Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై వల్లభనేని ఆసక్తికర వ్యాఖ్యలు.. కలిసేందుకు సమయం ఇవ్వాలని వినతి

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైయస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   27 July 2026 9:26 PM IST
చంద్రబాబుపై వల్లభనేని ఆసక్తికర వ్యాఖ్యలు.. కలిసేందుకు సమయం ఇవ్వాలని వినతి
X

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైయస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎంపై విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలతో దూకుడుగా వ్యవహరించిన వంశీ, ఇప్పుడు స్వరం మార్చుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు పంపారు. గన్నవరం నియోజకవర్గంలో పోలవరం కుడికాలువకు భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని భావిస్తున్నట్లు వెలడించారు. ఒకవేళ తనను కలిసేందుకు ఇష్టం లేకపోతే, రైతులతో భేటీ అయ్యేందుకైనా సమయం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే వంశీ అభ్యర్థించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానంటూ మాజీ ఎమ్మెల్యే వంశీ చేసిన అభ్యర్థన ప్రస్తుతం వైరల్ అవుతోంది. వంశీ పేరు చెబితేనే భగ్గుమనే టీడీపీ కేడర్‌ను ప్రసన్నం చేసుకునేలా ఆయన మాట్లాడారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వాధినేత, కుటుంబ పెద్ద అంటూ చంద్రబాబును కొనియాడడమే కాకుండా.. గతంలో చంద్రబాబు మానవతా దృక్పథంతో రైతులను ఆదుకున్నారని వంశీ గుర్తుచేయడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు అండతోనే 2019కి ముందు పోలవరం కాలువలో మోటార్లు పెట్టుకుని నీరు తోడుకున్నామని చెప్పారు. తాను రాజకీయాలు చేయడం లేదని, రైతుల సమస్యలను మాత్రమే ప్రస్తావిస్తున్నానంటూ వ్యాఖ్యానించి సరికొత్త చర్చకు తెరలేపారు. ఇదే సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సైతం రైతుల కోసం లిఫ్ట్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వంశీ ప్రస్తావించారు.

గన్నవరం నియోజకవర్గం మీదుగా పోలవరం కుడికాలువ ప్రవహిస్తుండగా, పలు గ్రామాల రైతులు భూసేకరణలో తమ భూములు కోల్పోయారు. అయితే కాలువకు భూములు ఇచ్చిన రైతులు.. పక్కనే ఉన్న పొలాలకు గతంలో పోలవరం కాలువ నుంచి నీరు వాడుకునేవారు. గతంలో ఇలా రైతులు మోటార్ల ద్వారా నీరు తోడుకోవడాన్ని అధికారులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. 2014-19 మధ్య అధికారులు అభ్యంతరం చెబితే, అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రైతులు సాగునీరు తోడుకోవడానికి ఇబ్బందులు లేకుండా పరిష్కరించారు. ఇదే విధానం 2019-24 మధ్య కూడా కొనసాగింది.

ఇప్పుడు కూడా రైతులు అదే పద్ధతిలో నీరు వాడుకోవడానికి ప్రయత్నించగా, వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలీసుల సహకారంతో రైతులు పోలవరం కాలువలో ఏర్పాటు చేసిన మోటార్లను బలవంతంగా తొలగించారు. అధికారుల చర్యను రైతులు తీవ్రంగా ఖండించడమే కాకుండా, నూజివీడు - విజయవాడ రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వంశీ రంగంలోకి దిగారు. అయితే తన సహజ సిద్ధ ధోరణికి భిన్నంగా వినయపూర్వకంగా (రిక్వెస్ట్ మోడ్‌లో) ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పీలు చేయడం గమనార్హం.

సాధారణంగా ఇలాంటి సమస్యలను అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తుంటారు. రైతుల సమస్యలను భూతద్దంలో చూపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి లబ్ధి పొందాలని చూస్తుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. కానీ, వంశీ మాత్రం రాజకీయాలు పక్కన పెట్టి రైతుల సమస్య పరిష్కారమే ముఖ్యమంటూ మాట్లాడి, పరిణతి చెందిన నాయకుడిగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కూటమి కార్యకర్తలకు తనపై ఉన్న ఆగ్రహం చల్లారేలా, తాను మారిన మనిషిననే సంకేతాలిచ్చేలా మాట్లాడారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.