Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్ర టీడీపీలో రచ్చ రచ్చ... ఈ ఛాలెంజ్ లు చూశారా?

ఇందులో భాగంగా... పాడేరు, భీమిలి, చీపురుపల్లి నియోజకవర్గాల్లో ప్రధానంగా సరికొత్త సమస్యలు తెరపైకి వచ్చాయని.. పార్టీ నిలువునా చీలిందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   31 March 2024 6:39 AM GMT
ఉత్తరాంధ్ర టీడీపీలో రచ్చ రచ్చ... ఈ ఛాలెంజ్  లు చూశారా?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిగా ఏర్పడిన టీడీపీ - బీజేపీ - జనసేనల్లో టీడీపీకి 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్థులను మూడు విడతల్లో ప్రకటించారు చంద్రబాబు. ఈ సమయంలో మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా పెద్దగా ఎలాంటి సమస్యలూ వచ్చినట్లు కనిపించకపోయినా... రెండో జాబితా, మూడో జాబితా ప్రకటించిన తర్వాత మాత్రం నియోజకవర్గాల్లో సరికొత్త చిచ్చు రేగింది.

ఇందులో భాగంగా ఇంతకాలం నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ, క్యాడర్ కు తోడుగా ఉంటూ, పార్టీ ఇచ్చే ప్రతీ పిలుపుకూ స్పందిస్తూ, ఎన్నో రూపాయలు ఖర్చుపెట్టిన ఇన్ ఛార్జులకు కాదని.. అప్పటికప్పుడు కొత్త కొత్త ముఖాలను తెరపైకి తెస్తూ.. వారికి టిక్కెట్లు ప్రకటించారు చంద్రబాబు. పైగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇన్ ఛార్జ్ లను కనీసం సంప్రదించే ప్రయత్నం కూడా చేయలేదని తెలుస్తుంది. దీంతో... తాంబూలాలు ఇచ్చేశాం అన్నట్లుగా బాబు వ్యవహార శైలి ఉందనే కామెంట్లు వినిపించాయి.

ఈ సమయంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తుని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... చంద్రబాబు, లోకేష్ ల ఫోటోలను చెప్పులతో కొడుతూ.. వాటిని కాళ్లతో తొక్కుతూ.. చింపుతూ.. పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను తగులబెట్టారు. ఇదే సమయంలో... పార్టీకోసం పనిచేసిన వారికి కాకుండా డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నారంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

ఇక ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లు దక్కించుకున్నవారికి.. చంద్రబాబు హ్యాండ్ ఇచ్చిన వారికీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇందులో కొంతమంది నేరుగా మైకుల ముందు ఛాలెంజ్ లు చేస్తుంటే.. మరికొంతమంది అసంతృప్తులు మాత్రం తెరవెనుక చేయాల్సిన పనులు చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో... పెద్ద షాకే తగిలేలా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా ఉత్తరాంధ్రలో ఈ టీడీపీ నేతల మధ్య సరికొత్త రచ్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... పాడేరు, భీమిలి, చీపురుపల్లి నియోజకవర్గాల్లో ప్రధానంగా సరికొత్త సమస్యలు తెరపైకి వచ్చాయని.. పార్టీ నిలువునా చీలిందని చెబుతున్నారు. ఈ క్రమంలో... టీడీపీ తుది జాబితాలో భాగంగా... పాడేరు టిక్కెట్ రమేష్ నాయుడికి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిప్పులు చెరుగుతున్నారు. రమేష్ ని ఓడించి తీరతామని శపథం చేస్తున్నారు.

ఇదే క్రమమో తుదిజాబితాలో అనూహ్యంగా భీమిలికి గంటా శ్రీనివాసరావు పేరు ప్రకటించారు చంద్రబాబు! ముందుగా గంటాను చీపురుపల్లి పంపిస్తారని కథనాలొచ్చినా... గంటా మాటే నెగ్గిందని అంటున్నారు. అయితే... 2019 సమయంలో గంటా భీమిలిని వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ నియోజకవర్గంలో ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్న తనకు కాని.. గంటాకు టిక్కెట్ ఇవ్వడంపై ఫైర్ అవుతున్నారు రాజబాబు. దీనిపై చంద్రబాబు తనకు సమాధానం చెప్పాలని అంటున్నారు.

ఇక చీపురుపల్లి సీటు విషయంలో కూడా రచ్చ మొదలైంది. తనకు కాకుండా.. కనీసం తనకు ఎలాంటి సమాచారం లేకుండా చీపురుపల్లి టిక్కెట్ కళావెంకట్రావుకు ఇవ్వడంపై కిమిడి నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో... ఈయన ప్రభావం కళావెంకట్రావుపై గట్టిగా పడే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ సమస్యలను బాబు పరిష్కరిస్తారా... లేక, లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి!