రాధాకు ఆ హామీ వచ్చేసిందా...?
తాజాగా సీఎం చంద్రబాబుతో వంగవీటి భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలకుపైగానే సీఎంతో ఆయన చర్చలు జరిపారు.
By: Garuda Media | 17 April 2026 10:00 PM ISTవిజయవాడకు చెందిన కీలక నాయకుడు వంగవీటి రాధా కృష్ణకు మండలి యోగం పట్టనుందా? ఆయనను గవర్నర్ కోటాలో శాసన మండలికి పంపించనున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబుతో వంగవీటి భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలకుపైగానే సీఎంతో ఆయన చర్చలు జరిపారు. సీఎంవో కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు మేరకు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి, టీడీపీ అధినేతను రాధా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా మండలి సీటుపై హామీ లభించిందన్న చర్చ సాగుతోంది. అయితే.. దీనిపై పార్టీ పరంగా కానీ. రాధా పరంగా కానీ.. ఎలాంటి లీకులు ఇవ్వలేదు. కానీ.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధా.. అప్పటి వరకు ఎలాంటి గుర్తింపు పొందలేకపోయారు. మధ్యలో అమరావతి రైతుల ఉద్యమానికి కూడా ఆయన మద్దతు పలికారు. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ.. తన మాతృమూర్తితో కలిసి ఆయన యజ్ఞాలు చేశారు.
మొత్తంగా పార్టీ అధికారంలోకివచ్చినప్పటికీ.. ఎలాంటి పదవీ దక్కలేదు. ఈ నేపథ్యంలో సహజంగా రాధా అనుచరులు ఒకింత నిరాశలోనే ఉన్నారు. ఈ పరిణామాలకు తోడు.. కాపు సామాజిక వర్గంలో బలమైన వాయిస్‌గా ఉన్న రాధాకు టీడీపీ రాష్ట్ర నాయకత్వంలో ఏదైనా పదవి దక్కుతుందని భావిస్తున్నారు. కానీ, అది కూడా చిక్కలేదు. దీంతో శ్రేణులు మరింత నిరాశలో చిక్కుకున్నారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. కాపు సామాజిక వర్గంలో బలమైన వ్యక్తిగా ఉన్న రాధాకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
వాస్తవానికి రాధా విషయంపై ఇప్పటి వరకు..అనేక ఊహాగానాలు వినిపించాయి. ఆయనను రాజ్యసభకు పంపిస్తారని.. కాదు..నామినేటెడ్ పదవి ఇస్తారని తరచుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మండలికి పంపించే దిశగా అడుగులు పడినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇప్పటికే వేచి చూస్తున్న రాధాను ఒకింత ఉత్తేజ పరచడంతోపాటు కాపు సామాజిక వర్గంలో నెలకొన్న స్తబ్దతను కూడా తొలగించేందుకు ఇది దోహద పడుతుందని భావిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే.. వచ్చే నెలలోనే వంగవీటిని గవర్నర్ కోటాలో మండలికి పంపించే అవకాశం ఉందని సమాచారం.
