Begin typing your search above and press return to search.

ఉండవల్లి కోసం జగన్ ఉడుం పట్టు ?

ఉండవల్లి అరుణ్ కుమార్. మాజీ ఎంపీ. రెండు సార్లు వరసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారు రాజకీయ మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

By:  Satya P   |   21 Feb 2026 1:00 PM IST
ఉండవల్లి కోసం జగన్ ఉడుం పట్టు ?
X

ఉండవల్లి అరుణ్ కుమార్. మాజీ ఎంపీ. రెండు సార్లు వరసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారు రాజకీయ మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు. న్యాయవద విద్యను అభ్యషించిన వారు కాబట్టి వాదనా పటిమ బాగానే ఉంటుంది. తాను అనుకున్నది సూటిగా స్పష్టంగా చెప్పగలవారు. ప్రత్యర్థులను చీల్చి చెండాడడంలో దిట్ట. వైఎస్సార్ కి అత్యంత సన్నిహితులలో ఒకరుగా ఉన్నారు. అలాంటి ఉండవల్లి రాజకీయాల నుంచి తప్పుకుని అపుడే పుష్కర కాలం గడచిపోయింది. ఉమ్మడి ఏపీ ఆయన కోరిక. ఆయన పట్టుదల కూడా. కానీ అడ్డగోలుగా విభజించడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. అది కూడా సవ్యంగా విభజన జరగలేదని ఆయన ఈ రోజుకీ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ని ఆయన ఈ కారణంగానే వదిలి బయటకు వచ్చారు. అంతే కాదు రాజకీయాలకే అతి పెద్ద దండం పెట్టేశారు.

రాజకీయ విశ్లేషకుడిగా :

అయితే రాజకీయాలు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పే ఉండవల్లి రాజకీయ విశ్లేషకుడిగా కనిపిస్తూ ఉంటారు. మీడియా ముందుకు వచ్చి ఆయన అనేక విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న వారిని ప్రతిపక్షంలో ఉన్న వారిని సైతం ఆయన విమర్శిస్తూంటారు. తన వయసు రిత్యా ప్రత్యక్ష రాజకీయాలు చేయలేను అని ఉండవల్లి చెబుతూ వస్తున్నారు. ఆయన కనుక చేరాలనుకుంటే పార్టీలు తీసుకునేందుకు రెడీగా ఉంటాయి అని అంటారు.

వైసీపీ ఆశలు :

ఇదిలా ఉంటే ఉండవల్లిని తమ పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా జగన్ అయితే ఈ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. తన తండ్రి సమకాలీనుడు సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉన్న వారు అయిన ఉండవల్లి పార్టీలో చేరితే వైసీపీ వాయిస్ మరింత బలంగా జనంలోకి వెళ్తుందని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి రాంబాబును ఉండవల్లి పరామర్శించి వచ్చారు. ఆ మీదట తిరుమల లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అతి పోకడలను ఆయన తప్పు పట్టారు. దీంతో వైసీపీలో మరోసారి ఆశలు చిగురిస్తున్నాయని అంటున్నారు.

రాయబారాలతో :

ఇక కాంగ్రెస్ లో సీనియర్ నేతలను చేర్చుకోవాలని వైసీపీలో కీలక మార్పులు తీసుకుని రావాలని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి వైసీపీలోకి వచ్చేలా చూడాలని ఆయన కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారని ప్రచారం సాగుతోంది. ఉండవల్లికి అతి సన్నిహితులు గా ఉన్న వారితోనే రాయబారాలు నడుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న వైసీపీకి సలహాదారుగా ఉంటూ రాజకీయంగా పార్టీకి సూచనలు ఇచ్చే విధంగా ఉన్నా చాలు అన్నది వైసీపీ పెద్దల మాటగా ఉందిట.

ఒప్పుకుంటారా :

అయితే ఉండవల్లి ఇప్పటికే కుండబద్ధలు కొట్టేశారు. తాను రాజకీయాలకు బహు దూరం అని అన్నారు. తనకు ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని కూడా తేల్చేశారు. అయితే వైసీపీ మాత్రం ఆయనను తమతో ఉండాలని కోరుతోంది. 2024 ఎన్నికల తరువాత వైసీపీ ఓటమి భారీగా అందుకుంది. వర్తమానంలో కూడా అనేక విషయాలలో సరైన విధంగా పోరాటం చేయలేకపోతోంది. డిఫెన్స్ మోడ్ లోనే ఈ రోజుకీ ఉంది. దీంతో వైసీపీకి మంచి వక్తలు వాదనాపటిమ ఉన్న వారి కొరత ఉంది అని అంటున్నారు. ఉండవల్లి లాంటి వారు అయితే తమకు ఎంతో కలసి వస్తుందని కూడా భావిస్తోంది. ప్రజలలో కూడా ఇమేజ్ పెరుగుతుందని లెక్కలేస్తోంది.

వైఎస్సార్ సన్నిహితులను చేర్చుకునే పనిలో :

మొత్తానికి ఉండవల్లిని ఒప్పించి అయినా తమతో వచ్చేలా చూడాలని వైసీపీ అయితే గట్టి పట్టుదలగా ఉంది. కానీ ఉండవల్లి దీని మీద ఏమంటారో చూడాల్సి ఉంది. మరో వైపు చూస్తే మరింతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలను వైఎస్సార్ సన్నిహితులను వైసీపీ చేర్చుకునే పనిలో ఉందని అంటున్నారు. అందులో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు అయితే ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన కీలక నేత ఉభయ గోదావరి జిల్లాలో బిగ్ షాట్ అయిన మరో నేత ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో.