ఏఐ అంటేనే..వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు
ఏఐ యుగంలో సమాజంలో కట్టుబాట్లు వావి వరసలు ఎక్కడ మరచిపోతారో అన్నదే తన భయం అని ఆయన అన్నారు.
By: Satya P | 21 Feb 2026 11:41 PM ISTభారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ అంటే వణుకు పుడుతోందని ఆయన అంటున్నారు. భయం కూడా వేస్తోంది అని చెప్పుకొచ్చారు. అందరూ ఏఐ అంటున్నారని కానీ దాని వినియోగం మీద తనకు ఉన్న అభిప్రాయాలు భావనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అలాగని తాను కొత్త టెక్నాలజీకి వ్యతిరేకం కానని ఏఐ విషయంలో చేయాల్సింది చాలా ఉందన్నదే తన ఆలోచన అన్నారు పైగా భయం తాను పడుతున్నాను కానీ ఎవరినీ భయపెట్టాలని కాదని వివరణ కూడా ఇచ్చారు.
తన భయం అదేనంటూ :
ఇప్పటికే అందుబాటులో ఉన్న టెక్నాలజీతోనే సమాజం ఇబ్బంది పడుతోందని ఆయన అన్నారు. సోషల్ మీడియా ప్రభావం ఇపుడు వేరే విధంగా మారిందని అది యాంటీ సోషల్ మీడియాగా మారిపోతోందని ఆయన అన్నారు. అదే విధంగా అందులో వినకూడనివి, చెప్పకూడనివి ఎన్నో పోస్టులు పెడుతున్నారని అన్నారు. అలాగే సోషల్ మీడియా వచ్చాక అసభ్యకరమైన భాషలో ఒకరిని ఒకరు దూషించుకుంటూ రాజకీయ నేతలు కూడా దిగిపోయారు అని అన్నారు. ఏఐ ధోరణి చూస్తే నైతిక పతనం మరెంతగా ఉంటుందో అన్న భయం తనకు ఉందని ఆయన అన్నారు.
వావి వరసలు మరచి :
ఏఐ యుగంలో సమాజంలో కట్టుబాట్లు వావి వరసలు ఎక్కడ మరచిపోతారో అన్నదే తన భయం అని ఆయన అన్నారు. ఏఐ వంటి సాంకేతికత అందుబాటులో వస్తే మానవ సంబంధాలు మరింతగా క్షీణిస్తాయన్న కలవరం కూడా తనకు ఉందని అన్నారు సాంకేతితలో వేగం పెరగడం మంచి పరిణామమే కానీ అదే సాంకేతికత మనిషిని తన కంట్రోల్ లోకి తీసుకోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
పరిష్కారాలు చూడాలి :
ఏ సాంకేతికత అయినా మనిషిని ముందుకు తీసుకుని వెళ్లాలని సమాజాన్ని కూడా అభివృధ్ధి పధంలో నడిపించాలని ఆయన అన్నారు. అంతే తప్ప మానవాళిని ఇబ్బంది పాలు చేయకూడదని ఆయన హితవు పలికారు విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఏఐని కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. నైతికతతో కూడిన విధానంతో ఏఐని విలువలతో సంప్రదాయాలతో వినియోగించేలా చేయాలని ఆయన అన్నారు అంతే కాదు తప్పుడు మార్గాల వైపు దారి తీయకుండా పరిష్కారాలు సైతం కనుగొనాలని అన్నారు. మానవ బంధాలు మంట కలసిపోయే టెక్నాలజీ ఏదీ కాకూడనీ అన్నారు.
మహా భూతమై :
ఏఈని కనుక కంట్రోల్ లో పెట్టకపోతే మహా భూతమైపోతుంది అని మాజీ ఉప రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. సమాజాన్ని సైతం సంక్షోభంలోకి తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఏఐని ఎలా సక్రమంగా ఉపయోగించుకోవాలన్నది పెను సవాల్ గా ఆయన చెప్పారు. ఈ విషయంలో పాలకులు అలాగే సమాజంలోని పెద్దలు అంతా కలసి ఏఐ వినియోగం మీద కీలక సూచనలను చేయాలని అన్నారు. ఏఐ టెక్నాలజీని ముందుకు తీసుకుని వెళ్తున్న మోడీ చంద్రబాబులను అభినందించారు. అయితే ఏఐని సరైన పద్ధతులలో వాడేలా చూడాలని అన్నారు. మొత్తానికి చూస్తే ఏఐ వినియోగం మీద వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి.
