టీడీపీ కార్యక్రమంలో కొడాలి అనుచరుడు: గుడివాడలో రచ్చ
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం రాజకీయ వివాదా నికి దారితీసింది.
By: Tupaki Desk | 26 May 2025 3:07 PM ISTకాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం రాజకీయ వివాదా నికి దారితీసింది. ఉమ్మడి కృష్నాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. ఎట్టకేలకు విగ్రహం ఏర్పాటు అయింది. దీనిని తాజాగా సోమవారం ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ కార్యక్రమం ప్రారంభమయ్యాక.. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కొడాలి నాని అనుచరుడు అక్కడ వేదికపైకి వచ్చారు.
ఈపరిణామంతో అవాక్కయిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.. ఒక్క ఉదుటున లేని వడివడిగా దిగి.. వెళ్లిపోయా రు. ``నన్ను ఆహ్వానించినట్టే కొడాలి నాని అనుచరుడిని ఆహ్వానించారా? `` అని రంగా తనయుడు, వంగవీటి రాధాను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారం సభలో రచ్చగా మారింది. తర్వాత.. మిగిలిన నాయకులు కూడా సభను మధ్యలోనే విరమించి ఎవరికి వారు వెళ్లిపోయారు.
ఏం జరిగింది?
గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలంలో కాపులు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఇక్కడ రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది వారి చిరకాల డిమాండ్. దీనిని తాజాగా కూటమి ప్రభుత్వంలోని నాయకులుగా ఉన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రంగా తనయడు రాధా నెరవేర్చారు. ఈ విగ్రహాన్ని సోమవారం ఎమ్మెల్యేనే ఆవిష్కరించారు. అనంతరం.. ఇక్కడే సభ ఏర్పాటు చేశారు.
సభా వేదికపైకి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెళ్తుండగా ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుడు ఒకరు వేదికపై కూర్చుని ఉన్నారు. అప్పటికే వేదిక మెట్టెక్కేసిన ఎమ్మెల్యే.. ఆయనను గమనించి.. వెంటనే ఒక్క ఉదుటన మెట్లు దిగి వడివడిగా తన కారుదగ్గరకు వెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామంతో నివ్వెరపోయిన.. రాధా.. వెంటనే ఆయన వద్దకు చేరుకున్నారు. ఏం జరిగిందని ప్రశ్నించారు.
దీంతో ఎమ్మెల్యే రాము అసహనం వ్యక్తం చేస్తూ.. నన్ను పిలిచినట్టే ఆయనకు కూడా ఆహ్వానం పంపారా? అని ప్రశ్నించి.. వెళ్లిపోయారు. ఇక, ఎమ్మెల్యేనే వెళ్లిపోవడంతో మిగిలిన వారు కూడా వెళ్లిపోయారు. దీంతో సభ మధ్యలోనే ఆగిపోయింది. కాగా.. అసలు నానీ అనుచరుడు ఎలా వచ్చాడన్న విషయంపై రాధా ఆరాతీస్తున్నారు.
