తిరుమలలో అమెరికా క్రికెట్ జట్టు,. శ్రీవారి సన్నిధిలో తన్మయం
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. భారతీయులకు తిరుమల అంటే ఓ భావోద్వేగం.. అక్కడి శ్రీవేంకటేశ్వరుడు అంటే చెప్పలేనంత భక్తిభావం..! ఇది సాధారణ ప్రజలకే కాదు క్రికెటర్లకూ వర్తిస్తుంది..!
By: Tupaki Desk | 17 Feb 2026 4:07 PM ISTప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. భారతీయులకు తిరుమల అంటే ఓ భావోద్వేగం.. అక్కడి శ్రీవేంకటేశ్వరుడు అంటే చెప్పలేనంత భక్తిభావం..! ఇది సాధారణ ప్రజలకే కాదు క్రికెటర్లకూ వర్తిస్తుంది..! అంతెందుకు? భారత క్రికెటర్లలో చాలమందికి ఫేవరెట్ గాడ్ తిరుమల శ్రీవేంకటేశ్వరుడే..! 2011లో టీమ్ఇండియా ప్రపంచ కప్ గెలిచిన అనంతరం అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేరుగా ట్రోఫీతో పాటు తిరుమల వచ్చాడు. సంప్రదాయాలను పాటిస్తూ గుండు చేయించుకున్నాడు. ఇక మిగతా క్రికెటర్లూ.. వీలు చిక్కినప్పుడల్లా తిరుమల పవిత్ర క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. ఐతే, మనవాళ్లే కాదు.. అమెరికా క్రికెటర్లూ శ్రీవారి భక్తులే అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. అగ్ర రాజ్యం జట్టులో ఉన్నది మొత్తం మనవాళ్లే కదా..!
ఆటతో పాటు భక్తి..
భారతీయులంటేనే క్రికెట్.. అందుకే అమెరికాలోనూ క్రికెట్ ఫీవర్ అంటుకుంది. దశాబ్దం కిందటి వరకు సాధారణ జట్టుగా ఉన్న అమెరికా నేడు ప్రపంచ కప్ లలో ఆడుతూ అదరగొడుతోంది. తాజాగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో భారత్ తో పాటే ఒకే టీమ్ లో ఉన్నది అమెరికా. తమ తొలి మ్యాచ్ లో భారత్ ను ఓ దశలో వణింకించింది కూడా. కానీ, అనుభవం లేకపోవడంతో విజయం అందుకోలేకపోయింది. కేవలం 29 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
అందరూ మనోళ్లే..!
అమెరికా క్రికెట్ లో భారతీయుల పాత్ర విడదీయలేనిది.. అది అండర్ 19 అయినా, మహిళల క్రికెట్ జట్టయినా అసలు అమెరికా క్రికెట్ అంటేనే భారతీయులు మరి..! ఈ నేపథ్యంలోనే తాజా టి20 ప్రపంచ కప్ కోసం భారత్ కు వచ్చిన ఆ దేశ జట్టులో పదిమంది పైగా భారతీయులు ఉన్నారు. వీరంతా మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కెప్టెన్ మోనాక్ పటేల్ సహా పేసర్ సౌరభ్ నేత్రవాల్కర్, మిలిండ్ కుమార్ తదితరులు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకున్నారు. అంతేకాదు.. వీరంతా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పొందారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అద్భుత ఆధ్యాత్మిక అనుభూతి..
శ్రీవారి దర్శనం అనంతరం మోనాక్ పటేల్ మాట్లాడుతూ.. అదో అద్భుత ఆధ్యాత్మిక అనుభూతి అని కొనియాడాడు. ఆలయ పరిసరాల్లోని ప్రశాంతతను చూసి ముగ్ధుడైనట్లు తెలిపాడు.
