మరణం తర్వాత శిక్ష.. మృగాడికి అనాథగా అంత్యక్రియలు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లె ఏడేళ్ల చిన్నారి హత్యచారం కేసులో నిందితుడు కులవర్ధన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
By: Tupaki Political Desk | 19 Feb 2026 4:34 PM ISTమదనపల్లె మృగాడికి మరణం తర్వాత కూడా పాపం వెంటాడుతోంది. ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కీచకుడు కులవర్థన్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతడి శవాన్ని తీసుకువెళ్లడానికి బంధువులు ఎవరూ రాకపోవడంతో అనాథ శవంలా అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కలిసి కులవర్థన్ శవాన్ని ఖననం చేసినట్లు ప్రకటించారు. ఈ సంఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి ఈ ఉదంతం ఒక హెచ్చరికగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లె ఏడేళ్ల చిన్నారి హత్యచారం కేసులో నిందితుడు కులవర్ధన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై నిందితుడు కులవర్థన్ (30) అత్యాచారానికి పాల్పడి ఆపై హతమార్చిన విషయం తెలిసిందే. గంజాయి మత్తులో పశువులా మారిన కులవర్ధన్ తన ఎదురింట్లో ఉండే చిన్నారిని చిదిమేశాడు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగగా, బాలిక తల్లిదండ్రులు బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలో నిందితుడు కులవర్ధన్ ఇంట్లో నీళ్ల టబ్బులో బాలిక మృతదేహం బయటపడింది.
ఈ సమాచారంతో మదనపల్లె పట్టణం ఉలిక్కిపడింది. నిందితుడిని అప్పగించాలని ప్రజలు రోజంతా ఆందోళన చేశారు. ఇక ప్రజలను ఒప్పించి నిందితుడిని అతికష్టం మీద అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీసు స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేయగా, వారి నుంచి తప్పించుకుని నిందితుడు పారిపోయినట్లు చెబుతున్నారు. పోలీసుల జీపు నుంచి దూకేసి పారిపోయిన నిందితుడు కులవర్ధన్ బుధవారం ఉదయం తంబళ్లపల్లి సమీపంలోని కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో శవమై తేలాడు. నిందితుడు మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని చెరువు నుంచి శవాన్ని బయటకు తీయించారు.
ఇక నిబంధనల ప్రకారం నిందితుడు మృతదేహానికి పోస్టుమార్టం చేయాల్సివుండగా, ముందుగా శవపంచనామా చేయాల్సివుంటుందని చెబుతున్నారు. మృతుడి బంధువుల సమక్షంలో లేదా రక్త సంబంధీకుల అనుమతితో పోస్టుమార్టం చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే నిందితుడు చేసిన పనికి అసహ్యించుకున్న తల్లి, సోదరి అటువైపు రాలేదు. శవ పంచనామాకు తాము వచ్చేది లేదని తేల్చిచెప్పడంతో పోలీసులు గత్యంతరం లేని పరిస్థితుల్లో కులవర్ధన్ సమీప బంధువులను రప్పించి శవపంచనామా పూర్తి చేయించారు. అయితే బుధవారం పోస్టు మార్టం జరిగిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు సమాచారం ఇచ్చినా వారు రాలేదని అంటున్నారు.
నిందితుడు కులవర్ధన్ తో తమకు సంబంధం లేదని తల్లి, చెల్లి తెగేసి చెప్పడంతో అనాథ శవంగా గుర్తించి అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం జరిగి 24 గంటలు పూర్తయినా శవాన్ని తీసుకోడానికి ఏ ఒక్కరు రాకపోవడంతో గుర్తు తెలియని, అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లుగా మున్సిపల్ సిబ్బందితో నిందితుడు కులవర్ధన్ మృతదేహాన్ని ఖననం చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంతో మృతుడికి మరణించిన తర్వాత కూడా శిక్ష విధించినట్లు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యం చేస్తున్న వారికి ఇలాంటి ఘటనలు ఒక గుణపాఠం కావాలని అంటున్నారు.
