విజయసాయికి ఎడాపెడా వాగింపు..
‘‘ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు.
By: Tupaki Desk | 22 April 2025 7:34 PM IST‘‘ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను.’’ అంటూ వైసీపీ మాజీ నేత వి.విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ ట్వీట్ ద్వారా ఆయన ఎవరికి దగ్గరవ్వాలని ప్లాన్ చేశారో గానీ అది మిస్ ఫైర్ అయి తిరిగి ఆయనకే రివర్స్ అటాక్ లో ఇబ్బందులు పెడుతోందని టాక్ వినిపిస్తోంది. రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పిన విజయసాయి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో పావుగా మారి తమ పార్టీ వారిని ఇబ్బంది పెట్టేలా పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుండగా, విజయసాయిని టీడీపీలో ఎవరూ నమ్మరని, లిక్కర్ స్కాంలో ఆయన పాత్ర కూడా ఉందంటూ టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా విజయసాయి పరిస్థితి తయారైందని అంటున్నారు.
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటనలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరిలో రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి మార్చిలో లిక్కర్ స్కాంలో వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి పాత్రపై ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. ఇక అప్పటి నుంచి విజయసాయిరెడ్డి వ్యవహారశైలి వైసీపీని టెన్షన్ పెట్టింది. ఒకప్పుడు వైసీపీలో అన్నీతానై అన్నట్లు వ్యవహరించిన విజయసాయి ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చి, అధినేత జగన్ తోపాటు ఆయన చుట్టూ ఉన్న కోటరీ తనకు అన్యాయం చేసిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కాంలో దొంగలు బట్టలు పూర్తిగా విప్పేస్తానని బెదిరింపులకు దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. స్కాంలో విజయసాయికి కూడా సంబంధం ఉందని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తుండగా, తాను ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదని, అసలు దొంగలు ఎవరో చెప్పేస్తానంటూ ఆయన సరెండర్ అవుతుండటం హీట్ పుట్టిస్తోంది.
విజయసాయిరెడ్డి అన్నంత పని చేస్తే వైసీపీలో కీలక నేతలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆ పార్టీ ఘాటుగా స్పందించింది. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారి విజయసాయిరెడ్డి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడుతోంది. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. తమ పార్టీ నుంచి బటయకు వెళ్లిన విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లో ఉన్నారని ఆరోపించారు. మూడున్నరేళ్ల పదవీకాలాన్ని వదులుకుని కూటమికి మేలు జరిగేలా ఆయన వ్యవహరించారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి వంటివారి మాటలకు సాక్ష్యాలకు విశ్వసనీయత ఉండదని తేల్చి చెప్పారు. వారి మాటలకు వాదనలకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు.
మరోవైపు టీడీపీ కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ ను తీవ్రంగా పరిగణించింది. తాను విజల్ బ్లోయర్ గా చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి వాస్తవానికి క్రైమ్ బ్లోయర్ అంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నిప్పులు చెరిగారు. వైజాగ్ సర్కూట్ హౌస్ కేంద్రంగా గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి నడిపన దందాలు తాము మరచిపోమని, లిక్కర్ స్కాంలో డిస్టలరీ దందాలకు, నకిలీ మద్యం విక్రయాలకు విజయసాయికి సంబంధం ఉందని విజయ్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. విజయసాయి బాధితులు త్వరలో సీఐడీకి ఫిర్యాదు చేస్తారని, ఆయన ఎవరి బట్టలు విప్పాల్సిన పనిలేదని, ఆయన బట్టలే విప్పేస్తారని ఎద్దేశా చేశారు. దీంతో విజయసాయిరెడ్డి రాజకీయంగా ఏకాకి అయినట్లు కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. లిక్కర్ స్కాంలో ఆయన వాంగ్మూలం కీలకంగా మారిన నేపథ్యంలో విజయసాయిరెడ్డికి విపరీతమైన ప్రాధాన్యం పెరిగింది. అయితే ఆయన వ్యవహారశైలిపై టీడీపీ మాత్రం పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం లేదు. అదే సమయంలో వైసీపీ కూడా విజయసాయిరెడ్డిని శత్రువులా చూస్తుండటంతో ఆయన భవిష్యత్తుపై ఆసక్తి పెరుగుతోంది.
