Begin typing your search above and press return to search.

తమిళనాట 'విజయ్' శంఖారావం : 234 సీట్లలో ఒంటరి పోరు.. రెండు చోట్ల బరిలోకి దళపతి!

తమిళనాడు ఎన్నికల ప్రక్రియ హీట్ ఎక్కింది. ఏప్రిల్ 23న తొలివిడత సమరానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో పార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.

By:  Tupaki Desk   |   29 March 2026 11:52 PM IST
తమిళనాట విజయ్ శంఖారావం : 234 సీట్లలో ఒంటరి పోరు.. రెండు చోట్ల బరిలోకి దళపతి!
X

తమిళనాడు ఎన్నికల ప్రక్రియ హీట్ ఎక్కింది. ఏప్రిల్ 23న తొలివిడత సమరానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో పార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ రోజు టీవీకీ పార్టీ అధినేత విజయ్ 234 చోట్ల పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. విజయ్ స్వయంగా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. తమిళనాట ఎన్నికల బరిలో ఉన్న ఇతర ప్రధాన పార్టీలు ఏవీ కూడా సొంతంగా 234 చోట్ల పోటీకి దిగకపోవడం గమనార్హం. తొలిసారిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా, విజయ్ మాత్రం తగ్గేదేలా అన్న సంకేతాలు పంపుతున్నారు.

టీవీకీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "నేను మీ కోసం అన్ని చోట్లా ఉండలేను, అందుకే నేను నమ్మే వ్యక్తులను మీ ముందుకు పంపుతున్నాను" అంటూ విజయ్ చేసిన ప్రసంగం అభిమానుల్లో జోష్ నింపింది. తమ పార్టీ తరపున అందరూ కొత్తవారినే బరిలోకి దింపుతున్నట్లు విజయ్ ప్రకటించారు. ఆయన మాత్రం చెన్నై నగరంలోని పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రెండు స్థానాలు ప్రస్తుతం అధికార డీఎంకే ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాజకీయ అరంగేట్రంలోనే రిస్క్ తీసుకుంటూ, బలమైన క్యాడర్ ఉన్న స్థానాలను ఎంచుకోవడం ద్వారా తాను తగ్గేదేలేదని విజయ్ స్పష్టం చేశారు. నామినేషన్ పత్రాల్లో తన పేరును 'సి. జోసెఫ్ విజయ్' అని పేర్కొనబోతున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఇక విజయ్ పార్టీ తరపున కొందరు కీలక నేతలు పోటీ చేస్తున్నారు. విజయ్ తన కోర్ టీమ్ సభ్యులైన పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ ను టి.నగర్ నుంచి పోటీకి దింపుతున్నారు. అదేవిధంగా విల్లివాక్కం నుంచి ఆధవ్ అర్జున, థౌజండ్ లైట్స్ నుంచి జె.సి.డి. ప్రభాకర్ ను అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఇక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొలత్తూరులో వి.ఎస్. బాబును పోటీకి పెట్టారు. సెల్వంలో డీఎంకే కీలక నేత, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై చేపాక్ పోటీ చేయనున్నారని విజయ్ వెల్లడించారు.

డ్రైవర్ కుమారుడికి టికెట్.. భావోద్వేగ క్షణం!

ఈ అభ్యర్థుల ప్రకటనలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విజయ్ వద్ద సుమారు 30 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విరుగంబాక్కం టికెట్ కేటాయించారు. తన పేరు ప్రకటించగానే శబరినాథన్ స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకోగా, విజయ్ స్వయంగా అతని కన్నీళ్లు తుడిచి అక్కున చేర్చుకున్నారు. "సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారే ప్రజల రక్షకులు" అని విజయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రధాన పార్టీల మధ్య పోరు ఎలా ఉంది?

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త పార్టీ వచ్చినప్పుడు సాధారణంగా పొత్తులు పెట్టుకోవడం గతలో చోటుచేసుకుంది. కానీ, విజయ్ మాత్రం 234 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టి రికార్డు సృష్టించారు. తమిళనాట ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఆ పార్టీ 164 స్థానాల్లో పోటీ చేస్తోంది, మిగిలినవి 70 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేసింది. ఇక ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సైతం బీజేపీతోపాటు కొన్ని చిన్న పార్టీలతో కలిసి బరిలోకి దిగుతోంది. అయితే ఈ ఎన్నికలను "ప్రజల కూటమి (TVK) వర్సెస్ స్టాలిన్ సార్ కూటమి"గా విజయ్ అభివర్ణించారు. "విజిల్" గుర్తుతో విప్లవం సృష్టిస్తామని ప్రకటించారు.

విజయ్ ప్రధాన హామీలు

ఇక అభ్యర్థుల జాబితాతోనే తన ఎన్నికల మ్యానిఫెస్టోను విజయ్ ప్రకటించారు. మద్యం, డ్రగ్స్ రహిత తమిళనాడును ఆవిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు నెలకు రూ.4 వేలు, డిప్లొమా చేసిన వారికి రూ.2 వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత, జాప్యం లేకుండా పరీక్షల నిర్వహణ ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. 12వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు చదువుకునే వారికి రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.