మమతకు సొంత పార్టీ ఎమ్మెల్యేల షాక్ : బెంగాల్ లో అనూహ్య పరిణామాలు!
అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకతతో ఓటమి ఎదుర్కొన్న మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి ధిక్కారం ఎదుర్కొంటున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
By: Tupaki Desk | 1 Jun 2026 10:00 PM ISTపశ్చిమబెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకతతో ఓటమి ఎదుర్కొన్న మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి ధిక్కారం ఎదుర్కొంటున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తాజాగా మమత నివాసంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఉదహరిస్తున్నారు. మమత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. పార్టీలో నెంబర్ టు నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయగా, మూడొంతుల మంది ఎమ్మెల్యేలు రాకపోవడంతో మమతపై తిరుగుబాటుకు ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అభిషేక్ బెనర్జీపై దాడి బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దాడిని నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చిన మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. దీనికి కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి మూడుంతుల మంది ఎమ్మెల్యేలు మమత సమావేశానికి దూరంగా ఉండటం చూస్తుంటే, పార్టీపై మమత పట్టు సడులుతుందా? అనే డౌటు వస్తోందని అంటున్నారు.
‘నిరసనల’ సాకు
కాగా, ఎమ్మెల్యేల గైర్హాజరీపై తృణమూల్ కాంగ్రెస్ మాత్రం భిన్నమైన వివరణ ఇస్తోంది. ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో నిరసన ప్రదర్శనల్లో బిజీగా ఉండటం వల్లే రాలేకపోయారని డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం దీన్ని నమ్మలేమని వ్యాఖ్యానిస్తున్నారు. అభిషేక్ బెనర్జీపై దాడిని నిరసిస్తూ పార్టీ లీడర్‌షిప్ తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీలోనే కొందరికి నచ్చడం లేదని పార్టీలో టాక్ నడుస్తున్నట్లు చెబుతున్నారు.
నేతల వలసలు ఖాయం?
సమావేశానికి ఎమ్మెల్యేలు రాకపోవడం ఒక ఎత్తయితే... ఇప్పటికే ఒక ఎంపీ, పలువురు ముఖ్య నేతలతో పాటు ఏకంగా 100 మంది కౌన్సిలర్లు టీఎంసీకి రాజీనామా చేయడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో పార్టీ ఓటమి తర్వాత 20 మంది ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో కలవడానికి సిద్ధంగా ఉన్నారని అధికార పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని ఇన్నాళ్లు టీఎంసీ తోసిపుచ్చింది. అయితే ఈ రోజు మాజీ సీఎం, పార్టీ అధినేత్రి మమత నిర్వహించిన సమావేశానికే ఎమ్మెల్యేలు ముఖం చాటేయడం చూస్తే, టీఎంసీ ఎంపీ, ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారనే ప్రచారంలో ఎంతో కొంత నిజం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
