సన్ ఆఫ్ అయ్యన్న అల్టిమేట్ స్టేట్మెంట్ !
ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయ జీవితం తెరచిన పుస్తకం.
By: Tupaki Desk | 21 May 2025 11:21 PM ISTఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయ జీవితం తెరచిన పుస్తకం. ఆయన టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. ఆయన ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా నర్సీపట్నం నుంచి గెలిచారు. మంత్రిగా ఆయన చేపట్టని కీలక శాఖలు లేవు. పొలిట్ బ్యూరో మెంబర్ గా దశాబ్దాల తరబడి ఆయన పనిచేస్తున్నారు.
అయ్యన పదకొండవ సారి నర్సీపట్నం నుంచి పోటీ చేశారు. ఇప్పటికి ఆయన మూడు సార్లు ఓడారు, ఎనిమిది సార్లు గెలిచారు. ఆ విధంగా చూస్తే ఆయనది దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల ఎమ్మెల్యే జీవితం. ఇక ఏడు పదులకు చేరువలో ఉన్న అయ్యన్న రాజకీయ రిటైర్మెంట్ ని ఇప్పటికే ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని కూడా స్పష్టం చేశారు. ఆయన కుమారుడు విజయ్ పాత్రుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. స్పీకర్ గా అయ్యన్న రాజ్యాంగ బద్ద పదవిలో ఉండడంతో రాజకీయం అంతా కుమారుడు విజయ్ పాత్రుడే చూసుకుంటున్నారు. ఇక నర్శీపట్నం మీద అనకాపల్లి ఎంపీ కన్ను ఉందని ప్రచారం సాగుతోంది.
వెలమలు ఎక్కువగా ఉన్న సీటు అది. బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి 2024 ఎన్నికల్లో గెలిచిన సీఎం రమేష్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి మంత్రి కావాలని కోరుకుంటున్నారు అని పుకార్లు ఉన్నాయి. ఇంకో వైపు చూస్తే టీడీపీ ఇప్పటిదాకా అయ్యన్న కుటుంబానికే టికెట్ ఇస్తూ వస్తోంది ఈసారి రాజకీయంగా మార్పు కోసం వేరే వారికి ఇస్తారు అన్న ప్రచారం ఉంది.
అయితే తమ కుటుంబానికే నర్శీపట్నం టికెట్ సొంతం కావాలన్న పట్టుదల అయ్యన్న కుటుంబంలో ఉంది. కానీ అయ్యన్న మాదిరిగా విజయ్ పాత్రుడి రాజకీయాన్ని చూడలేరు కదా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా నర్శీపట్నం టికెట్ వచ్చే ఎన్నికల్లో ఎవరికి వరిస్తుందో టీడీపీలో అయితే ఇపుడే చెప్పలేని స్థితి ఉందని అంటున్నారు. మరి ఈ పరిణామాల నేపధ్యంలో లేక ఏమైనా వేరే విధమైన వ్యూహాలో తెలియదు కానీ అయ్యన్న కుమారుడు విజయ్ పాత్రుడు ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
తమ కుటుంబాన్ని దశాబ్దాలుగా నర్శీపట్నం ఆదరించింది అన్నారు. తాము కూడా టీడీపీకే అంకితం అయ్యామని చెప్పారు. టీడీపీ జెండా చూస్తూ తాను పెరిగాను ఈ రోజు ఆ జెండా నీడలో పనిచేస్తున్నాను అన్నారు. తాను తన కుటుంబం టీడీపీ జెండా కప్పుకునే చనిపోతామని ఆయన ఎమోషనల్ తో కూడిన అల్టిమేట్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాము టీడీపీలోనే పుట్టామని టీడీపీలోనే మరణిస్తామని అన్నారు.
మొత్తానికి తమ జీవితం అంతా టీడీపీకే అంటూ విజయ్ పాత్రుడు ఎమోషనల్ టచ్ తో కూడిన ప్రసంగం చేశారు. నర్శీపట్నం టీడీపీ అంటే అయ్యన్న కుటుంబానిదే అని చెప్పడానికే ఆయన ఇలా ప్రకటించారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి చూస్తే విజయ్ పాత్రుడు చట్ట సభలోకి నర్శీపట్నం నుంచే అడుగుపెట్టాలని చూస్తున్నారు. 2029లో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.
