Begin typing your search above and press return to search.

ఒకే ఒక్క కార్పోరేటర్...కట్ చేస్తే చిక్కిన కార్పోరేషన్ !

అధికారం ఉన్న వారిదే రాజ్యం అని వైసీపీ అంటోంది. ప్రలోభాలకు గురి చేసి తమ వారిని లాక్కుని వెళ్ళారని కూడా ఆరోపిస్తోంది.

By:  Tupaki Desk   |   4 Feb 2025 5:24 PM GMT
ఒకే ఒక్క కార్పోరేటర్...కట్ చేస్తే చిక్కిన కార్పోరేషన్ !
X

అధికారం ఉన్న వారిదే రాజ్యం అని వైసీపీ అంటోంది. ప్రలోభాలకు గురి చేసి తమ వారిని లాక్కుని వెళ్ళారని కూడా ఆరోపిస్తోంది. ఇదంతా తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ కి జరిగిన ఎన్నికల విషయంగా చెప్పుకోవాలి. ఈ ఎన్నికల్లో 26 మంది కార్పోరేటర్ల మద్దతుతో టీడీపీకి చెందిన అభ్యర్ధి డిప్యూటీ మేయర్ అయ్యారు. వైసీపీకి 22 మంది మద్దతు మాత్రమే లభించింది.

సరిగ్గా నాలుగేళ్ళ క్రితం 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో తిరుపతి కార్పోరేషన్ లో వైసీపీ మొత్తంగా అన్ని సీట్లూ గెలుచుకుంది. మొత్తం 50 వార్డులు ఉంటే అందులో ఒక్కటి మాత్రమే టీడీపీ గెలుచుకుంది. మిగిలినవి అన్నీ వైసీపీకే చెందాయి. అలా మేయర్ డిప్యూటీ మేయర్ స్టాండింగ్ కమిటీ సహా అన్ని పదవులూ వారికే చెందాయి.

అయితే ఎనిమిది నెలల క్రితం ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం హయాంలో తాజాగా జరిగిన డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో మాతం సర్వం పసుపు మయం అయింది. ఇక్కడ వైసీపీని దాటుకుని మరీ సైకిల్ పరుగురులు తీసింది. ఒక్క కార్పోరేటర్ నుంచి 26 మంది దాకా ఎగబాకడం అంటే సామాన్యమైన విషయం కాదు.

అది టీడీపీ రాజకీయ నీతికి వ్యూహానికి నిదర్శనం అని అంటున్నారు. ఈ దెబ్బతో తిరుపతి మేయర్ సీటు మీద కూడా కూటమి కన్ను పడింది అని అంటున్నారు. వైసీపీ నుంచి మేయర్ గా ఉన్న శిరీషకు పదవీ గండం ఉంటుందా అన్న చర్చ సాగుతోంది.

కార్పోరేషన్ లో మెజారిటీ కూటమికే ఉందని లెక్కలతో సహా పక్కాగా తేలిపోయిన వేళ కచ్చితంగా మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకునేందుకు కూటమి నేతలు పావులు కదుపుతారని అంటున్నారు. ఇదే తీరున ఏపీఎలో మరి కొన్ని కార్పోరేషన్లలోనూ వైసీపీకి మెజారిటీ తగ్గించే ప్రయత్నం జరుగుతోంది.

విశాఖ కార్పోరేషన్ లో కూడా పదికి పది స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవులను ఇటీవల కూటమి గెలుచుకుంది. ఇక్కడ కూడా తమకే మెజారిటీ ఉందని కూటమి పార్టీలు అంటున్నాయి. అలాగే విజయవాడ కార్పోరేషన్ మీద కూటమి కన్ను ఉందని అంటున్నారు. వీటితో పాటు ఇతర మునిసిపాలిటీలు కార్పోరేషన్లలోనూ తమ సత్తా చాటడానికి కూటమి పార్టీలు చూస్తున్నారు. ఇవన్నీ విశ్లేషించుకున్నపుడు సాధ్యమైనత తొందరలోనే వైసీపీకి చెందిన స్థానిక అధికార పీఠాలు కదిలిపోతాయన్న చర్చ అయితే గట్టిగా సాగుతోంది.