Begin typing your search above and press return to search.

భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి మర్డర్ స్కెచ్.. చివరికి దొరికింది ఇలా..!

కుటుంబ విలువలు, సంప్రదాయాలు పాటించే ఈ నేలపై కొంత మంది చేస్తున్న పనులు సమ సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   10 April 2026 7:40 PM IST
భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి మర్డర్ స్కెచ్.. చివరికి దొరికింది ఇలా..!
X

కుటుంబ విలువలు, సంప్రదాయాలు పాటించే ఈ నేలపై కొంత మంది చేస్తున్న పనులు సమ సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. రూపం నచ్చలేదని కట్టుకున్న వాడిని కడతేర్చడం వినడానికే అసహ్యంగా ఉంది. రంగును చూసి మనిషిని వెక్కిరించడమే కాక, ప్రేమికుడి కోసం ఏకంగా ప్రాణాలు తీయడం చూస్తుంటే సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటనపై పలువురు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

నా అందం వాడికే దక్కాలి..!

అందం అనేది చూసే కళ్లలో ఉండాలి కానీ, అది ఒక ప్రాణం తీసే స్థాయికి వెళ్తుందంటే ఆ మనసు ఎంత వికృతమైందో అర్థం చేసుకోవచ్చు. నల్లగా ఉన్నాడనే నెపంతో భర్తను నిరంతరం వేధించడమే కాక, తన ‘అందం’ తన ప్రియుడికి మాత్రమే సొంతం కావాలనే వెర్రి వ్యామోహంతో ఆ ఇల్లాలు చేసిన ఘాతుకం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దోపిడీ దొంగలు చంపారంటూ డ్రామా ఆడి పోలీసులనే తప్పుదోవ పట్టించాలనుకున్న ఆ కిలేడి ప్లాన్, కేవలం 36 గంటల్లోనే బట్టబయలైంది.

దోపిడీ దొంగల డ్రామా..

ఏప్రిల్ 7వ తేదీ అర్ధరాత్రి ధార్ జిల్లాలోని గోండిఖేడా గ్రామంలో దేవకృష్ణ పురోహిత్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు వచ్చేసరికి ఇల్లంతా సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. భార్య ప్రియాంక కాళ్లు చేతులు కట్టేసి ఉండి, దొంగలు పడి నగలు, నగదు కోసం తన భర్తను చంపేశారని ఏడుస్తూ కథలు చెప్పింది. అయితే, ఇల్లంతా వెతికిన పోలీసులకు నగలు ఇంట్లోనే దొరకడంతో ప్రియాంక చెప్పిన మాటలపై అనుమానం మొదలైంది.

నలుపు రంగుపై వెకిలి చేష్టలు

దర్యాప్తులో దేవకృష్ణ సోదరి ఇచ్చిన వాంగ్మూలం పోలీసులకు అసలు విషయాన్ని చేరవేసింది. ‘మా తమ్ముడు నల్లగా ఉన్నాడని ప్రియాంక ఎప్పుడూ అసహ్యించుకునేది. నీకంటే అందమైన వాడు నాకు దక్కాలి అంటూ గొడవ పడేది’ అని పోలీసులకు చెప్పుకున్నారు. ఈ చిన్న క్లూతో పోలీసులు ప్రియాంక కాల్ డేటాను పరిశీలించగా, కమలేష్ అనే వ్యక్తితో ఆమెకు ఉన్న వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి ముందే వారిద్దరూ ప్రేమించుకున్నారని, భర్తను వదిలించుకోవడానికి ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారని తేలింది.

లక్ష రూపాయల సుపారీ..

ప్రియుడు కమలేష్ తన స్నేహితుడు సురేంద్రకు లక్ష సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించాడు. ప్రియాంక కావాలనే ఇంటి తలుపులు తీసి ఉంచగా, నిద్రిస్తున్న దేవకృష్ణను సురేంద్ర అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత తాము పట్టుబడకుండా ఉండేందుకు దోపిడీ దొంగల సీన్ క్రియేట్ చేశారు. ప్రియాంకను తాళ్లతో కట్టేసి, ఆమెను బాధితురాలిగా చూపే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసుల ఇంటరాగేషన్‌లో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పి అడ్డంగా దొరికిపోయింది.

36 గంటల్లో..

ఎస్పీ మయాంక్ అవస్తి నేతృత్వంలో పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి, కేవలం 36 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. తన ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను చంపించినట్లు ప్రియాంక నేరాన్ని అంగీకరించింది. ప్రస్తుతం ప్రియాంక, కమలేష్ పోలీసుల కస్టడీలో ఉండగా, సురేంద్ర కోసం గాలిస్తున్నారు. రంగును చూసి వెక్కిరించిన ఆ ‘అందగత్తె’ ఇప్పుడు కటకటాల వెనుక తన అందాన్ని చూసుకునే స్థితికి చేరుకుంది.

రూపాయికి ఆశపడే సుపారీ హంతకులు, ప్రియుడి వ్యామోహంలో పడి భర్తను చంపే భార్యలు.. ఈ ఘటన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. రంగును చూసి మనిషి విలువను అంచనా వేయడం, ఆ నెపంతో నేరాలకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య. అందమైన ముఖం వెనుక ఉన్న భయంకరమైన రాక్షసి రూపాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. దేవకృష్ణ ప్రాణాలను రంగు బలితీసుకోలేదు, ప్రియాంకలోని వికృతమైన ఆలోచనలే బలితీసుకున్నాయి.