Begin typing your search above and press return to search.

తిరుప‌తి టీడీపీలో క‌ల్లోలం.. ర‌హ‌స్య భేటీల‌తో వేడెక్కించిన నేత‌లు!

నేత‌ల‌ను కూడ‌దీసుకుని.. ర‌హ‌స్య భేటీలు నిర్వ‌హిస్తున్నారు. త‌న చెంత‌కు వారిని చేర్చుకుంటున్నారు. దీంతో టీడీపీలో క‌ల్లోలం రేగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

By:  Tupaki Desk   |   26 March 2024 6:18 PM GMT
తిరుప‌తి టీడీపీలో క‌ల్లోలం.. ర‌హ‌స్య భేటీల‌తో వేడెక్కించిన నేత‌లు!
X

''మేం వ‌ద్ద‌ని అంటున్న నాయ‌కుడికే ఇక్క‌డ టికెట్ ఇచ్చారు. అది కూడా జ‌న‌సేన‌కు ఇచ్చారు. ఏం మేం ఇక్క‌డ గొడ్డు బోయామా? ఇన్నాళ్లు పార్టీ జెండా మోసి.. పోలీసుల‌తో కేసులు పెట్టించుకుని.. నానా ఇబ్బందులు ప‌డి చంద్ర‌బాబు కోసం ప‌నిచేశాం. అలాంటి మేం ఆయ‌న‌కు క‌నిపించ‌లేదా'' - ఇదీ.. తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంమాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ చేసిన వ్యాఖ్య‌లు. అయితే.. వీటిని అధిష్టానం లైట్ తీసుకుంది. ఆమె ఏం చేస్తారులే అనుకుంది. కానీ, ఆమే ఇప్పుడు పార్టీకి సెగ పెడుతున్నారు. నేత‌ల‌ను కూడ‌దీసుకుని.. ర‌హ‌స్య భేటీలు నిర్వ‌హిస్తున్నారు. త‌న చెంత‌కు వారిని చేర్చుకుంటున్నారు. దీంతో టీడీపీలో క‌ల్లోలం రేగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తిరుపతి టికెట్ ద‌క్కించుకున్న‌ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తు న్నారు. ఆయన ఆ స్థానం నుంచి పోటీకి సరైన వ్యక్తి కాదన్న వాదన వినిపిస్తున్నారు. మొదటి రోజు శ్రీనివాసులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా రహస్య సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు టీడీపీ లీడర్లు ఆరణి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా సమావేశమ‌య్యారు. టిడిపి ముఖ్య నేతలంతా జేబీ శ్రీనివాసుల ఇంట్లో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో మరోసారి సమావేశమై... తిరుపతి సీటుపై పునః సమీక్షించాలని విజ్ఞప్తి చేయనున్నారు. తేడావ‌స్తే.. మూకుమ్మ‌డిగా వైసీపీకి మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.

తిరుపతిలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టికెట్ ఆశించారు. అయితే కూటమి లెక్కల్లో భాగంగా తిరుపతి సీటు జనసేనకు కేటాయించారు. అప్పటి నుంచి టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. అధినాయకత్వం బుజ్జిగించడంతో కాస్త శాంతించి నట్టు కనిపిస్తున్నా... తమకు సీటు కేటాయించి ఉంటే చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇచ్చే వాళ్లమంటూ చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఆమె కూడా ఈ రెబ‌ల్స్‌తో చేతులు క‌లిపారు. వారిని కూడ‌గ‌ట్టారు. జనసేనకు కేటాయించడంపై కోపం ఒక ఎత్తైతే... ఆ పార్టీ తీసుకొచ్చిన అభ్యర్థిని చూసి వారి ఆగ్రహం రెట్టింపు అయింది.

జనసేన తరఫున పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు(వైసీపీ ఎమ్మెల్యే-చిత్తూరు) ఆఖరి నిమిషంలో జనసేనలో చేరి పార్టీ టికెట్ తీసుకున్నారు. ఆయనపై ఆనేక ఆరోపణలు ఉన్నాయని స్థానికంగా కూడా ఆయనకు మంచి పేరు లేదని చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన్ని తిరుపతి అభ్యర్థిగా ప్రకటించడాన్ని నేతలు తప్పుబడుతున్నారు. ఒక్క టీడీపీ నేతలే కాదు సొంత పార్టీ జనసేన నుంచి కూడా ఆరణి శ్రీనివాసులకు మద్దతు రావడం లేదు. బీజేపీ నేతలు సరే సరి. వారు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏం చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.