Begin typing your search above and press return to search.

బాబు లోకేష్ : ఫుల్ బిజీ బిజీ !

మరో వైపు ఐటీ మంత్రి నారా లోకేష్ ఐటీలో హైదరాబాద్‌ కంటే మెరుగ్గా విశాఖను మారుస్తాం అని ఒక కీలక ప్రకటన చేశారు.

By:  Satya P   |   28 April 2026 11:14 PM IST
బాబు లోకేష్ : ఫుల్ బిజీ బిజీ !
X

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ విశాఖలో రెండు రోజులు బిజీ బిజీగా గడిపారు. విశాఖలో రాత్రి బస చేసి మరీ ఊపిరాడని తీరులో సమావేశాలు నిర్వహించారు. ఇవన్నీ ఏపీ అభివృద్ధికి దోహదపడేవే అన్నది వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఒక క్షణం తీరిక లేకుండా తండ్రీ కొడుకులు ఇద్దరూ అధికారిక హోదాలో విశాఖలో గడపడం మరింత విశేల్షం. సాధారణంగా చంద్రబాబు నుంచి ఇలాంటివి ఎన్నో అంతా చూశారు. ఆయన రోజులో ఎన్ని గంటలు అయినా అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీటింగుల మీద మీటింగులు పెడుతూ ఉంటారు. కానీ లోకేష్ కూడా అదే విధంగా అలుపు లేకుండా విశాఖలో మొత్తం అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం మీదనే చర్చ సాగుతోంది.

ఏయూ నుంచి గూగుల్ దాకా :

విశాఖలో ఏయూ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు సీఎం హోదాలో బాబు విద్యా మంత్రి హోదాలో లోకేష్ సోమవారం వచ్చారు. ఆ కార్యక్రమం తరువాత గూగుల్ ప్రతినిధులతో కలసి రాత్రి సమావేశం అయ్యారు. ఇక తెల్లారుతూనే ఆనందపురం మండలం వద్ద ఉన్న తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు హాజరయ్యారు. అక్కడ ఇద్దరూ తమ స్పీచులతో అలరించారు. అక్కడ నుంచి చంద్రబాబు సింహాచలం వరాహ నరసింహ స్వామి వారిని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలసి దర్శించుకున్నారు. ఆ మీదట ఏపీలో రైల్వే ప్రాజెక్టుల మీద చంద్రబాబు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. విశాఖకు ఏపీకి మేలు చేసే పలు ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రి దృష్టికి బాబు తీసుకుని రావడం జరిగింది.

మరిన్ని సెక్షన్లు విలీనం :

ఇక విశాఖ కేంద్రంగా ఏర్పాటు అవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధిలోకి మరి కొన్ని సెక్షన్లు కలుపుతూ పాలనా పరమైన మార్పులు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిధిలోకి వచ్చే అరకు - కొత్తవలస సెక్షన్ లను అలాగే కర్నూల్ డోన్ సెక్షన్లను కొత్త జోన్‌లో కలపడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని చంద్రబాబు చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలో కీలకమైన ప్రాంతాలలో రైల్వే లైన్ల గురించి కేంద్ర మంత్రికి వివరించడం ద్వారా వాటి అభివృద్ధికి కొత్త లైన్ల ఏర్పాటు గురించి కూడా చర్చించారు.

హైదరాబాద్ కి ధీటుగా :

మరో వైపు ఐటీ మంత్రి నారా లోకేష్ ఐటీలో హైదరాబాద్‌ కంటే మెరుగ్గా విశాఖను మారుస్తాం అని ఒక కీలక ప్రకటన చేశారు. రానున్న పదేళ్ల కాలంలో విశాఖ నగరం ఐటీ హబ్‌గా మారుతుందని లోకేష్ చెప్పుకొచారు విశాఖలో గూగుల్‌ సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో ఏఐ శక్తి కాన్‌క్లేవ్‌ నిర్వహించిన కార్యక్రమంలో లోకేశ్‌ మాట్లాడుతూ ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్‌ కంటే మేటిగా విశాఖను మారుస్తామని స్పష్టం చేశారు. విశాఖలో ఐటీ ఏఐకి సంబంధించి పూర్తి ఎకో సిస్టమ్‌ తయారు చేస్తున్నామని అన్నారు. డేటా సెంటర్లు తేవడమే కాదు వాటి నిర్వహణ కూడా కీలకమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలను తెచ్చి యువతకు ఉపాధి కల్పించమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, సంస్థల పురోగతిపై ప్రతి వారం సమీక్ష చేపడుతున్నామని లోకేష్ చెప్పడం విశేషం. మొత్తం మీద చంద్రబాబు లోకేష్ ఇద్దరూ రెండు రోజుల పాటు విశాఖలో అధికారిక కార్యక్రమాలలో ఫుల్ బిజీగా గడిపారు. విశాఖ గ్లోబల్ సిటీ అంటూ ప్రకటించడమే కాదు ఉత్తరాంధ్రాతో పాటు ఏపీ భవిష్యత్తు మరుతోందన్న గట్టి భరోసాను ఇచ్చారు.