తిరుపతి తొక్కిసలాట ఘటన... ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చేసింది!
అవును.. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను నియమించింది.
By: Tupaki Desk | 12 July 2025 9:43 AM ISTఈ ఏడాది జనవరి 8న తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో 48 మంది గాయపడ్డారు! దీంతో.. ఈ ఘటనపై హైకోర్టు మాజీ న్యాయమర్తి జస్టిస్ సత్యనారాయణమర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. దాని నివేదిక వచ్చేసింది!
అవును.. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను నియమించింది. ఈ సమయంలో జస్టిస్ సత్యనారాయణ మూర్తి అన్ని కోణాల్లోనూ విచారణ జరిపారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... టీటీడీ అధికారులు, జిల్లా అధికారులు, సిబ్బందితో పాటు భక్తులను ఆయన విచారించారని సమాచారం.
ఈ క్రమంలో మూడు వాల్యూమ్స్ గా పూర్తి నివేదికను సిద్ధం చేశారు! ఈ క్రమంలో శుక్రవారం ఈ నివేదికను సచివాలయంలో చీఫ్ సెక్రటరీ (సీఎస్)కు ఈ నివేదికను అందజేశారు. ఈ నివేదిక సుమారు 200 పేజీలు ఉందని అంటున్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.
కాగా... వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం.. తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో... రాష్ట్రంతోపాటు పొరుగునున్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు.
ఈ సమయంలో.. జీవకోన, బైరాగిపట్టెడ, శ్రీనివాసం, అలిపిరి అనే నాలుగు ప్రాంతాల వద్ద తొక్కిసలాట జరిగింది. తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. జీవకోన వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావిస్తుండగానే బైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందగా మరో 48 మంది భక్తులకు గాయాలయ్యాయి. వారిలో కొంతమందిని స్విమ్స్ కు, మరి కొంతమందిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నాడు ఆ సమయంలో ఆసుపత్రుల వద్ద అంబులెన్సుల మోత, క్షతగాత్రుల బంధువుల రోదనలతో దయనీయ పరిస్థితి నెలకొంది.
