విశాఖలో శ్రద్ధా వాకర్ తరహా హత్య - ఫ్రిజ్‌లో శరీర భాగాలు!..
ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఉదంతం దేశాన్ని ఎంతలా వణికించిందో మనందరికీ తెలుసు.
By: Tupaki Desk | 30 March 2026 12:10 PM ISTఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఉదంతం దేశాన్ని ఎంతలా వణికించిందో మనందరికీ తెలుసు. సరిగ్గా అదే తరహాలో విశాఖపట్నంలోని గాజువాకలో ఒక ప్రియురాలు తన ప్రియుడి చేతిలోనే దారుణంగా హత్యకు గురవ్వడం, ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచడం వంటి వార్తలు వింటుంటే సభ్య సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. రక్షణ రంగంలో పనిచేస్తూ క్రమశిక్షణతో ఉండాల్సిన వ్యక్తి, ఒక నిండు ప్రాణాన్ని అంత దారుణంగా బలితీసుకోవడం అత్యంత విచారకరం. పెళ్లికి అడ్డు వస్తుందనే కారణంతో మూడేళ్ల బంధాన్ని ఇంత కిరాతకంగా అంతమొందించిన ఈ ఘోర ఉదంతం ప్రజలను కలిచివేస్తుంది.
శ్రద్ధా వాకర్ తరహా హత్య..
గాజువాక ప్రాంతంలో జరిగిన ఈ హత్యోదంతం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నిందితుడు రవీందర్, తన ప్రియురాలు మౌనికను చంపడమే కాకుండా, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించాడు. మౌనిక శరీర భాగాలను ముక్కలుగా నరికి కొన్నింటిని ఫ్రిజ్‌లో దాచగా, మిగిలిన సగ భాగాన్ని ఒక గోనె సంచిలో కుక్కి బయట పారేసేందుకు సిద్ధం చేశాడు. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రవీందర్, నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి ఇంతటి అమానుషానికి ఒడిగట్టడం గమనార్హం.
మూడేళ్ల పరిచయం.. పెళ్లి కోసం ఒత్తిడి
మౌనిక, రవీందర్ మధ్య మూడేళ్లుగా పరిచయం ఉంది. వీరి బంధం పెళ్లి వరకు వెళ్తుందని మౌనిక నమ్మింది. మౌనికకు తెలియకుండా రవీందర్ ఇటీవలే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మౌనిక, తనను కూడా పెళ్లి చేసుకోవాలని లేదా తనకు న్యాయం చేయాలని రవీందర్‌పై ఒత్తిడి తెచ్చింది. తన కొత్త వైవాహిక జీవితానికి మౌనిక అడ్డుగా మారుతుందని భావించిన రవీందర్, ఆమెను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. రవీందర్ భార్య నెల క్రితమే పుట్టింటికి వెళ్లడంతో, ఆ అవకాశాన్ని వాడుకొని మౌనికను ఇంటికి పిలిపించి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
వెలుగులోకి వాస్తవాలు!
మౌనిక కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ప్రియుడు రవీందర్ కదలికలపై నిఘా ఉంచారు. జరిగిన ఘటన తెలుసుకొని పోలీసులు షాక్‌కు గురయ్యారు. రవీందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఫ్రిజ్, గోనె సంచిలో ఉన్న శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి.. ఇంతటి ఘోరానికి పాల్పడినందుకు అతనికి గట్టి శిక్ష పడేలా బలమైన సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు.
పెరుగుతున్న రిలేషన్ షిప్ క్రైమ్స్
ఇటీవలి కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో జరుగుతున్న హత్యలు సమాజంలో భద్రతపై ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఒక వ్యక్తిని నమ్మి మూడేళ్లు కలిసి ఉన్నందుకు మౌనికకు దక్కిన ప్రతిఫలం మరణం. సమస్యలను చర్చల ద్వారా లేదా చట్టపరంగా పరిష్కరించుకోకుండా, ప్రాణాలు తీయడమే పరిష్కారం అని భావించడం విచారకరం అని వాదనలు వినిపిస్తు్న్నాయి.
ప్రేమ పేరుతో మోసగించే వారు.., ఆవేశంలో ప్రాణాలు తీసే వారు సమాజంలో పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి నేరాలకు పాల్పడడం గమనార్హం. ఇలాంటి నేరగాళ్లకు చట్టం అత్యంత వేగంగా, కఠినంగా శిక్ష విధిస్తేనే భవిష్యత్తులో ఇతరులకు భయం కలుగుతుంది. మౌనిక ఆత్మకు శాంతి కలగాలని ఆశిద్దాం.
