ఏడాదిలో 175 కోర్సులు పూర్తి... ఏపీలో పదోతరగతి బాలిక ప్రతిభ!
సాధారణంగా స్కూల్ అయిపోగానే విద్యార్థులు హోం వర్క్ పూర్తి చేసి, బ్యాగ్ ఓ పక్కన పడేసి ఆటలకు పరుగుతీస్తారనే సంగతి తెలిసిందే!
By: Tupaki Desk | 1 May 2025 5:00 PM ISTసాధారణంగా స్కూల్ అయిపోగానే విద్యార్థులు హోం వర్క్ పూర్తి చేసి, బ్యాగ్ ఓ పక్కన పడేసి ఆటలకు పరుగుతీస్తారనే సంగతి తెలిసిందే! చాలా మంది ఆల్ మోస్ట్ పదో తరగతి వరకూ ఇలానే చేస్తారని చెప్పొచ్చు. అయితే.. ఇప్పుడు చెప్పుకోబోయే విద్యార్థిని అందుకు పూర్తి భిన్నం. స్కూల్ ముగిసిన తర్వాత అక్కడే ఉండి ఆన్ లైన్ లో 175 కోర్సులు పూర్తి చేసింది.
అవును... పదో తరగతిలోకి ఎంటర్ అయితే దాదాపు పిల్లలంతా చదవడం, పరీక్షలు రాయడం, అత్యధిక మార్కులు తెచ్చుకోవడంపైనే దృష్టి సారిస్తారు! అయితే... ఈ విద్యార్థిని మాత్రం అంతకు మించిన ఆలోచన చేసింది. రెగ్యులర్ క్లాసులకు అటెండ్ అవుతూనే.. ఖాళీ సమయాల్లో 175 సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసింది. అది కూడా ఏడాది వ్యవధిలో కావడం గమనార్హం.
ఆ విద్యార్థిని పేరు బండారు ప్రవల్లిక. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 10వ తరగతి పూర్తి చేసింది. ఈ సమయంలో టైం మేనేజ్ మెంట్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, డ్రోన్, రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా 175 కోర్సులు పూర్తి చెసింది. ఒక్కో కోర్సు నేర్చుకోవడానికి మూడు గంటల నుంచి ఒక రోజు సమయం పట్టేదని చెబుతోంది.
ఇదే సమయంలో... పదోతరగతి బోర్డు పరీక్షల్లో 600కి 557 మార్కులు సాధించింది. అలా అని ఆమె ప్రతిభ అంతా విద్యలోనే అనుకుంటే పొరపాటే... ఆటల్లోనూ ఆమె అలానే రాణిస్తోంది. ఇందులో భాగంగా.. స్కూల్ క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉంటూ.. రాష్ట్ర స్థాయిలో పతకాలను కూడా గెలుచుకుంది.
అదేవిధంగా... ప్రవళ్లిక నుంచి ప్రేరణ పొందిన మరికొంతమంది విద్యార్థులు 100కి పైగా కోర్సులను పూర్తి చేశారు.
