Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్ర పరిస్థితి ఇదేనా ?

గ్రేటర్ రాయలసీమ జిల్లాలలో 74 ఎమ్మెల్యే సీట్లు ఉంటే గుంటూరు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలలో ఉండే మొత్తం సీట్లు 67 ఉంటాయి.

By:  Tupaki Desk   |   20 April 2024 1:30 PM GMT
ఉత్తరాంధ్ర పరిస్థితి ఇదేనా ?
X

ఉత్తరాంధ్ర ఇపుడు రాజకీయ పార్టీల గెలుపునకు తులాభారం గా మారుతోంది. అంతే కాదు గడచిన ఎన్నికలు తీసుకుంటే ఉత్తరాంధ్రాలో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీకే అధికారం దక్కడం కూడా అనవాయితీగా వస్తోంది. ఉత్తరాంధ్రా మీద రాజకీయ పార్టీల సెంటిమెంట్ కూడా అలాగే ఉంటుంది. గ్రేటర్ రాయలసీమ జిల్లాలలో 74 ఎమ్మెల్యే సీట్లు ఉంటే గుంటూరు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలలో ఉండే మొత్తం సీట్లు 67 ఉంటాయి.

అంటే దాదాపుగా సరిసమానం అన్న మాట. అపుడు ఉత్తరాంధ్ర సీట్లే ఏ పార్టీకి అయినా గెలుపు కోసం తులాభారం అవుతాయని అంటున్నారు. గ్రేటర్ రాయలసీమలో వైసీపీకి మొగ్గు ఉంటుంది అన్నది చెబుతారు. అలాగే దక్షిణాంధ్రాలో టీడీపీ కూటమికి మొగ్గు ఉంటుంది. మరి అధికారాన్ని అందించేందుకు ఉత్తరాంధ్ర సీట్లే అత్యంత ప్రధానం అవుతాయన్నది నిఖార్సు అయిన విశ్లేషణ.

ఇది 2014లోనూ జరిగింది. ఆనాడు చంద్రబాబుకు ఉత్తరాంధ్రాలో పాతిక సీట్లు దక్కడంతో అధికారం వరించింది. అదే జగన్ కి ఉత్తరాంధ్రాలో తొమ్మిది మాత్రమే సీట్లు లభించడంతో 67 దగ్గర నంబర్ ఆగిపోయింది. ఆనాడు ఉత్తరాంధ్రా వైసీపీకి పట్టం కట్టి ఉంటే ఆ పార్టీయే పవర్ లోకి వచ్చేది అన్నది కూడా ఒక లెక్క.

అది నిజం అనిపించేలా 2019 ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 28 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఒక రకంగా స్వీప్ చేసి పారేసింది. మరి 2024 ఎన్నికల్లో కూడా అదే రకమైన మ్యాజిక్ ని కంటిన్యూ చేయాలని వైసీపీ చూస్తోంది. మరి అది సాధ్యపడుతుందా అన్నది చూడాలంటే గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ని పూర్తిగా గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఉత్తరాంధ్ర అంటే ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఉంటాయి. ఉమ్మడి విశాఖలో 15 ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఉమ్మడి విజయనగరంలో 9, ఉమ్మడి శ్రీకాకుళంలో 10 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. ఇందులో రాజకీయ సమీకరణలు చూస్తే కనుక ఉమ్మడి విశాఖలో ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీకి గట్టి పట్టు ఉంది. అక్కడ రెండు సీట్లూ ఆ పార్టీక దక్కుతాయని చెప్పాలి. ఇక రూరల్ విశాఖ జిల్లాలో గతంలో వైసీపీ మొత్తం స్వీప్ చేసింది. ఈసారి అలా ఉండకపోవచ్చు అంటున్నారు.

ఈసారికి టీడీపీకి పట్టు పెరిగింది. ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో టీడీపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని లెక్కలు వేస్తున్నారు. అలాగే విశాఖ సిటీ పరిధిలో ఉన్న ఆరు సీట్లలో కూడా టీడీపీకే మెజారిటీ సీట్లు దక్కుతాయని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే కనుక ఉమ్మడి విశాఖలో టీడీపీకే కొంత మొగ్గు ఉందని చెప్పాల్సి ఉంది.

అయితే విశాఖ సిటీ పరిధిలో బీజేపీకి కొంత పట్టు ఉంది. అలగే ఉత్తరాది జనాభాతో పాటు మార్వాడి, ఇతర వ్యాపార కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు బీజేపీకి మద్దతుగా ఉంటున్నాయి. దాని వల్ల కూడా కూటమికి కొంత రాజకీయ లాభం జరుగుతుంది అని అంటున్నారు.

ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా తీసుకుంటే ఇక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి పారేసింది. మొత్తానికి మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది ఈసారి ఎలా ఉంటుంది అంటే మెజారిటీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడతాయని అంటున్నారు తొమ్మిదింటికి ఆరు నుంచి ఏడు సీట్లు వైసీపీకి దక్కవచ్చు అన్నది ఒక అంచనా ఉంది.

ఇక ఇక్కడ ఓటు బ్యాంక్ చూస్తే కనుక మొదటి నుంచి కాంగ్రెస్ కి ఎక్కువ పట్టు ఉన్న జిల్లా ఇది. ఆ తరువాత ఆ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి ట్రాన్స్ ఫర్ అయింది. దాంతో వైసీపీ బలం పుంజుకుంది. దానికి తోడు బలమైన బీసీ నేతలు ఈ జిల్లాలో వైసీపీ వైపు ఉన్నారు. టీడీపీలో ధీటైన నేతలు లేకపోవడం కూడా వైసీపీకి అనుకూలించే అంశగా ఉంది.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను తీసుకుంటే ఇది మొదటి నుంచి టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా. 1983లో టీడీపీ పెట్టాక ఈ జిల్లా అత్యధిక సార్లు ఆ పార్టీకే కొమ్ము కాసింది. 2004, 2009లలో సైతం కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చినా టీడీపీ ప్రాబల్యం తగ్గలేదు. కానీ 2019లో మాత్రం వైసీపీ ఏకంగా పది ఎమ్మెల్యే సీట్లకు గానూ ఎనిమిదింటిని గెలుచుకుంది. దాంతో టీడీపీ రాజకీయం బోల్తా కొట్టింది.

అయితే టీడీపీ గడచిన అయిదేళ్లలో బాగా పుంజుకుంది. ఆ పార్టీకి బలమైన నేతలు జిల్లాలో ఉన్నారు. వైసీపీకి ధీటైన నేతలు ఉన్నారు. టీడీపీకి కింజరాపు ఫ్యామిలీ నడిపిస్తూంటే వైసీపీని ధర్మాన ఫ్యామిలీ నడిపిస్తోంది. దాంతో ఇక్కడ ఢీ అంటే ఢీ అన్నట్లుగానే పరిస్థితి ఉంది. దాంతో ఇక్కడ ఉన్న పది అసెంబ్లీ సీట్లలో చెరి అయిదు సీట్లూ టీడీపీ వైసీపీ పంచుకోవచ్చు అన్న అంచనాలు అయితే ఇప్పటికి ఉన్నాయని తెలుస్తోంది.

మొత్తం మీద చూస్తే 2014లో టీడీపీకి మెజారిటీ సీట్లు ఉత్తరాంధ్రాలో దక్కాయి. 2019లో వైసీపీకి దక్కాయి. ఈసారి ఏ పార్టీకి దక్కుతాయో అన్నది చూడాలి. ఎవరికి మెజారిటీ సీట్లు దక్కితే వారిదే ఏపీలో అధికారం అని అంటున్నారు.