Begin typing your search above and press return to search.

మండలిలో మంటలేనా- తిరుపతి లడ్డు మీద రెడీ

తిరుపతి లడ్డు విషయంలో ఇప్పటికే శాసనసభలో సుదీర్ఘమైన చర్చ సాగింది. కూటమి ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు.

By:  Satya P   |   26 Feb 2026 10:41 PM IST
మండలిలో మంటలేనా- తిరుపతి లడ్డు మీద రెడీ
X

తిరుపతి లడ్డు విషయంలో ఇప్పటికే శాసనసభలో సుదీర్ఘమైన చర్చ సాగింది. కూటమి ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు. ఇక్కడ విపక్షం వైసీపీ అసెంబ్లీకి రాకపోవడం వల్ల చర్చలో పాల్గొనలేదు. లడ్డులో కలిపే నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ కూటమి ఎమ్మెల్యేలు అంతా మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ కూడా కల్తీ నెయ్యి వ్యవహారం మీద గట్టిగానే మాట్లాడారు, వైసీపీ అయిదేళ్ళ పాలనలో దేవాలయాల మీద అరాచకాలు అన్యాయాలు జరిగాయని పవన్ కళ్యాణ్ అంటే కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ తీవ్ర అపచారం చేసింది అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన దాని మీద వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మీడియా ముఖంగా ఖండన వివరణ ఎదురుదాడి ఇవన్నీ కల్తీ నెయ్యి తిరుపతి లడ్డు విషయంలో మంటలు పుట్టించాయి.

చర్చకు సిద్ధం :

ఇదిలా ఉంటే తిరుపతి లడ్డూలో కలిపిన నెయ్యి కల్తీ అన్న దాని మీద చర్చకు శాసనమండలి సిద్ధపడుతోంది. వైసీపీ ఎమ్మెల్సీలు దీని మీద చర్చించాలని వాయిదా తీర్మానాన్ని ప్రతీ రోజూ ఇస్తున్నారు. మొత్తం మీద ఒక డేట్ ని అయితే ఫిక్స్ చేసి చర్చకు మండలి సిద్ధపడుతోంది అని అంటున్నారు. మార్చి 4వ తేదీన శాసన మండలిలో తిరుపతి లడ్డుపై లఘ చర్చకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రకారం శాసన మండలిలో తిరుపతి లడ్డుపై చర్చించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

వైసీపీ వాదన ఏంటి :

ఇదిలా ఉంటే వైసీపీ తన వాదనను ఎలా వినిపిస్తుంది అన్నది చర్చగా ఉంది. నిజానికి చూస్తే కల్తీ నెయ్యి వ్యవహారం మీద వైసీపీ గత ప్రభుత్వం నుంచే అంతా సాగుతోందని చెబుతోంది. 2014 నుంచి 2024 దాకా కల్తీ నెయ్యి తిరుమల లడ్డూ కోసం ఎంత సరఫరా అయింది అన్నదాని మీద సీబీఐ విచారణకు సిద్ధమా అని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. కల్తీ నెయ్యికి కారణం అయిన సంస్థలకు అనుమతులు అన్నీ గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఇచ్చారు అని కూడా వైసీపీ వాదిస్తోంది.

కూటమి పాయింట్స్ ఇవే :

ఇక కూటమి ప్రభుత్వం అయితే కల్తీ నెయ్యి పాపం అంతా వైసీపీ ప్రభుత్వానిదే అని చెబుతోంది. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక టెండర్ల నిబంధనలను సడలించిందని దాని వల్లనే కల్తీ నెయ్యి రాకకు మార్గం సుగమం అయింది అని చెబుతోంది. పైగా కల్తీ నెయ్యి విషయంలో ఆరోపణలు వచ్చినా 2022లో ఈ విషయం మీద ఫిర్యాదులు వెళ్ళినా వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది అని కూడా కూటమి వాదిస్తోంది. కల్తీ నెయ్యి సరఫరా విషయంలో నూరు శాతం తప్పు వైసీపీదే అని కూటమి గట్టిగా వాదిస్తోంది.

వాస్తవాలను చెప్పాలనే :

ఇదిలా ఉంటే ఈ లడ్డు అంశం మీద వాస్తవాలని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో చర్చను పెడుతున్నామని మంత్రి పయ్యావుల చెప్పారు. నిబంధనలు సంప్రదాయం ప్రకారం తిరుపతి లడ్డుపై చర్చకు వైసీపీ కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని అన్నారు. శాసనసభ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం చర్చకు నోటీసు ఇవ్వడం అనేది సాంప్రదాయమని మంత్రి గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరు మీద మంత్రి పయ్యావుల విమర్శలు చేశారు. శాసన మండలిలో తిరుపతి లడ్డు అంశంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే చదవడానికి వీలు లేదని కానీ ముందుగా వైసిపి సభ్యులు మాట్లాడాలని అడ్డుతగలడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

వైసిపి వాక్ అవుట్ పార్టీగా :

సాధారణంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చకు నిర్ణయం తీసుకున్న తర్వాత సంబంధిత మంత్రి సభలో స్టేట్మెంట్ చదవడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. అయితే సభ్యులు ముందుగా మాట్లాడాలని డిమాండ్ సంప్రదాయం కాదని ఖండించారు. కేవలం వైసీపీ సభ్యులు సభకు రావాలని, అల్లరి చేయాలని ధోరణితో ఉన్నారని అన్నారు. సభకు వచ్చి వాక్ అవుట్ చేసి వెళ్ళిపోతున్నారని అన్నారు. వైసిపి వాక్ అవుట్ పార్టీగా మారిపోయిందని మంత్రి పయ్యావుల ఎద్దేవా చేస్తున్నారు. వాస్తవాలు కళ్ళ ముందు కొస్తే వైసిపి సభ్యులు తట్టుకోలేరని అందుకే ప్రతీ అంశం మీద చర్చకు అడ్డుపడుతున్నారని పయ్యావున నిందించారు.