Begin typing your search above and press return to search.

గూగుల్ పుణ్యమాని గోదావరి నీరు

విశాఖలో అతి పెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు మంగళవారం శ్రీకారం చుట్టారు. పునాది రాయి పడింది.

By:  Satya P   |   28 April 2026 3:00 PM IST
గూగుల్ పుణ్యమాని గోదావరి నీరు
X

విశాఖలో అతి పెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు మంగళవారం శ్రీకారం చుట్టారు. పునాది రాయి పడింది. 2028 సెప్టెంబర్ నాటికి గూగుల్ డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఇదిలా ఉంటే డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కావడం పట్ల ఆనందం వ్యక్తం అవుతూనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దానికి కారణం మేధావులు ప్రజా సంఘాలు వామపక్ష నేతలు ప్రతిపక్ష నాయకులు చెబుతున్న విషయాలు.

విద్యుత్ కొరత :

డేటా సెంటర్ల వల్ల విద్యుత్ కొరత నీటి కొరత ఏర్పడుతుందని పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. డేటా సెంటర్లకు కొన్ని దేశాలు తమ వద్ద చోటు కల్పించకపోవడానికి ఇదే కారణం అని కూడా మేధావులు అంటున్నారు. విశాఖ వంటి చోట్ల డేటా సెంటర్ ఏర్పాటుతో ఇప్పటికే కాలుష్యం నగరలో తీవ్రంగా ఉన్న స్థితిలో మరింతగా అది పెరిగేలా దోహదపడుతుందా అన్నది బిగ్ డిబేట్ గా ఉంది.

నీటి పరిరక్షణతో :

డేటా సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ మాట్లాడుతూ నీరు విద్యుతు విషయంలో విలువైన సూచనలు చేశారు. నీటిని కూడా రీసైక్లింగ్ చేసి వినియోగించుకోవాలని నీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో భారతీయ సంస్థలతో పనిచేయాలని కూడా గూగుల్ పెద్దలకు సూచించారు.

సీఎం భరోసా :

ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో గూగుల్ కి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు. గూగుల్ ఏర్పాటుతో విశాఖకు నీటి సమస్య ఏర్పడదని స్పష్టం చేశారు. ఆ విధంగా వస్తున్న అనుమానాల మీద సీఎం క్లారిటీ ఇచ్చారనుకోవాలి. అదే సమయంలో ఆయన మరో మాట అన్నారు. విశాఖకు అనకాపల్లికి కేవలం అరవై రోజుల వ్యవధిలో గోదావరి నీటిని తీసుకుని వస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల నీటి కొరత ఉండబోదని భరోసా ఇచ్చారు. అయితే ఈ గోదావరి నీళ్ళు విశాఖ నగరానికా లేక ఇందులో గూగుల్ కి వాటా ఉందా అన్నది తెలియడం లేదు. ఇప్పటిదాకా విశాఖకు నీటి సమస్యలు లేవు. కానీ వరుసగా పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. అతి పెద్ద డేటా సెంటర్ వస్తోంది. దాంతో భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో గోదావరి జలాలను నగరానికి తెస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం విశేషం.

ఎన్ని ఉద్యోగాలు :

ఇక పోతే గూగుల్ డేటా సెంటర్ వల్ల లక్షలాదిగా ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే డేటా సెంటర్ నిర్మాణ దశలో 240, కార్యకలాపాలు మొదలైన తరువాత 1375 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని సీపీఎం నేతలు చెబుతున్నారు. డేటా సెంటర్ కోసం వేయి మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంతే స్థాయిలో వేడి కూడా విడుదల అవుతుందని చెబుతున్నారు. అయితే ఎంత మందికి ఉపాధి దక్కుతుంది. పర్యావరణం మీద ఏ మేరకు ప్రభావం పడుతుంది అన్నది ముందు ముందు తెలుస్తుందని అంటున్నారు.