Begin typing your search above and press return to search.

`వ‌సంత` టీడీపీలోకి రావ‌డం ఇష్టం లేదా?

తాజాగా శుక్ర‌వారం దేవినేని ఉమ‌.. మైలవరం నియోజ‌క‌వ‌ర్గంలో శంఖారావం, బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహించారు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 9:36 AM GMT
`వ‌సంత` టీడీపీలోకి రావ‌డం ఇష్టం లేదా?
X

ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కిం చుకున్న వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న పార్టీలోకి వ‌స్తే.. ఈ సీటును ఆయ‌న‌కే ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై పార్టీ అధిష్టానం కూడా ప‌రిశీల‌న చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు..వ‌సంత రాకును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

వ‌సంత వ‌స్తే.. త‌న సీటు క‌దిలి పోవడం ఖాయ‌మ‌ని అంచ‌నాకు వ‌చ్చిన దేవినేని.. తాజాగా త‌న మ‌న‌సులో మాట‌ను క‌క్కేశారు. ``నన్ను జైల్లో పెడ‌తామ‌న్న నాయకుడు ఏమ‌య్యాడు? దిక్క‌లేక‌.. రోడ్డు మీద తిరుగుతున్నాడా?`` అని ప‌రోక్షంగా పేరు పెట్ట‌కుండా వ‌సంత‌పై విరుచుకుపడ్డారు. అంత‌కాదు.. పూరగుట్టను అబద్ధాల గుట్ట.. అని అన్నోళ్లు.. తనను జైల్లో పెడతానని అన్నోళ్ళు ఏమయ్యారని ప్రశ్నించారు. దేవుడి చెరువులో స్వర్గీయ ఎన్టీఆర్ పేదలకు 3 సెంట్లు స్థలం ఇచ్చారని, ఆ త‌ర్వాత కొన్ని ద‌శాబ్దాల‌కు తాను రెండు సెంట్లు ఇస్తే ఈ వైసీపీ దుర్మార్గులు నాశనం చేశారని ఎమ్మెల్యే వ‌సంత‌పై విరుచుకుప‌డ్డారు.

తాజాగా శుక్ర‌వారం దేవినేని ఉమ‌.. మైలవరం నియోజ‌క‌వ‌ర్గంలో శంఖారావం, బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి చంద్ర‌బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు మినీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వ‌సంత‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ఐదేళ్ల కాలంంలో కాలనీలో కనీసం మంచినీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని విమ‌ర్శించారు. ఇబ్రహీంపట్నంను ‘బూడిద పట్నం’ చేశారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ - జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని దేవినేని వ్యాఖ్యానించారు.

వ‌సంత రాకూడ‌ద‌నే!

కాగా, దేవినేని ఉమా వ్యాఖ్య‌ల వెనుక‌.. సిట్టింగ్ మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్రసాద్‌ను టీడీపీలోకి తీసుకోకూడ‌ద‌నే ఉద్దేశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే.. వ‌సంత రాక‌తో.. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం త‌మ ఖాతాలో ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అదేస‌మ‌యంలో దేవినేని ఉమ‌కు.. వేరే నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా ఆయ‌న ప‌రిశీలిస్తున్నారు. కానీ, దేవినేని మాత్రం మైల‌వ‌రంలోనే రాజ‌కీయాలు చేస్తున్నారు. ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు. హామీలు సైతం గుప్పిస్తున్నారు. దీంతో ఈ వ్య‌వ‌హారం ఎన్నిక‌ల నాటికి మరింత ముదిరే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.