సీబీఐ విచారణ జరిపించండి..బాబుకు వంశీ లేఖాస్త్రం !
తన మీద ఎమ్మెల్యే చేసిన ఆరోపణలలో ఏ ఒక్కటి నిజమని తేలినా సీబీఐ విచారణలో అది తేటతెల్లం అయినా తన మీద నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవాలని వంశీ ముఖ్యమంత్రిని కోరడం విశేషం.
By: Satya P | 15 July 2026 2:37 AM ISTప్రత్యర్ధి పార్టీకి చెందిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన మీద వస్తున్న ఆరోపణల మీద సీబీఐ విచారణ జరిపించాలని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖాస్త్రం సంధించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనం నిర్మాణానికి సంబంధించి అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ కేటాయింపు విషయంలో వచ్చిన అవినీతి ఆరోపణల మీద ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర మీద సీబీఐ విచారణ జరిపించాలని లేఖ రాయడం రాజకీయంగా కలకలం రేపింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరోపణలతో :
ఇదిలా ఉంటే గన్నవరం ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ కాంట్రాక్టు పనులు వంశీకి చెందిన వారికి ఆయన సన్నిహితులకు ఇచ్చారు అని తాజాగా ఆరోపించారు. దాంతో వంశీ రంగంలోకి దిగారు, తన మీద సిట్టింగ్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలలో అవినీతి చోటు చేసుకుందని ఉందని గుర్తు చేశారు. ఈ టెర్మినల్ నిర్మాణం పనులు కేఎంవీ సంస్థకు ఎయిర్ పోర్టు అధారిటీ సంస్థ అప్పగించిందని అయితే వెంకట్రావు దీని మీద అవినీతి ఆరోపణలు చేశారు అని వంశీ గుర్తు చేశారు. 300 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పనులలో ఇప్పటికే 80 శాతం పూర్తి కాగా కేవలం ఇరవై శాతం పనుల కోసం 206 కోట్ల రూపాయలను కేటాయించడం వెనక భారీ అవినీతి జరిగిందని వెంకటరావు ఆరోపించారని వంశీ పేర్కొన్నారు.
పూర్తి విచారణ చేయండి అంటూ :
సిట్టింగ్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణల మీద పూర్తి విచారణ జరపాలని వంశీ కోరారు. కేఎంవీ సంస్థ అయితే గత ఎన్నికల్లో తనకు తనకు ఆర్థిక సహాయం చేసినట్లుగా ఎమ్మెల్యే వెంకట్రావు చేసిన ఆరోపణలు ప్రసార మాధ్యమాలలో వచ్చిన సంగతిని కూడా వంశీ గుర్తు చేశారు. అందువల్ల ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు దీని మీద విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇక కేఎంవీ సంస్థకు పనుల కేటాయింపులో తన ప్రమేయం ఏ మేరకు ఉందో కూడా ఈ విచారణలో నిగ్గు తేలాలని వంశీ కోరారు.
శిక్షకు సిద్ధం :
తన మీద ఎమ్మెల్యే చేసిన ఆరోపణలలో ఏ ఒక్కటి నిజమని తేలినా సీబీఐ విచారణలో అది తేటతెల్లం అయినా తన మీద నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవాలని వంశీ ముఖ్యమంత్రిని కోరడం విశేషం. ఈ విషయంలో విచారణ మాత్రం చేయాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే వంశీ ముఖ్యమంత్రికి లేఖ రాయడమే ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆయన టీడీపీ నుంచి రెండు సార్లు గెలిచారు. 2019 తర్వాత వైసీపీకి చేరువ అయ్యారు. అంతే కాదు చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలు చేశారు అన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వంశీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అంటూ తొలిసారిగా లేఖ రాయడం అందులో విచారణకు సిద్ధమని పేర్కొనడం ద్వారా చర్చకు తావిచ్చారు. వంశీ రాసిన ఆ లేఖలో ఎక్కడ పరుష పదజాలం లేదు, సాఫ్ట్ గానే అంతా ముగించారు. దాంతో వంశీ లేఖ సంగతి పక్కన పెడితే వైసీపీలో అంతగా చురుకుగా లేని ఈ మాజీ ఎమ్మెల్యే రాజకీయంగా రానున్న రోజులలో ఏమి చేస్తారు అన్న కొత్త చర్చకు సైతం ఆస్కారమిచ్చారు అని అంటున్నారు.
