యుద్ధం ముగిసిందా? లేక ఇప్పుడే మొదలైందా?.. ట్రంప్ వర్సెస్ ఎఫ్‌బీఐ
పశ్చిమాసియాలో ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం ఇప్పుడు కేవలం రణరంగంలోనే కాదు.. అమెరికా అధికార వర్గాల మధ్య ‘మాటల యుద్ధం’గా మారింది.
By: Tupaki Desk | 12 March 2026 12:36 PM ISTపశ్చిమాసియాలో ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం ఇప్పుడు కేవలం రణరంగంలోనే కాదు.. అమెరికా అధికార వర్గాల మధ్య ‘మాటల యుద్ధం’గా మారింది. ఒకవైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుంటే, మరోవైపు చమురు ధరలు చుక్కలను తాకుతున్నాయి. అమెరికా మాత్రమే కాకుండా భారత్ వంటి అనేక దేశాలు గ్యాస్ కొరతతో, చమురు నిల్వపై గందరగోళంతో సతమతమవుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎఫ్‌బీఐ ఇరాన్ విషయంలో భిన్నమైన వాదనలు వినిపించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ట్రంప్ ధీమా ‘నేను ఎప్పుడైనా ముగించగలను!’
యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ‘ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి లేదా నాశనం చేయడానికి మాకు ఇక ఏమీ మిగిలి లేదు. ఇప్పటికే ప్రతిదీ పూర్తయింది.’ అని ప్రకటించారు. అంటే, ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేశామని, వారు ప్రతీకారం తీర్చుకునే స్థితిలో లేరని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికా సంపూర్ణ సైనిక అధికారంతో తాను ఎప్పుడైనా ఈ యుద్ధానికి ముగింపు పలకగలననే ఆత్మవిశ్వాసం ఆయన మాటల్లో కనిపిస్తోంది.
ఎఫ్‌బీఐ హెచ్చరిక..
అయితే, ట్రంప్ చేసిన ఈ ప్రకటనకు ఎఫ్‌బీఐ నుంచి వచ్చిన కమ్యూనికేషన్ పూర్తి విరుద్ధంగా ఉంది. పశ్చిమ తీరం వెంబడి ఇరాన్ సంభావ్య క్షిపణి దాడులకు పాల్పడే అవకాశం ఉందని, దీనికి సిద్ధంగా ఉండాలని ఎఫ్‌బీఐ అమెరికా పరిపాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇరాన్ తన సుదూర క్షిపణులతో నేరుగా అమెరికా తీర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. ట్రంప్ 'శత్రువు ఖతమైపోయాడు' అని చెబుతుంటే, ఎఫ్‌బీఐ మాత్రం 'శత్రువు ప్రతీకారానికి సిద్ధమవుతున్నాడు' అని హెచ్చరించడం గమనార్హం.
ఈ వైరుధ్యానికి కారణం?
అమెరికా వంటి అగ్రరాజ్యంలో అధ్యక్షుడు, దర్యాప్తు సంస్థల మధ్య ఇలాంటి భిన్నమైన అభిప్రాయాలు ఉండడం వెనుక రాజకీయ, వ్యూహాత్మక కారణాలు ఉండవచ్చు.
రాజకీయ కోణంలో పరిశీలిస్తే.. యుద్ధంలో విజయం సాధించామనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ట్రంప్ తన రాజకీయ బలాన్ని పెంచుకోవాలని చూస్తూ ఉండవచ్చు. స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్న తరుణంలో, ఇన్వెస్టర్లలో భరోసా నింపడానికి ఆయన 'అంతా ముగిసిపోయింది' అని చెబుతూ ఉండవచ్చు.
నిఘా వర్గాల ఏమంటున్నాయి.. ఎఫ్‌బీఐ వంటి సంస్థలు కేవలం క్షేత్రస్థాయి నిఘా సమాచారం ఆధారంగా పని చేస్తాయి. ఇరాన్ రహస్య కదలికలు లేదా క్షిపణి మోహరింపుల గురించి వారికి అందిన సమాచారం ప్రకారం అప్రమత్తం చేస్తున్నారు. నిఘా వర్గాల దృష్టిలో శత్రువు ఎప్పుడూ అంత సులభంగా లొంగిపోడు.
అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం
ఈ గందరగోళం వల్ల చమురు మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి వల్ల భారత్ వంటి దేశాల్లో గ్యాస్ సరఫరా పరిమితమైంది. ఒకవేళ ఎఫ్‌బీఐ చెప్పినట్లుగా అమెరికా తీరంపై దాడి జరిగితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించని దెబ్బ తినే ప్రమాదం ఉంది. ట్రంప్ మాటలను నమ్మి అప్రమత్తత తగ్గించాలా? లేక ఎఫ్‌బీఐ హెచ్చరికలను నమ్మి భద్రతను పెంచాలా? అనే విషయంలో అగ్రరాజ్య యంత్రాంగం సతమతమవుతోంది.
దేశాధ్యక్షుడు, ప్రధాన దర్యాప్తు సంస్థ ఒకదానికొకటి విరుద్ధంగా ఉండడం వింత మాత్రమే కాదు.., ప్రమాదకరం కూడా.. ఒకవేళ ఇరాన్ నిజంగానే ప్రతీకారానికి సిద్ధమైతే, ట్రంప్ ధీమా అమెరికాకు శాపంగా మారవచ్చు. అదే సమయంలో, ఎఫ్‌బీఐ హెచ్చరికలు కేవలం అత్యంత జాగ్రత్త కోసం చేస్తున్నవి కూడా కావచ్చు. ఏది ఏమైనా, ఈ యుద్ధం పర్యవసానాలు సామాన్య భారతీయుడి వంటింటి బడ్జెట్ నుంచి ప్రపంచ కుబేరుల స్టాక్ మార్కెట్ వరకు అందరినీ వణికిస్తున్నాయి. ఈ వైరుధ్యాలు తొలగి, యుద్ధం ఎప్పుడు శాంతియుతంగా ముగుస్తుందో వేచి చూడాలి.
