హిందుత్వపై దాడిని సమర్థిస్తారా? వైసీపీపై విజయసాయి ఫైర్
యూట్యూబర్ రావణ్ వ్యవహారంపై వైసీపీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. హిందుత్వపై దాడి చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
By: Tupaki Desk | 9 July 2026 12:07 PM ISTయూట్యూబర్ రావణ్ వ్యవహారంపై వైసీపీ మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. హిందుత్వపై దాడి చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ‘‘రావణ్‌లు, ప్రకాశ్ రాజ్‌లు ఎక్కడినుంచి పుట్టుకు వస్తున్నారు?’’ అంటూ ప్రశ్నిస్తూ ఫేస్ బుక్, ఎక్స్ ద్వారా విజయసాయిరెడ్డి సుదీర్ఘ పోస్టు రాశారు. ఇందులో హిందూ మతంపై ఓ పథకం ప్రకారం దాడి చేస్తున్నారని, ఆర్థిక ప్రయోజనాల కోసం మతం మారిన అగ్రకులాల వారు ఇతరకులాలతో హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మతం మారిన వారిలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు రెడ్లు, కమ్మ కులానికి చెందిన వారే అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
యూట్యూబర్ రావణ్ తోపాటు సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టిన పోస్టు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అత్యంత సున్నితమైన ఈ అంశంపై విజయసాయిరెడ్డి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో హిందూమతంపై జరుగుతున్న దాడిని వివరించారు. అంతేకాకుండా ప్రకాశ్ రాజ్, రావణ్ వంటివారికి వైసీపీ నేరుగా మద్దతు ఇవ్వడం, హైలెట్ చేయడాన్ని హిందుత్వపై దాడిగా అభివర్ణించారు. సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద చేస్తున్న దాడిగా పరిగణించాలని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలని పిలుపునిచ్చారు.
‘‘రావణ్‌లు, ప్రకాశ్ రాజ్‌లు ఎక్కడినుంచి పుట్టుకు వస్తున్నారు? వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు? వీరు ఏ సంస్కృతికి వారసులు?’’ అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నలు సంధించారు. ఇలాంటి వారిపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సూచించారు. ఓసీల్లో ప్రధానంగా రెండు అధికార కులాల నుంచి కొద్దిమంది వేరేమతంలోకి కన్వర్ట్ అయిన తరవాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకుంటున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా ఇతర మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికార పరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిలో రెడ్లు, కమ్మ సామాజికవర్గం వారే అధికంగా ఉన్నారని విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
‘‘అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతిపైన మన దేవతలపైన తప్పుడు వ్యాఖ్యలు చేసేవారిని సమాజం బుద్ది చెప్పాలని విజయసాయిరెడ్డి కోరారు. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రభుత్వం చట్టాల్ని సవరించాలని, ఆ వ్యాఖ్యల్ని సమర్థించేవారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలని విజయసాయిరెడ్డి పిలుపునివ్వడం గమనార్హం. ఇదే సమయంలో వైసీపీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు కేంద్రంలో అధికారపార్టీ బీజేపీ చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలని కోరారు. తన పోస్టుకు రెండు రాష్ట్రాల్లోని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలతోపాటు వివిధ వార్తా పత్రికలు, మీడియా చానళ్లను ట్యాగ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ రావణ్ కేసుపై విజయసాయిరెడ్డి స్పందన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రావణ్ పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని ఎక్కడా ప్రస్తావించని విజయసాయిరెడ్డి.. హిందూ దేవుళ్లను కించపరిచే వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాకుండా ఈ విషయంలో వైసీపీ విధానాన్ని తప్పుపట్టడమే కాకుండా హిందూ మతంపై దాడి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు. విజయసాయిరెడ్డి పోస్టు ద్వారా ఆయన బీజేపీ దృష్టిలో పడేందుకు హిందుత్వ అజెండాను ఎంచుకున్నారా? అంటూ సందేహిస్తున్నారు. ఏదిఏమైనా హిందుత్వపై జరుగుతున్న దాడి విషయంలో విజయసాయిరెడ్డి స్పందన రెండు రాష్ట్రాల్లో విస్తృత చర్చగా మారింది.
