అందరి కళ్లూ నిడదవోలు మీదనే..... బాబు అరెస్ట్ మీద జగన్ ఏం చెబుతారో...?
ఏపీలో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్, జనసేన అధినేత పవన్ బాబుతో పొత్తు పెట్టుకోవడం ఇత్యాది విషయాలు అన్నీ కూడా జగన్ ప్రస్తావించే అవకాశాలు ఉండొచ్చు అంటున్నారు.
By: Tupaki Desk | 15 Sept 2023 6:07 PM ISTఏపీలో ఒక మాజీ ముఖ్యమంత్రి నాలుగున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న నేత చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రీ జైలులో ఉన్నారు. బాబు అరెస్ట్ అయి రిమాండ్ కి వెళ్లినపుడు జగన్ లండన్ లో ఉన్నారు. ఈ నెల 12న తెల్లవారుజామున ఆయన విజయవాడ చేరుకున్నారు. ముఖ్యమంత్రి వచ్చినా బాబు అరెస్ట్ మీద ఏ రకంగానూ కామెంట్స్ లేవు.
ఆయన యధావిధిగా తన పని తాను చేసుకుని పోతున్నారు. రివ్యూస్ నిర్వహిస్తూ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో గడుపుతున్నారు. ఈ నేపధ్యంలో విజయనగరంలో వైద్య కళాశాలను సీఎం జగన్ ప్రారంభించారు. అక్కడ బహిరంగ సభ ఉంటుందని జగన్ మాట్లాడుతారని అంతా అనుకున్నారు. కానీ ఇండోర్ లోనే మీటింగ్ జరిగింది.
వర్చువల్ గా జగన్ మెడికోలతో మాట్లాడారు. దాంతో జగన్ నోటి వెంట రాష్ట్రంలో జరిగిన తాజా పరిణామాల మీద కామెంట్స్ ఉంటాయని అనుకున్న వారు నిరాశ చెందారు. అయితే వేదిక అది కాదు అని తెలుస్తోంది. గోదావరి జిల్లాలలోని అతి ముఖ్య కేంద్రమైన నిడదవోలులో జగన్ పర్యటన శనివారం ఉంది. ఈ సందర్భంగా కాపు నేస్తం నిధులను మహిళల ఖాతాలో ఆయన వేయనున్నారు
అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ మాట్లాడుతారు అని తెలుస్తోంది. దాంతో అందరి కళ్లూ నిడదవోలు మీదనే ఉన్నాయి. ఏపీలో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్, జనసేన అధినేత పవన్ బాబుతో పొత్తు పెట్టుకోవడం ఇత్యాది విషయాలు అన్నీ కూడా జగన్ ప్రస్తావించే అవకాశాలు ఉండొచ్చు అంటున్నారు
తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయకూడదా, అవినీతి చేసిన వారితో పొత్తులు పెట్టుకుంటారా వంటి విషయాల మీద ఇప్పటికే వైసీపీ నుంచి కౌంటర్లు వచ్చి పడుతున్నాయి.జగన్ మనసులో ఏముంది ఆయన ఎలా ఈ పరిణామాల మీద రియాక్ట్ అవుతారు అన్నదే ఇపుడు అందరిలోనూ చర్చగా ఉంది.
జగన్ అయితే అసలు ఏపీలో ఏమీ జరగనట్లుగానే ఉంటున్నారు. బాబు అరెస్ట్ జరిగినా సీఎం నుంచి ఒక్క ప్రకటన లేదు. నిజానికి ఈ సమయంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు మీడియా ముందుకు వచ్చి ఇది చట్టబద్ధమైన అరెస్ట్, కక్ష సాధింపు కానే కాదని చెబుతారు. అయితే జగన్ మీడియాతో మీటింగ్స్ పెట్టరు కనీసం ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయలేదు, దాంతో జగన్ ఎక్కడైనా బరిరంగ సభలలో మాట్లాడితేనే ఆయన పవర్ ఫుల్ పంచులు ఏంటి అన్నవి జనాలకు తెలుస్తుంది.
ఏపీలో చంద్రబాబు వర్సెస్ జగన్ గా సాగుతున్న రాజకీయ యుద్ధంలో ఇపుడు వైసీపీ పై చేయి సాధించింది అయితే టీడీపీ దీనిని ఇప్పట్లో వదిలేలా లేదు. జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలని చూస్తోంది. బాబు అరెస్ట్ వేడిని అలాగే జనంలో ఉంచాలని చూస్తోంది. బెయిల్ కోసం ఒక వైపు ప్రయత్నం చేస్తూనే బాబు ఏ తప్పూ చేయని నిప్పు అంటోంది. వైసీపీ అక్రమంగా అరెస్ట్ చేయించింది అని కూడా అంటోంది. దానికి బదులు లేక జవాబు లేక తనదైన వాదన ఏదైనా జగన్ నిడదవోలు మీటింగులో చెబుతారా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.
కచ్చితంగా నిడదవోలు సభలోనే ముఖ్యమంత్రి బాబు అండ్ కో మీద నిప్పులు చెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గోదావరి జిల్లాలో రాజకీయంగా మార్పులను తెచ్చే ప్రాంతంలో జగన్ బాబు కేసులో ఏమి జరిగింది, ఏమి జరగనుంది అన్నది జనాలకు సోదాహరంగా వివరించడమే కాకుండా జనసేన టీడీపీ పొత్తుల మీద కూడా తనదైన శైలిలో కౌంటర్లు వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో అందరి చూపూ ఇపుడు నిడదవోలు దగ్గర ఆగింది అంటున్నారు.
