యాపిల్ తర్వాత ట్రంప్ టార్గెట్ కంపెనీ ఇదే.. ఎవరికైనా రూల్ అదే!
ఈ నేపథ్యంలో.. ఇప్పుడు శాంసంగ్ పై ట్రంప్ దృష్టి సారించారు. అమెరికా మార్కెట్ లోని మొబైల్ ఫోన్స్ అమ్మకాల్లో రెండో స్థానంలో ఉన్న శాంసంగ్ కు కండిషన్స్ పెట్టారు.
By: Tupaki Desk | 24 May 2025 12:06 PM ISTసంస్థ అయినా.. దేశమైనా.. ప్రాంతమైనా.. రాజ్యమైనా.. ప్రపంచం మొత్తన్ని సుంకాలతో శాసిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరోసారి యాపిల్ సంస్థను హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అమెరికాలో ఐఫోన్లు తయారుచేయని పక్షంలో 25% సుంకాన్ని విధిస్తామని అన్నారు. ఈ క్రమంలో యాపిల్ ప్రత్యర్థినీ టార్గెట్ చేశారు.
అవును... అమెరికాలో ఐఫోన్ల ఉత్పత్తికి సంబంధించి యాపిల్ ను హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్.. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ శాంసంగ్ పైనా ఇదే తరహాలో స్పందించారు. ఇందులో భాగంగా.. శాంసంగ్ సహా అమెరికాలో విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్లకూ 25 శాతం సుంకాల నిబంధన వర్తిస్తుందని అన్నారు.
ఈ మేరకు తాజాగా వైట్ హౌస్ లో మాట్లాడిన ట్రంప్... యాపిల్ ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయని మొదలుపెట్టి.. శాంసంగ్ అయినా, మరే సంస్థ అయినా తమ ఉత్పత్తులను అమెరికాలోనే తయారుచేయాలని.. అలాకాకుండా ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసినవి తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే అది న్యాయం కాదని.. ఇక్కడే ప్లాంట్ నిర్మిస్తే మాత్రం వారికి ఎలాంటి సుంకాలు వర్తించవని అన్నారు.
కాగా.. యూఎస్ లో విక్రయించే ఐఫోన్ లను భారత్ లేదా మరెక్కడా కాకుండా అమెరికాలో తయారు చేయాలని తాను చాలా కాలం క్రితమే ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు చెప్పానని.. అలాకానిపక్షంలో అమెరికాకు యాపిల్ కనీసం 25% సుంకం చెల్లించాలని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో.. యాపిల్ షేర్లు ఒక్కసారిగా 2.6% పడిపోయాయి.
ఈ నేపథ్యంలో.. ఇప్పుడు శాంసంగ్ పై ట్రంప్ దృష్టి సారించారు. అమెరికా మార్కెట్ లోని మొబైల్ ఫోన్స్ అమ్మకాల్లో రెండో స్థానంలో ఉన్న శాంసంగ్ కు కండిషన్స్ పెట్టారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఏటా 220 మిలియన్ ఫోన్లను విక్రయిస్తుండగా.. అందులో సుమారు 60% ఫోన్లు వియత్నాంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడ నుంచే అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. దక్షిణకొరియాలోనో, వియత్నాంలోనో ఉత్పత్తి చేసి అమెరికాలో అమ్ముకుంటామంటే 25% చెల్లించాలని.. లేదు, అమెరికాలో అమ్మే ఫోన్లు అక్కడే ఉత్పత్తి చేస్తామంటే సుంకాలు చెల్లించనవసరం లేదని ట్రంప్ తనదైన శైలిలో కంపెనీలను హెచ్చరిస్తున్నారు!
