంత్రి పదవిని కోల్పోయారు.

ఇక కొల్లు రవీంద్ర తన మామ నడికుదిటి నరసింహారావు వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014లో బందరు నుంచి టీడీపీ తరఫున గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2019లో తిరిగి టీడీపీ నుంచి పోటీ చేసిన కొల్లు ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొల్లు రవీంద్రను అరెస్టు చేయించింది. కొద్ది రోజులపాటు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌ పైన విడుదలయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయి ఉండటం, జైలుపాలు కావడంతో ఆయనపైన సానుభూతి ఉందని టాక్‌ నడుస్తోంది. అంతేకాకుండా కూటమి తరఫున పోటీ చేస్తుండటం, బందరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఉన్న బలం, నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం వంటి బలాలు ఆయనకు తోడవుతాయనే అంచనాలు ఉన్నాయి.

మరోవైపు పేర్ని నాని ఈసారి తనకు బదులుగా తన కుమారుడు పేర్ని కిట్టును బరిలో దింపారు. పేర్ని నాని తెర వెనుక నుంచే అంతా చూసుకుంటున్నారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ ను విమర్శించే క్రమంలో తన సొంత సామాజికవర్గం కాపులపైనే గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకతతో ఈసారి ఆయనకు ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ పై తీవ్ర విమర్శలు చేసిన పేర్నిని ఈసారి ఎలాగైనా ఓడించాలని జనసేన శ్రేణులు కృతనిశ్చయంతో ఉన్నాయి. దీంతో పేర్ని కిట్టు ఏటికి ఎదురుతున్నారని అంటున్నారు. జగన్‌ ఇమేజీ, తన కుటుంబ పలుకుబడి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని ఆశతో ఆయన ఉన్నారని చెబుతున్నారు.