Begin typing your search above and press return to search.

జగన్..పవన్...బాబు : విశాఖను తెగ లవ్ చేస్తున్నారుగా !

మాకు విశాఖ అంటే ఎంత ప్రేమో అని రెండు చేతులూ బార చాపి చూపిస్తున్నారు విశాఖకి తాము శాశ్వత ప్రేమికులం అని చెప్పేస్తున్నారు

By:  Tupaki Desk   |   16 Aug 2023 2:30 PM GMT
జగన్..పవన్...బాబు : విశాఖను తెగ లవ్ చేస్తున్నారుగా !
X

విశాఖ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు మోసిన విశాఖ అంటే అటు అధికారుల నుంచి ఇటు పర్యాటకులు నుంచి సాధారణ జనాలు కూడా విపరీతంగా లైక్ చేస్తారు. అలాంటి విశాఖ మీద ఇపుడు పొలిటీషియన్స్ లవ్ పెరిగిపోతోంది. మాకు విశాఖ అంటే ఎంత ప్రేమో అని రెండు చేతులూ బార చాపి చూపిస్తున్నారు విశాఖకి తాము శాశ్వత ప్రేమికులం అని చెప్పేస్తున్నారు.

అద్భుత విశాఖ అందాల విశాఖ మా విశాఖ అని కవితలు అల్లుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గురించే చెప్పుకుంటే నాకు విశాఖకు ఉన్న అనుబంధం అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతున్నారు. విశాఖతో నన్ను ఎవరూ విడదీయలేరు. విశాఖతో ముడిపడిన బంధాన్ని ఎప్పటికీ కొనసాగిస్తా అంటున్నారు.

విశాఖ వంటి నగరం దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ని చంద్రబాబు ఇచ్చేశారు. విశాఖకు ఉన్న పొటెన్షియాలిటీని మొట్ట మొదట గుర్తించింది తానే అని కూడా క్లెయిం చేసుకుంటున్నారు చంద్రబాబు. విశాఖ మీద నాకు ఉన్న ప్రేమ ఎవరికైనా ఉందా అని డేరింగ్ గా ప్రశ్నిస్తున్నారు కూడా. విశాఖ ఏపీకే తలమానికం అంటున్నారు. మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే విశాఖకు ఎక్కడో తెచ్చి నిలబెడతామని బాబు అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే విశాఖ తో సుదీర్ఘమైన అనుబంధం అని ఆయన చెప్పుకుంటున్నారు. ఇక జనసైనికులు అయితే పవన్ విశాఖలోనే సినిమాకు సంబంధించిన శిక్షణ అంతా తీసుకున్నారని, విశాఖలో పవన్ సినిమాలు ఎన్నో షూటింగులు జరిగాయని, విశాఖలోనే పవన్ కి విశేషం అభిమాన జనం ఉందని అంటున్నారు.

పవన్ అయితే గాజువాకలో జరిగిన వారాహి సభలో మాట్లాడుతూ ప్రశాంత విశాఖలో అశాంతిని వైసీపీ నేతలు రేపేందుకు చూస్తున్నారు అని విమర్శించారు. వారి ఆటలు అసలు సాగనివ్వనని అంటున్నారు. తాను ఏపీ వాసిని అని ఆయన చెప్పుకున్నారు. మంగళగిరికి పూర్తిగా షిఫ్ట్ అయిపోయానని కూడా వివరించారు. అయితే తొందరలోనే విశాఖలో రెండవ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని, అన్ని వేళలా ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని పవన్ చెప్పడం విశేషం.

అంటే పవన్ కి ఏపీలో ఇల్లు లెదని, ఆయన పరాయి రాష్ట్రానికి చెందిన వారు అంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పవన్ నుంచి వచ్చిన ధీటైన జవాబు ఇదన్న మాట. మంగళగిరిలో తనకు ఇల్లు ఉందని, రెండవ ఇల్లు విశాఖలో ఉంటుందని పవన్ చెప్పడం ద్వారా జగన్ చెప్పిన మూడు రాజధానుల కాన్సెప్టులో రెండు రాజధానులకు ఇండైరెక్ట్ గా తనకు తెలియకుండానే ఓకే చెప్పేశారా అని అంటున్నారు

ఇక ఏపీకి విశాఖ పాలనా రాజధాని అయిన తరువాత ఒక్క పవన్ ఏంటి అందరూ ఈ వైపుగా రావాల్సిందే అని వైసీపీ నేతలు దీని మీద కౌంటర్లు వేస్తున్నారు. చంద్రబాబు ఇల్లు కట్టుకుంటాను అని అనలేదు కానీ విశాఖను గుండెల్లో పెట్టుకుంటాను అని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే విశాఖలో ఏకంగా ఇల్లే కట్టేసుకుంటున్నారు. తాను విశాఖ వాసిని అవుతాను అని కొద్ది నెలల క్రితమే జగన్ చెప్పేశారు.

సో జగన్ అక్టోబర్ నాటికి అంటే విజయదశమి వేళకు విశాఖలో మకాం పెట్టడం ఖాయమని అంటున్నారు. ఇలా కనుక చూసుకుంటే విశాఖ మీద అందరికీ ప్రేమ ఇట్టే పెరిగిపోతోంది అన్న మాట. బీజేపీ ఎంపీగా ఉన్న జీవీ ఎల్ నరసింహారావు విశాఖలో రెండేళ్ల క్రితమే ఇల్లు కొనుక్కుని తాను విశాఖ వాసిని అనిపించేసుకున్నారు.

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరికి కూతురు ఇల్లు ఉంది. వీలు అయితే ఆమె కూడా విశాఖలో ఇల్లు కట్టుకోవడం కష్టమేమీ కాదు. ఇలా విశాఖ మాది అంటూ లవ్ చేస్తున్న నేతాశ్రీలు అంటే ఈ సిటీ మీద నిజంగా ప్రేమ పెంచుకుంటున్నారా లేక అది కూడా ఎన్నికల స్టంట్ నా అన్నది 2024 తరువాత తేలనుంది అని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ మాత్రం అందరినీ ఆకట్టుకున్నట్లే పొలిటీషియన్స్ ని కూడా ఆకట్టుకుంటోంది అని అంటున్నారు ఇక్కడి జనం. అంతకంటే వారు ఈ విషయాన్ని సీరియస్ గా అయితే తీసుకోవడం లేదు.