Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఇంకా రాజధాని అంటావేంటి బాబాయ్....!

మరి ఇలాంటి నేపధ్యంలో హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా మరి కొన్నాళ్ళు ఉంచాలని వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరడం ఆశ్చర్యంగా ఉంది

By:  Tupaki Desk   |   13 Feb 2024 1:24 PM GMT
హైదరాబాద్ ఇంకా రాజధాని అంటావేంటి బాబాయ్....!
X

ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ ఉమ్మడి రాజధాని. పదేళ్ళు పూర్తి అయింది. అక్కడా ఇక్కడా రెండు ఎన్నికలు జరిగిపోయాయి. మూడవ ఎన్నికలు తెలంగాణలో జరిగితే ఏపీలో త్వరలో జరగనుంది. ఇదీ కధా సన్నివేశం. మరి ఇలాంటి నేపధ్యంలో హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా మరి కొన్నాళ్ళు ఉంచాలని వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరడం ఆశ్చర్యంగా ఉంది

అసలు హైదరాబాద్ తెలంగాణాది అని భావించి ఏ సెంటిమెంట్లూ ఆయింట్మెంట్లూ పెట్టుకోకుండా ఎంచక్కా ఏపీ వారు ఎవరి పని వారు చేసుకుంటున్నారు. విభజన తరువాత చూస్తే తొలి సీఎం అయిన చంద్రబాబు 2015లోనే ఏపీకి వచ్చేశారు. అమరావతి పేరిట రాజధానిని నిర్మిస్తామ్ని ఆయన చెప్పుకొచ్చారు. అందులో కొన్ని టెంపరరీ భవనాలు కట్టారు. అది అలా ఉండగా ఆయన గద్దె దిగి జగన్ వచ్చారు. ఇపుడు అమరావతిలోనే సచివాలయం హైకోర్టు అసెంబ్లీ ఉన్నాయి.

సో చెపుకోవాలంటే ఏపీ రాజధాని అమరావతి అనే అంతా అనాలి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అంటూ చెప్పుకుని వచ్చింది. మూడు రాజధానులలో అసలైన మెలిక ఏంటి అంటే మొత్తం పాలన అంతా విశాఖ నుంచి చేయాలనుకోవడం. పాలనా రాజధాని విశాఖ అంటే అమరావతి కేవలం శాసన సభ సమావేశానికే పరిమితం అవుతుంది అన్న మాట. దాంతోనే అమరావతి రైతులు భగ్గుమన్నారు. ఆ ఉద్యమం అలా సాగుతూనే ఉంది. విపక్షాలు అన్నీ కూడా అమరావతి మాత్రమే రాజధాని అంటున్నారు.

అదే విధంగా మూడు రాజధానులు అంటూ చట్టం చేసిన వైసీపీ ప్రభుత్వం అదే అసెంబ్లీలో దాన్ని రద్దు చేసుకుంది. ఇక హైకోర్టు కూడా అమరావతే రాజధాని అని తీర్పు ఇచ్చింది. దీని మీద సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం వెళ్ళింది. ఆ కేసు ఏప్రిల్ కి వాయిదా పడింది. ఈ లోగా ఎన్నికలు తోసుకుని వస్తున్నాయి. ఏపీకి రాజధాని ఏది అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాజధాని లేకుండా వైసీపీ ప్రభుత్వం చేసింది అన్న బండలు అన్ని వైపుల నుంచి వచ్చి పడుతున్నాయి.

ఈ పరిస్థితిలో తాజాగా మంత్రి అంబటి రాంబాబు అమరావతి రాజధానిగానే ఉందని చెప్పారు. తాము మూడు రాజధానుల ప్రతిపాదన చేశామని అది అమలు అయ్యేంతవరకూ అమరావతి రాజధాని అని ఆయన అన్నారు. అయితే వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఉమ్మడి హైదరాబాద్ ఏపీకి పదేళ్ల పాటు రాజధానిగా ఉందని గుర్తు చేస్తున్నారు. ఆ హక్కు ఈ ఏడాది జూన్ వరకూ ఉంటుందని దానిని కొనసాగించాలని ఆయన కోరుతున్నారు.

గత ప్రభుత్వం అతి పెద్ద ఖర్చు అయిన అమరావతిని తలకెత్తుకుందని దాన్ని పూర్తి చేయలేకపోయిందని ఆయన ఎత్తిపొడించారు. తాము అంత ఖర్చు భరించలేమనే విశాఖను రెడీమేడ్ రాజధానిగా చేసుకున్నామని అయితే ఇది కోర్టులో ఉందని అది పరిష్కారం అయ్యాక విశాఖ రాజధాని అవుతున్నట్లుగా మాట్లాడారు.

మొత్తానికి చూస్తే ఒక వ్యూహం ప్రకారమే వైవీ సుబ్బారెడ్డి ఇలా మాట్లాడారు అని భావించాలి. ఎందుకంటే రాజధాని ఏది అంటే అమరావతిని చూపించడం వైసీపీకి ఇష్టం లేదు అంటున్నారు. అందుకే జనాలు పూర్తిగా మరచిపోయినా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ని తీసుకుని వచ్చారు అని అంటున్నారు. ఎన్నికల తరువాత మళ్లీ తామే వస్తామని అపుడు విశాఖ రాజాధాని అవుతుందని ఆయన అంటున్నారు.

అంటే మూడు రాజధానుల నుంచి వెనక్కి పోలేదని చెబుతూనే మరో వైపు అమరావతి రాజధాని కాదు అని చెప్పడమే వైవీ సుబ్బారెడ్డి మాటల వెనక ఆంతర్యం అని అంటున్నారు. ఇలా విపక్షాలను సైతం ఎదుర్కోఅడానికి కూడా వైసీపీ కొత్త వ్యూహం రూపొందించింది అని అంటున్నారు

విశాఖను రాజధానిగా చేద్దామనుకుంటే కోర్టుల ద్వారా అడ్డుకున్నారు అని చెప్పడం కూడా మరో ఉద్దేశ్యం. అయితే ఇవి జనాల బుర్రల్లోకి ఎంతవరకూ ఎక్కుతాయన్నదే ప్రశ్న. ఏది ఏమైనా రాజధాని అంశం వచ్చే ఎన్నికల్లో హాట్ టాపిక్ అవుతుందని వైసీపీ భావిస్తోంది. అయితే రాజధాని విషయంలో వైసీపీ విరుగుడు వ్యూహం ఎంత మేరకు ఫలిస్తుంది అన్నది చూడాలి. ఇదేనా లేక ఇంకా కొత్త వ్యూహాలు కూడా ఈ విషయంలో ముందుకు తెస్తారా అన్నది కూడా చూడాలి.