వర్మ తప్పుకోవడమే బెటరేమో..!
ఒకరకంగా జనసేన నాయకులే.. దీనిని ఎక్కువగా ప్రచారం చేశారు. 'వర్మ గారు జిందాబాద్' అంటూ.. నినాదాలు కూడా చేశారు.
By: Tupaki Desk | 6 April 2025 8:00 PM IST''పరిస్థితులు అన్నీ ఒకేలా ఉండవు. మారుతున్న పరిస్థితులను అర్దం చేసుకుని మనం మారాలి''- గత ఎన్నికల సమయంలో పిఠాపురం అసెంబ్లీ టికెట్‌ను జనసేన అధినేత పవన్‌కు కేటాయించినప్పుడు.. ఈ సీటుపై ఆశలు పెట్టుకుని.. ప్రచారం కూడా ప్రారంభించి.. చివరకు చంద్రబాబు చెప్పడంతో వెనక్కి తగ్గిన వర్మ.. తన అనుచరులను బుజ్జగించేందుకు.. తనను తాను సర్దిచెప్పుకొనేందుకు చేసిన వ్యాఖ్య ఇది. ఇది చాలా రోజులు సోషల్ మీడియాలో ఆయనకు అనుకూలంగా ప్రచారం కూడా జరిగింది.
ఒకరకంగా జనసేన నాయకులే.. దీనిని ఎక్కువగా ప్రచారం చేశారు. 'వర్మ గారు జిందాబాద్' అంటూ.. నినాదాలు కూడా చేశారు. అయితే.. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు వర్మకు అవే వ్యాఖ్యలు మళ్లీ రిపీ ట్ అవుతున్నాయి. పరిస్థితులు అన్నీ ఒకేలా ఉండవు! అన్న ఆయన మాటే ఆయనకు వినిపిస్తోంది. దీనికి కారణం.. తాజాగా పిఠాపురంలో నాగబాబు పర్యటించారు. ప్రస్తుతం ఆయన పార్టీ నాయకుడే కాదు. ఎమ్మెల్సీ కూడా. దీంతో సహజంగానే అధికార దర్పం ఉంటుంది.
దీనికి తోడు కొన్నాళ్లుగా వర్మకు-నాగబాబుకు మధ్య రాజకీయ పేచీ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో వర్మకు తాజాగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఆహ్వానం అందలేదు. దీనిని వర్మ లైట్ తీసుకున్నారు. కానీ, ఆయన అనుచరులు, అభిమానులు మాత్రం ఊరుకోలేదు. నాగబాబుకు దారి పొడవునా.. వారి నుంచి కొంత సెగ అయితే తగిలింది. అయితే.. వివాదాలకు దూరంగా ఉండే వర్మ.. వారిని బుజ్జగించినట్టు తెలిసినా.. ఇక, మార్గం మాత్రం మూసుకుపోయిందన్న చర్చ సాగుతోంది.
నామినేటెడ్ పదవి వచ్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించలేదు. మరోవైపు.. చంద్రబాబు అప్పాయింట్‌మెంటు కూడా దక్కడం లేదని.. వర్మ సన్నిహితులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎదురు వెళ్లి పోరాటం చేయడం కంటే.. మౌనంగా ఉండి తప్పుకోవడమే మేలన్న విషయం చర్చకు వస్తోంది. వర్మకు.. వ్యక్తిగతంగా బలం ఉన్నప్పటికీ.. జనసేన అభిమానులు.. పవన్ ఇమేజ్.. వంటివి ఇప్పుడు ఆయన హవాకు.. ఇబ్బందిగానే ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. వర్మ తప్పుకోవడమే బెటర్ ! అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
