Begin typing your search above and press return to search.

వైఎస్‌ జగన్‌ 'ఆపరేషన్‌ కాపు'.. వైసీపీలోకి మరో కాపు నేత!

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన వెలువడటంతో రాజకీయాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి

By:  Tupaki Desk   |   21 March 2024 4:05 AM GMT
వైఎస్‌ జగన్‌ ఆపరేషన్‌ కాపు.. వైసీపీలోకి మరో కాపు నేత!
X

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన వెలువడటంతో రాజకీయాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. కాగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ‘ఆపరేషన్‌ కాపు’కు శ్రీకారం చుట్టారని టాక్‌ నడుస్తోంది.

ఇప్పటికే కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ హోం మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్‌ ను వైసీపీలోకి ఆహ్వానించడంతో ఆయన వైసీపీలో చేరారు. అలాగే మరో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్‌ మిథున్‌ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులను పంపి ఆయనను కూడా వైసీపీలోకి ఆహ్వానించడంతో ముద్రగడ సైతం వైసీపీలో చేరారు.

ఇప్పుడు తాజాగా దివంగత నేత వంగవీటి మోహన్‌ రంగా అన్నయ్య వంగవీటి నారాయణరావు కుమారుడు వంగవీటి నరేంద్ర వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేసిన వంగవీటి నరేంద్ర ప్రస్తుతం రాధా–రంగా మిత్రమండలి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతుండగా ‘ఆపరేషన్‌ కాపు’లో భాగంగా నరేంద్రను కూడా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో నరేంద్ర.. జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.

ఇప్పటివరకు వైసీపీలో చేరిన ముగ్గురు కాపు నేతలు.. చేగొండ, ముద్రగడ, వంగవీటి నరేంద్ర.. పవన్‌ కళ్యాణ్‌ ను లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. వంగవీటి రంగాను చంపిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఏమిటని నరేంద్ర మండిపడ్డారు. తాను ఉన్న బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం తట్టుకోలేకే తాను వైసీపీలో చేరానని తెలిపారు. తనను పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి సంప్రదించారని.. వైసీపీలో చేరాలని ఆహ్వానం పలికారని వెల్లడించారు.

వంగవీటి రంగాను అభిమానిస్తున్నానని చెప్పుకుంటూ పవన్‌ కళ్యాణ్‌ టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని వంగవీటి నరేంద్ర నిలదీశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలకు ఎంతో లబ్ధి కలుగుతుందని నరేంద్ర కొనియాడారు. పేదల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ అని ప్రశంసించారు.

వాస్తవానికి దివంగత నేత వంగవీటి రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను వైసీపీలోకి జగన్‌ ఆహ్వానించారు. రాధా సన్నిహితులైన ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీల ద్వారా గతంలోనే ఈ మేరకు జగన్‌ ప్రయత్నాలు చేశారు. అయితే రాధా ఈ ప్రతిపాదనలను నిర్ద్వందంగా తిరస్కరించారు. వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

ప్రస్తుతం వంగవీటి రాధా టీడీపీలో ఉన్నారు. తాజాగా ఆయన జనసేన పార్టీ ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్, ఎంపీ వల్లభనేని బాలశౌరిలతో సమావేశమయ్యారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా కూటమి తరఫున కాపులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో రాధాతో ప్రచారం చేయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఓవైపు జనసేనాని పవన్‌ కళ్యాణ్, మరోవైపు వంగవీటి రాధా దూకుడును అడ్డుకోవడానికి ముద్రగడ పద్మనాభంతోపాటు వంగవీటి నరేంద్రలను వాడుకోవాలనేది జగన్‌ వ్యూహం అంటున్నారు.

పవన్‌ కు పోటీగా ముద్రగడతో, వంగవీటి రాధాకు పోటీగా ఆయన సోదరుడు వంగవీటి నరేంద్రతో ప్రచారం చేయించాలని జగన్‌ భావిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ, వంగవీటి నరేంద్ర.. జగన్‌ కు ఆశించిన ప్రయోజనం చేకూర్చిపెట్టగలరో, లేదో తేలాల్సి ఉంది.