విజయ సాయిరెడ్డి నోట 'కర్మఫలాల' మాట... ఇప్పుడే ఎందుకంట?
అవును... ఉదయం 10 గంటలకు సిట్ విచారణకు హాజరవ్వుతారనగా... సరిగ్గా మూడు గంటల ముందు (ఉదయం 7 గంటలకు) విజయసాయిరెడ్డి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 12 July 2025 10:48 AM ISTఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన (ఏ-5) అయిన వైసీపీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... శనివారం ఉదయం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. ఆ విచారణకు హాజరవ్వడానికి కొన్ని గంటల ముందు సాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అవును... ఉదయం 10 గంటలకు సిట్ విచారణకు హాజరవ్వుతారనగా... సరిగ్గా మూడు గంటల ముందు (ఉదయం 7 గంటలకు) విజయసాయిరెడ్డి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇందులో ఆయన కర్మఫలాల గురించి భగవద్గీతలోని శోకాన్ని పోస్ట్ చేశారు. దీంతో.. కర్మ ఫలాల పై ఉన్న ఈ శ్లోకం జగన్ ని దృష్టిలో పెట్టుకుని చేశారా.. తనకు తానుగా చెప్పుకున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది.
"కర్మణ్యే వాధికారస్తే
మాఫలేషు కదాచన!
మా కర్మఫలహేతుర్భూ:
మా తేసంగోஉస్త్వకర్మణి!!
కర్మలను ఆచరించుట యండే నీకు అధికారము కలదు
కానీ వాని ఫలితముల మీద లేదు.
నీవు కర్మఫలములకు కారణం కారాదు.
అట్లని కర్మలను చేయుట మానరాదు."
ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్వీట్ కి సంబంధించిన కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను, విశ్లేషణలను రాసుకొస్తున్నారు. అయితే.. ఈ ట్వీట్ సిట్ విచారణకు బీ.ఎన్.ఎస్.ఎస్.లోని సెక్షన్ 179 ప్రకారం సాక్షిగా హాజరవుతోన్న వేళ పోస్ట్ చేయడం మరింత ఆసక్తిగా మారింది.
కాగా... విజయసాయిరెడ్డి ఏప్రిల్ 18న సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో... ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక అంశాలతో పాటు పలువురి పేర్లు వెల్లడించినట్లు కథనాలొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఆయన్ను విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో.. ఈసారి విచారణలో ఏమి చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.
