Begin typing your search above and press return to search.

తలలు బద్దలు కొట్టుకుంటున్నామన్న టీడీపీ ఎంపీ !

ఇపుడు అదే మాటను విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్ చెప్పడం గమనార్హం.

By:  Satya P   |   17 Jun 2026 8:49 AM IST
తలలు బద్దలు కొట్టుకుంటున్నామన్న టీడీపీ ఎంపీ !
X

ఏపీలో టీడీపీ కూటమికి చెందిన ఏపీ, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీయే ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ తో అత్యంత బలోపేతంగా ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న నేత తలలు బద్దలు కొట్టుకుంటున్నామని చెప్పడం నిజంగా విశేషమే. మరి అధికార ఎంపీకే సాధ్యం కాని విషయం ఏమిటి ఆయన ప్రభుత్వానికే కొరుకుడు పడని సమస్య ఏమిటి అంటే ఆలోచిస్తే పెద్ద విషయమే అని అంటున్నారు.

రుషికొండ గురించే :

విశాఖలోని రుషికొండ మీద ఆనాటి వైసీపీ ప్రభుత్వం విలాసవంతమైన భవనాలను నిర్మించింది. దీని కోసం ఏకంగా 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. అయితే ఈ భవనాలు పర్యాటకులకు ఉపయోగకరంగా లేవని అలాగే ఎవరికైనా లీజుకి ఇచ్చేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని పలు మార్లు కూటమి నేతలు చెప్పిన సంగతి విధితమే. ఇపుడు అదే మాటను విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్ చెప్పడం గమనార్హం.

ఎవరూ రావడం లేదు :

రుషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకుని వద్దామని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నామని ఎంపీ చెప్పారు. అందుకోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేకుండా పోతోంది అని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ కి ఇద్దామని చూసినా ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన లేటెస్ట్ రిపోర్టుని బయటపెట్టారు. దాంతో ఈ భవనాలను ఎలా ఉపయోగించాలన్నది తమ ప్రభుత్వానికి అర్థం కావడం లేదని ఎంపీ చెప్పుకొచ్చారు.

మంత్రి వర్గ ఉప సంఘం :

ఇదిలా ఉంటే చాలా కాలం క్రితమే కూటమి ప్రభుత్వం పలువురు మంత్రులతో మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఆ ఉప సంఘం అనేక సార్లు సమావేశం అయింది కూడా. రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగంలోకి తీసుకుని రావాలని చర్చించింది కూడా. కొద్ది నెలల క్రితం సమావేశమై తుది నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని కూడా చెప్పింది. మరి ఆ తరువాత ఏమీ విషయం తెలియలేదు. తాజాగా ఎంపీ మాటలను బట్టి చూస్తే కనుక రుషికొండ భవనాలు అలాగే ఉండిపోయాయని అంటున్నారు. లీజుకు ఎవరికి ఇద్దామని చూసినా ముందుకు రావడం లేదు అంటే ప్రభుత్వ ధనం వృధాయే అన్న చర్చ సాగుతోంది.

నెలకు పాతిక లక్షలు :

ఇక రుషికొండ భవనాల నిర్వహణకు నెలకు పాతిక లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. ఏడాదికి ఆ విధంగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు తప్ప ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరడం లేదు, మరో వైపు చూస్తే వైసీపీ టైంలో పూర్తి అయి రెండేళ్ళు కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు మొత్తంగా నాలుగేళ్ల పాటు భవనాలు ఖాళీగా ఉండడం వల్ల పెచ్చులు ఊడడం లాంటివి కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఒక విధంగా రుషికొండ గుదిబండగా మారుతోంది అన్న చర్చ కూడా ఉంది. మరి ఈ విషయంలో రానున్న కాలంలో అయినా ఈ భవనాలను వేరేగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అది వీలు అవుతుందా లేదా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది మరి.