చంద్రబాబు ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది : ఐపీఎస్ పీఎస్సార్ అరెస్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు.
By: Tupaki Desk | 5 May 2025 4:02 PMకూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీ క్యాడర్ లో ఉన్న పీఎస్సార్ ఆంజనేయులును ప్రభుత్వం అరెస్టు చేయించడం కరెక్టు కాదన్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే పోలీసులు పనిచేయడానికి కూడా భయపడతారని వ్యాఖ్యానించారు. ఇటీవల విజయవాడ జైలులో ఉన్న డీజీ క్యాడర్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ములాఖత్ లో కలిశారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సాఆర్ ఆంజనేయులుతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. డీజీ స్థాయి అధికారిని అరెస్టు చేసి చంద్రబాబు ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. ముంబైకి చెందిన నటి జెత్వానీని నిబంధనల ప్రకారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అరుణ్ కుమార్ తెలిపారు.
ఆమెపై రాష్ట్రంలో ఒక కేసు నమోదు అయి ఉండగా, నిందితురాలు చేసిన ఫిర్యాదుపై విచారణాధికారులను అరెస్టు చేయడం చట్టరీత్యా తప్పు అని మాజీ ఎంపీ ఉండవల్లి తెలిపారు. తనపై అక్రమ కేసు నమోదు చేశారని పీఎస్సాఆర్ ఆంజనేయులుకు కూడా తెలుసు అన్నారు. తనపై ప్రభుత్వం మోపిన అభియోగాలను కోర్టులోనే ఆయన తేల్చుకుంటారని చెప్పారు.
కాగా, కేసుకు సంబంధించి అరెస్టు అవుతానని పీఎస్సార్ ఆంజనేయులుకు ముందుగానే తెలుసు అని మాజీ ఎంపీ ఉండవల్లి తెలిపారు. ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేయాలని తాను సూచించినా, ఆయన తిరస్కరించారన్నారు. తనపై నమోదైన కేసుకు బలం లేదని ఆయన చెబుతున్నారన్నారు. ఆయనపై మరికొన్ని కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వడాన్ని సైతం మాజీ ఎంపీ ఉండవల్లి ఖండించారు. డీజీపీ స్థాయి అధికారిని జైలులో పెట్టడం దేశ చరిత్రలో తొలిసారిగా అభివర్ణించారు. గతంలో పంజాబ్ మాజీ డీజీపీ ఎంఎస్ గిల్ పైనా కేసు పెట్టినా, ఆయనను జైలులో పెట్టలేదన్నారు.
మరోవైపు మాజీ ఎంపీ ఉండవల్లి జైలుకు వెళ్లి రిమాండు ఖైదీగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులును కలవడం చర్చనీయాంశమవుతోంది. గత ప్రభుత్వ పెద్దలకు బాగా సన్నిహితంగా మెలిగారని పీఎస్సార్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రాజకీయాలు చేయకపోయినా, అడపాదడపా తటస్థ విమర్శలు చేస్తున్న ఉండవల్లి, పీఎస్సార్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కలయికకు ఏదైనా రాజకీయ కారణముందా? అనే చర్చ జరుగుతోంది.