Begin typing your search above and press return to search.

టీడీపీ గెలుపు కోసం ముఖం వాచిన సీటు...!?

తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ముఖం వాచిన సీటుగా విజయనగరం జిల్లాలో బొబ్బిలిని చెబుతారు

By:  Tupaki Desk   |   16 Jan 2024 4:03 AM GMT
టీడీపీ గెలుపు కోసం ముఖం వాచిన సీటు...!?
X

తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ముఖం వాచిన సీటుగా విజయనగరం జిల్లాలో బొబ్బిలిని చెబుతారు. టీడీపీ పుట్టాక అక్క్కడ గెలిచింది కేవలం రెండు సార్లు మాత్రమే. అంటే 1985లో ఒకసారి 1994లో మరోసారి. ఆ రెండు సార్లూ ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంబంగి చిన అప్పలనాయుడే టీడీపీ అభ్యర్ధిగా ఉంటూ ఆ పార్టీని గెలిపించారు.

ఇక టీడీపీ ఏర్పడ్డాక 1983 నుంచి ఇప్పటికి తొమ్మిసార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు కాంగ్రెస్ గెలిచింది. రెండు సార్లు టీడీపీ, మరో రెండు సార్లు వైసీపీ గెలిస్తే ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా శంబంగి గెలిచారు. అలా శంబంగికి ఒక రికార్డు చరిత్ర ఉన్నాయి. అది కూడా 1983లో టీడీపీ వేవ్ లో ఇండిపెండెంట్ గా బొబ్బిలి నుంచి శంబంగి గెలవడం అంటే ఆయన స్టామినా గురించి ఆలోచించాల్సిందే.

బేసికల్ గా చూస్తే ఈ సీటు కాంగ్రెస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ వచ్చింది. బొబ్బిలి రాజులకు విజయనగరం రాజులకు మధ్య ఉన్న చారిత్రాత్మకమైన వైరం కూడా రాజకీయంగా ప్రభావం చూపించింది అనుకోవాలి. విజయానరం రాజులు టీడీపీ వైపు ఉండడంతో బొబ్బిలి ఎపుడూ కాంగ్రెస్ కి జై కొడుతూ వచ్చింది ఇక కాంగ్రెస్ అంతర్ధానం అయ్యాక వైసీపీ వైపు ఈ సీటు మళ్ళింది.

ఈ రోజుకీ బొబ్బిలి వైసీపీకి గట్టి పట్టున్న సీటుగానే ఉంది. అయితే ఈసారి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగిని మార్చాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. దాంతో బొబ్బిలిలో వైసీపీ అభ్యర్ధి ఎవరు అన్నది హాట్ హాట్ చర్చగా ఉంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడుకు ఈసారి టికెట్ ఇవ్వరని అంటున్నారు. ఆయన పనితీరు పట్ల వ్యతిరేకంగా సర్వే నివేదికలు ఉన్నాయని అంటున్నారు. దాంతో కొత్త ముఖం కోసం అన్వేషణ సాగుతోంది.

ఇక బొబ్బిలి రాజులు అనూహ్యంగా 2017లో టీడీపీ వైపు వచ్చారు. వైసీపీ నుంచి గెలిచిన సుజయ క్రిష్ణ రంగారావు టీడీపీలో చేరారు. ఆయనకు మంత్రి పదవి కూడా లభించింది. ఇక 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే ఓటమి తొలిసారిగా ఎదురైంది. 2024 ఎన్నికల్లో ఆయన తమ్ముడు బేబీ నాయన పోటీ చేస్తున్నారు.

ఈసారి ఎలాగైనా గెలిచి టీడీపీకి మూడు దశాబ్దాలుగా ఉన్న గెలుపు ఆకలిని తీర్చాలని బొబ్బిలి రాజులు కంకణం కట్టుకున్నారు. ఒక విధంగా కసిగానే పనిచేస్తున్నారు. వైసీపీ వైపు చూస్తేనే అభ్యర్ధి ఎవరు అన్నది తెలియడంలేదు. శంబంగిని తప్పిస్తే ఆ పార్టీకి ఆ స్థాయి నాయకుడు బొబ్బిలి రాజులను ఢీ కొట్టే వారు దొరుకుతారా అన్నది కూడా వేధిస్తున్న ప్రశ్న.

బొబ్బిలిలో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని వైసీపీ ఉంది. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా బొబ్బిలి రాజులను ఓడించేలా వ్యూహరచన చేస్తున్నారు. ఇక వైసీపీ తరఫున పోటీ చేసే ఆ కొత్త ముఖం ఎవరు అన్నది కొద్ది రోజులలో తేలుతుంది అని అంటున్నారు.