Begin typing your search above and press return to search.

అరెస్టులకు ఒక లెక్క ఉంది !

కక్ష సాధింపు అంటే వైసీపీ పాలనలోనే అని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2025 9:38 PM IST
అరెస్టులకు ఒక లెక్క ఉంది !
X

కక్ష సాధింపు అంటే వైసీపీ పాలనలోనే అని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అంటున్నారు. ఆనాడు వారూ వీరూ అని చూడకుండా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు నుంచి మొదలుపెట్టి కీలక నాయకులను అందరినీ అరెస్ట్ చేసుకుని వెళ్ళారని ఆమె గుర్తు చేస్తున్నారు.

టీడీపీ కూటమి ప్రభుత్వం అలాంటి కక్ష సాధింపులకు పూర్తి వ్యతిరేకమని అన్నారు. ఏది ఉన్నా శాఖాపరంగా సమగ్రమైన విచారణతో పాటు దర్యాప్తు చేసిన మీదటనే ఆధార సహితంగా అన్నీ చూసుకునే అరెస్టులు జరుగుతున్నాయని అన్నారు. చట్టాన్ని ఉల్లఘించిన వారి మీద కఠిన చర్యలు తప్పవని హోం మంత్రి హెచ్చరించారు. అదే విధంగా ఏ విషయం అయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆమె అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అయితే ఏ ఒక్క వర్గాన్ని అలాగే ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ వేధించారని ఆమె గుర్తు చేశారు.

ఈ రోజున వైసీపీ అధినేత కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అని మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. శవం కనిపిస్తేనే రోడ్డు పైకి జగన్ వస్తున్నారు తప్ప ప్రజా సమస్యల మీద ఆయన పోరాటం చేయడం లేదని హోం మంత్రి విమర్శించారు.

గోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బాధితుడి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు పునర్విచారణకు ఆదేశాలు ఇచ్చామని ఆమె స్పష్టం చేశారు. ఏ విషయంలో అయినా ఆధారాలు లభించిన తర్వాతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.

ఇదిలా ఉంటే హోం మంత్రి మాటలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. కక్ష సాధింపు అన్నది కూటమి ప్రభుత్వానికి తెలియదు అని ఆమె చెబుతున్నారు. వైసీపీ చేసిన అరాచకాల వల్లనే అనాటి నాయకులు కానీ అధికారులు కానీ ఇపుడు విచారణలు ఎదుర్కొంటున్నారు అని ఆమె చెబుతున్నారు.

అయితే వైసీపీ మాత్రం ఇవన్నీ కక్ష సాధింపులే అంటోంది. జగన్ అయితే పీఏసీ మీటింగులో మాట్లాడుతూ భయపెట్టి బెదిరించి కేసులు కడుతున్నారని అన్నారు. అరెస్టులు చేస్తున్నారు అని అంటున్నారు. మరి టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న ఈ రాజకీయ సంవాదంలో ఎవరిది వాస్తవం అంటే చూసే జనాలకే తెలుసు అని అంటున్నారు.

ఏది ఏమైనా వైసీపీ నాడు అయిదేళ్ళ అధికారంలో ఉంటూ చేసిన కార్యక్రమాల ఫలితమే ఇదంతా అని కూటమి నేతలు అంటున్నారు. తాము కొత్తగా ఏమీ చేయడంలేదని ఖండితంగా చెబుతున్నారు. మరి వైసీపీ విమర్శలు చేసినా అవి జనాల్లోకి ఎందుకు బలంగా వెళ్ళలేకపోతున్నాయని అంటే గతంలో వారి ప్రభుత్వంలో చేసిన తీరు వల్లనే అని కూడా అంటున్నారు. మొత్తం మీద ఎవరైనా గీత దాటకూడదని దాటితే ఈ రోజు వారిదైనా మరో రోజు ఫలితం వేరేగా ఉంటుందని అంటున్నారు.