మంటల్లో ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుల్లో ఎమ్మెల్యే?
ఇక ప్రయాణికుల్లో ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంగు ఖిల్లా ఉన్నారు. చిత్రకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన భువనేశ్వర్ నుంచి సొంత నియోజకవర్గానికి వస్తుండగా, ప్రమాదంలో చిక్కుకున్నారు.
By: Tupaki Desk | 21 March 2026 3:04 PM ISTప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం ప్రాణ గండంగా మారుతోంది. గమ్యస్థానానికి చేరుస్తాయనుకున్న ప్రైవేటు ట్రావెల్స్ ప్రమాద శకటాలుగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా రామభద్రాపురం సమీపంలో ఒడిశాకు చెందిన ట్రావెల్స్ బస్సు తగలబడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను గండం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం తారాపురం వద్ద రాయపూర్ హైవేపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దహనమైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి మల్కానగిరి వెళుతున్న బస్సు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారితే శనివారం అనగా ప్రమాదానికి గురైంది. బస్సు వెనుక టైర్ పేలడంతో రోడ్డుపై రాపిడి చోటుచేసుకుని మంటలు చెలరేగాయి. ఇవి బస్సును అంటుకోవడంతో కొద్దిసమయంలోనే మంటలు విస్తరించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ నిద్రలో ఉన్న ప్రయాణికులను అలర్ట్ చేసి బస్సు నుంచి దింపేశారు. ఆ సమయంలో బస్సులో మొత్తం 37 మంది ఉన్నారు.
ఇక ప్రయాణికుల్లో ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంగు ఖిల్లా ఉన్నారు. చిత్రకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన భువనేశ్వర్ నుంచి సొంత నియోజకవర్గానికి వస్తుండగా, ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకుని ఏపీ పోలీసులు ఆయనకు రక్షణ కల్పించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఎమ్మెల్యే మంగు ఖిల్లాతోపాటు మిగిలిన ప్రయాణికులను వారి స్వస్థలాలకు తరలించారు. ఇటీవల కాలంలో బస్సులు ఈ తరహా ప్రమాదాలకు గురికావడం పరిపాటిగా మారిందనే ఆవేదన వ్యక్తమవుతోంది.
నిద్రలో ఉన్న ప్రయాణికులను నిలువునా దహిస్తూ, నిమిషాల వ్యవధిలోనే బస్సులు అగ్నిగుండాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అతివేగం, వేడి వల్ల టైర్లు పేలి, రోడ్డుపై రాపిడి జరిగి మంటలు చెలరేగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పాత బస్సులను సరైన ఫిట్‌నెస్ లేకుండా నడపడం వల్ల కూడా ప్రమాదాలకు కారణమవుతోందని అంటున్నారు. బస్సుల్లోని ఏసీ యూనిట్లు, వైరింగ్‌లో లోపాల వల్ల కూడా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. గత ఏడాది కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామం వద్ద ట్రావెల్స్ బస్సు కాలిపోయి సుమారు 25 మంది దుర్మరణం చెందారు. ఆ తరువాత వరుసగా ఇలాంటి ప్రమాదాలు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
