అమెరికా, ఇరాన్ సీజ్ ఫైర్.. రోడ్ మ్యాప్ రెడీ?!
45 రోజులపాటు తాత్కాలికంగా యుద్ధాన్ని విరమించి ఆ తర్వాత శాశ్వతంగా నిలిపివేసేలా ఉభయ పక్షాలు చర్చలు జరుపుతున్నాయని విస్తృత ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 6 April 2026 10:24 PM ISTఅమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధానికి బ్రేక్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 45 రోజులపాటు తాత్కాలికంగా యుద్ధాన్ని విరమించి ఆ తర్వాత శాశ్వతంగా నిలిపివేసేలా ఉభయ పక్షాలు చర్చలు జరుపుతున్నాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. రెండు దేశాలకు మధ్య పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్టు దేశాల చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్,పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇరాన్ ప్రతినిధులతో రహస్యంగా కొనసాగుతున్న సంప్రదింపులు సానుకూల ఫలితాలు ఇవ్చొచ్చని ఆశిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి వల్ల యుద్ధం విరమించాలని రెండు వైపులా ఒత్తిడి పెరిగినట్లు చెబుతున్నారు. దీంతో యుద్ధాన్ని ఆపడానికి ఒక 'రోడ్ మ్యాప్' సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇరుదేశాల మధ్య 15 అంశాల ప్రతిపదికన యుద్ధ విరమణ ఒప్పందం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో ప్రధానంగా తక్షణ కాల్పుల విరమణ, ఆపై శాశ్వత శాంతి ఒప్పందం గురించి చర్చిస్తున్నారు. అదేవిధంగా హోర్మూజ్ జలసంధిని షరతులు లేకుండా తెరవాలనే ప్రముఖ డిమాండ్ చేర్చారు.
అయితే హోర్ముజ్ పై ఆధిపత్యం వదులుకోడానికి ఇష్టపడని ఇరాన్, ఆ ప్రతిపాదనను చర్చల నుంచి తొలగించాలని పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. ఇక యుద్ధానికి ప్రధాన కారణాలుగా అమెరికా చెబుతున్న ఇరాన్ అణు కార్యకలాపాలను నిలిపివేయడం, బాలిస్టిక్ క్షిపణుల తయారీపై ఆంక్షలు చర్చల్లో ప్రధాన అంశాలుగా చేర్చారు. దీనికి ప్రతిగా ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలు తొలగిస్తామని అమెరికా హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇక అమెరికా ప్రతిపాదనలను తొలుత తోసిపుచ్చిన ఇరాన్ ప్రస్తుతం తన సొంత 'కౌంటర్ ప్లాన్'ను సిద్ధం చేసిందని చెబుతున్నారు. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాలని, హార్ముజ్ జలసంధిపై తమకే పూర్తి అధికారం ఉండాలని ఇరాన్ పట్టుబడుతోంది. సుమారు 45 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్ సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, డెడ్ లైన్లతో కూడిన ఒత్తిళ్లను తాము అంగీకరించబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ స్పష్టం చేయడంతో మళ్లీ మొదటికి వస్తుందా? అన్న ఆందోళన ఎక్కువ అవుతోంది.
