పెళ్లి వాయిదాపై కోపంతో తల్లీకూతుళ్లపై దాడి.. ప్రేమోన్మాది చేతుల్లో తల్లి మృతి
ఏపీలో దారుణ నేరాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఒక ఘోర ఘటన దిగ్భాంత్రికి గురి చేయటమే కాదు.. ఒకరి ప్రాణాలు పోయేలా చేసింది.
By: Tupaki Desk | 3 April 2025 10:20 AM ISTఏపీలో దారుణ నేరాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఒక ఘోర ఘటన దిగ్భాంత్రికి గురి చేయటమే కాదు.. ఒకరి ప్రాణాలు పోయేలా చేసింది. పెళ్లిని వాయిదా వేస్తున్నారన్న ఆగ్రహంతో ప్రేమోన్మాది జరిపిన దాడిలో ఒకరు మృతి చెందారు. విచక్షణారహితంగా తల్లీకూతుళ్లపై దాడి చేయగా.. ఘటనాస్థలంలోనే తల్లి మృతి చెందగా.. కుమార్తె తీవ్ర గాయాల బారిన పడింది. ఆరేళ్ల క్రితం ఒక ఫంక్షన్ లో పరిచయమైన వ్యక్తి.. తాజా దారుణానికి కారణంగా చెప్పాలి. అసలేం జరిగిందంటే..
పార్వతీపురం మన్యం జిల్లాలోని పెద్దపుర్లికి చెందిన రాజు కుటుంబం విశాఖకు వలస వచ్చింది. అతడు కారు డ్రైవర్ గా పని చేస్తుంటాడు. భార్య ఇంటి వద్దే ఉంటుంది. ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తెక దీపికకు 20 ఏళ్లు. ఆరేళ్ల క్రితం ఉంపనసనందివాడలోని తన పిన్ని ఇంటికి ఒక ప్రోగ్రాం కోసం వెళ్లింది. వారి ఎదురింట్లో ఉండే 26 ఏళ్ల నవీన్ పరిచయమయ్యాడు. డిగ్రీ పూర్తి చేసిన అతను ఖాళీగా ఉంటున్నాడు. దీపిక విషయానికి వస్తే విశాఖలోని మహిళా కాలేజీలో మైక్రో బయాలజీ పూర్తి చేసి నర్సింగ్ చేస్తోంది.
ఈ క్రమంలో దీపికను పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెస్తున్నాడు. అయితే.. అతడి ప్రవర్తన సరిగా లేకపోవటంతో పెళ్లిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. దీంతో.. పెళ్లికి ఓకే చెప్పకుంటే చంపేస్తానని పలుమార్లు బెదిరించటంతో వారు మరింత బెదిరిపోయిన పరిస్థితి. రాజుకు వ్యతిరేకంగా కంప్లైంట్ చేస్తే.. అతడి భవిష్యత్ ఎక్కడ పాడవుతుందన్న ఆలోచనతో వారు ఫిర్యాదు చేయలేదు. ఆ ఆలోచనే వారి కుటుంబానికి పెను విషాదానికి కారణమైంది. బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో కొమ్మాది జంక్షన్ కు దగ్గర్లోని బాధిత కుటుంబం వద్దకు వచ్చాడు నవీన్.
ఎప్పటిలానే పెళ్లి ప్రస్తావన తేవటం.. కొన్నాళ్ల తర్వాత చేస్తామని దీపిక తల్లి చెప్పటంతో.. ఉన్మాదంతో ఊగిపోతూ తల్లీకూతుళ్లపై చాకుతో దాడి చేశాడు. విచక్షణారహితంగా పొడవటంతో దీపిక తల్లి లక్ష్మీ అక్కడికక్కడే మరణించింది. దీపిక తీవ్రంగా గాయపడి స్ప్రహ కోల్పోయింది. దీంతో.. నిందితుడు పరారయ్యాడు. కాసేపటికి స్ప్రహలోకి వచ్చిన దీపిక తల్లి చలనం లేకపోవటంతో అతి కష్టమ్మీదా మేడ మీద నుంచి కిందకు వచ్చిఆర్తనాదాలు చేయటంతో పక్కనున్నవారు స్పందించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రక్తపు మడుగులో ఉన్న దీపికను టూవీలర్ మీద దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు నవీన్ ను సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా శ్రీకాకుళంలోని వీరఘట్టం వెళుతుండగా అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం.. దీపికను గడిచిన కొన్నాళ్లుగా నవీన్ వేధిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎవరితో ఫోన్ మాట్లాడినా అనుమానిస్తూ ఉండటం.. ఇటీవల కాలంలో ఆమెపై చేయి చేసుకోవటం మొదలైంది.
దీంతో నవీన్ కు తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసే విషయంలో దీపిక తల్లిదండ్రులు పునరాలోచనలో పడ్డారు. ఈ కారణంగానే పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా.. గడిచిన పది రోజులుగా నవీన్ ఫోన్ ను దీపిక ఎత్తకపోవటంతో ఆమెను చంపేయాలన్న ఆలోచనకు నవీన్ వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భాంత్రికి గురయ్యారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారు. దారుణ నేరానికి పాల్పడిన నవీన్ ను పోలీసులు మెరుపు వేగంతో రియాక్టు అయి గంటల వ్యవధిలో అతడ్ని అదుపులోకి తీసుకోవటం గమనార్హం.
