రూ.23 లక్షలకే దుబాయ్ గోల్డెన్ వీసా.. షరతులు వర్తిస్తాయి
యూఎఈ జారీ చేసే గోల్డెన్ వీసాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 7 July 2025 2:00 PM ISTయూఎఈ జారీ చేసే గోల్డెన్ వీసాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ వ్యాపారానికి ముఖద్వారంగా ఉంటున్న దుబాయ్ వైపు చూస్తున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. గోల్డెన్ వీసా జారీ చేసేందుకు ఇప్పటి వరకు అనుసరించిన విధానానికి భిన్నంగా కొత్త తరహా గోల్డెన్ వీసా కార్యక్రమానికి తెర తీసింది దుబాయ్ ప్రభుత్వం.
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం స్థిరాస్తిలో కనీసం రూ.4.66 కోట్లు లేదంటే వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే వారికి గోల్డెన్ వీసాను జారీ చేయటం తెలిసిందే. అందుకు భిన్నంగా కేవలం రూ.23.3 లక్షల ఫీజును చెల్లించటం ద్వారా జీవితకాలం చెల్లుబాటు అయ్యే గోల్డెన్ వీసాను పొందేందుకు వీలుగా కొత్త కార్యక్రమానికి తెర తీశారు. దీన్ని తొలుత భారత్.. బంగ్లాదేశీయులకు మాత్రమే జారీ చేస్తారు. తర్వాతి కాలంలో మిగిలిన దేశాలకు విస్తరించే వీలుందని చెబుతున్నారు.
ఈ కొత్త వీసా కోసం రానున్న మూడు నెలల వ్యవధిలో ఐదు వేలకు పైనే భారతీయులు అప్లై చేసుకుంటారని చెబుతున్నారు. భారతీయులకు యూఎఈ గోల్డెన్ వీసా పొందేందుకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు. దీని కోసం భారత్ లో రయాద్ గ్రూప్ అనే కన్సెల్టెన్సీని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఈ వీసా కోసం అప్లై చేసుకున్న వారి నేపథ్యాన్ని తొలుత తనిఖీ చేస్తారు.
క్రిమినల్ రికార్డులు.. యాంటీ మనీలాండరింగ్ నేపథ్యంతో పాటు సోషల్ మీడియా ఖాతాల్ని సైతం తనిఖీ చేస్తారు. ఆర్థికం.. వాణిజ్యం.. సైన్స్.. స్టార్టప్.. ఉద్యోగ సేవల లాంటి మార్గాల్లో యూఏఈ మార్కెట్ కు వారు ఎలా ప్రయోజనం చేకూరుస్తారన్న అంశాన్ని పరిశీలిస్తారు. అనంతరం తుది నిర్ణయం కోసం ప్రభుత్వానికి అప్లికేషన్ ను పంపుతారు. గోల్డెన్ వీసా కోసం అప్లై చేసే వారు దుబాయ్ ను సందర్శించాల్సిన అవసరం ఉండదు. వారు తమ స్వదేశంలో ఉంటూనే అనుమతి తీసుకోవచ్చు.
ఈ వీసా పొందిన వారు తమ కుటుంబ సభ్యులను దుబాయ్ తీసుకెళ్లొచ్చు. అసిస్టెంట్లు.. డ్రైవర్లను నియమించుకునే వీలు ఉంటుంది. స్థానికంగా ఏదైనా వ్యాపారం.. ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. నామినేషన్ ఆధారిత వీసా జీవితకాలం చెల్లుబాటు అయ్యే వీలుంది. ఈ పైల్ ప్రాజెక్టును తొలుత భారత్.. బంగ్లాదేశ్ లో అమలు చేసి.. తర్వాతి కాలంలో చైనాతో పాటు ఇతర దేశాలకు విస్తరిస్తారని చెబుతున్నారు.
