Begin typing your search above and press return to search.

వల్లభనేనికి విడుదల... అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్!

సుమారు 100 రోజులకు పైగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మంగళవారం భారీ ఊరట లభించింది

By:  Tupaki Desk   |   1 July 2025 9:56 PM IST
వల్లభనేనికి విడుదల... అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్!
X

సుమారు 100 రోజులకు పైగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మంగళవారం భారీ ఊరట లభించింది. ఇందులో భాగంగా... నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ నూజివీడు కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో... వంశీకి రేపు విడుదల దొరకొచ్చని అంటున్నారు.

అవును... వల్లభనేని వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో వంశీ బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా.. దీనిపై ఇప్పటికే విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో.. దాంతో ఇప్పటివరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్‌ మంజూరైనట్లయ్యింది.

వాస్తవానికి కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వంశీపై తొలుత దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసు నమోదైంది. దీంతో... విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీకి రిమాండ్ విధించడంతో.. బెజవాడ జిల్లా కారాగారానికి పోలీసులు తరలించారు.

సుమారు నాలుగు నెలల క్రితం (ఫిబ్రవరి 13) నాటి ఆ కేసు, తర్వాత మరో కేసు... ఇలా అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో అప్పటికే వంశీపై నమోదై ఉన్న పాత కేసులను పోలీసులు తిరగదోడారు. దీంతో... ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో రిమాండ్ అన్నట్లుగా వ్యవహారం సాగింది. ఫలితంగా.. ఆయన జైలు జీవితం వంద రోజులు దాటేసింది.

కాగా... రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో సత్యవర్థన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేశారన్న ఆరోపణలపై వంశీపై బీ.ఎన్.ఎస్. సెక్షన్ 140 (1), 308, 351 (3) సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే తొలుత ఫిబ్రవరిలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

అయితే... ఈ కేసులో విజయవాడ ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ.. రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌ తో పాటు రెండు ష్యూరిటీలను సమర్పించాలని షరతులు విధించింది.

ఇదే సమయంలో... వల్లభనేని వంశీపై నమోదైన కేసుల్లో గనుల అక్రమ తవ్వకాల వ్యవహారం కూడా ఉంది. ఇందులో భాగంగా... రాష్ట్రంలోని నిబంధనలు ఉల్లంఘించి గనుల తవ్వకాలు జరిపారని కేసు నమోదైంది. అయితే.. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. దీనిపై ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది.

వీటితో పాటు వంశీపై అనేక రకాల కేసులు నమోదై ఉన్నాయి! ఏది ఏమైనా... తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులోనూ బెయిల్ దక్కడంతో.. ప్రస్తుతానికి అన్ని కేసుల్లోనూ బెయిల్ దక్కినట్లయ్యింది. ఈ నేపథ్యంలో.. వంశీ రేపు విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ఇదైనా కన్ఫామేనా.. లేక, ఈ లోపు మరేదైనా కేసు నమోదయ్యే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది!!