Begin typing your search above and press return to search.

వేమిరెడ్డి దూరం...చెప్పింది సిట్టింగ్ ఎంపీ...!

వైసీపీకి నెల్లూరు జిల్లా అసలు కలసిరావడంలేదు. ఇబ్బందుల మీద ఇబ్బందులు పెడుతోంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 8:18 AM GMT
వేమిరెడ్డి దూరం...చెప్పింది సిట్టింగ్ ఎంపీ...!
X

వైసీపీకి నెల్లూరు జిల్లా అసలు కలసిరావడంలేదు. ఇబ్బందుల మీద ఇబ్బందులు పెడుతోంది. నెల్లూరు నుంచే ఏకంగా ముగ్గురు రెడ్డి నేతలు వెళ్ళిపోయారు. నేను చనిపోతే నా బాడీ మీద వైసీపీ జెండా కప్పాలని వీర లెవెల్ ప్రతిన చేసిన ఒక ఎమ్మెల్యే వైసీపీ గేటు దాటేస్తారు అని ఎవరూ ఊహించలేదు. కానీ ఇది రాజకీయం అలాగే జరుగుతుంది అని నిరూపించారు.

అలాగే నెల్లూరు అంటే గుర్తుకు వచ్చే పేరు మేకపాటి వారిదే. ఆ ఫ్యామిలీ నుంచి మాజీ ఎంపీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని వీడారు. మరో మాజీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి సరేసరి. ఆయన మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు అవి తీరలేదు. దాంతో ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. టికెట్ రాదని తెలిసిన చోట ఎలా ఉంటారన్నది ప్రశ్న.

ఇలా చూస్తే కనుక వైసీపీ పదికి పది ఎమ్మెల్యేలు గెలిచిన చోట ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికలకు ఏడాదికి ముందే జారుకున్నారు. అయినా నెల్లూరు వైసీపీలో ఏదో జరుగుతోంది. ఇపుడు ఆ సెగ కాస్తా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నుంచి వస్తోంది. ఆయన వైసీపీని గుడ్ బై కొట్టేస్తారు అని రూమర్స్ అయితే వినవస్తున్నాయి. జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్ళినపుడు కూడా వేమిరెడ్డి ఆయనను కలవలేదు అన్నది ఇక్కడ గుర్తు చేస్తున్నారు.

ఆయన రాజ్యసభ సభ్యత్వం ఏప్రిల్ 2తో పూర్తి అవుతోంది. ఆయనను నెల్లూరు నుంచి ఎంపీగా దించాలని వైసీపీ ప్లాన్ చేసింది. అయితే ఆయన మూడు కీలక అసెంబ్లీ సీట్లలో మార్పు కోరారు. దాంతో పాటు నెల్లూరు అర్బన్ తన సతీమణి ప్రశాంతికి కోరుకున్నారు. అయితే ఆ సీటుని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరుడు ఖలీల్ కి వైసీపీ హై కమాండ్ ఇచ్చేసింది

ఈ పరిణామాలతో రగిలిపోతున్న వేమిరెడ్డి ఫోన్ స్విచ్చాఫ్ చేసి మరీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం హై కమాండ్ ట్రై చేస్తున్నా ఆయన అందుబాటులోకి రావడంలేదు. ఆయన తన రాజకీయం ఇక చాలు అనుకుంటున్నట్లుగా ఒక వైపు వార్తలు వస్తున్నాయి. అదే టైం లో ఆయన టీడీపీలో చేరుతారు అని ప్రచారం మరో వైపు సాగుతోంది

నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. అలాంటి చోట ఆయన పార్టీకి జిల్లా ప్రెసిడెంట్ గా ఉండి మరీ ఇపుడు ఎర్ర జెండా చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీ ఎవరు అంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకరరెడ్డి అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆదాల కూడా పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం ఉంది. అయితే ఆయన దాన్ని ఖండించారు.

తాను వైసీపీలోనే ఉంటాను అని అన్నారు. తన మీద ఈ తరహా పుకార్లు గత ఏడాది నుంచి వస్తున్నాయని అంటున్నారు. అయినా సరే తాను పార్టీలోనే ఉంటాను అని అంటున్నారు. ఇక ఎంపీనా ఎమ్మెల్యేగా అన్నది అధినాయకత్వం ఇష్టం అని ఆదాల అంటున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల అసంతృప్తులు ఉన్నాయని ఆయన చెప్పడం విశేషం.

అసంతృప్త నేతలకు తాను స్వయంగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా కూడా అవి చక్కబడడంలేదు అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో మాట్లాడాను అని ఆయన కొంత సానుకూలంగా స్పందించారు అని చెప్పుకొచ్చారు. అదే వేమిరెడ్డి మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆదాల చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఆదాల చెప్పిన దానిని బట్టి చూస్తే వేమిరెడ్డి వైసీపీకి పూర్తిగా దూరం అయినట్లే అనుకోవాలి. ఈ నేపధ్యంలో నెల్లూరు రూరల్ నుంచి మళ్ళీ ఆదాలను షిఫ్ట్ చేసి ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. మరి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ధీటైన అభ్యర్ధి రూరల్ లో ఎవరో చూడాల్సి ఉంది.