బాబు చెప్పినా బేఫికర్.. తిరుమలలో మరో ఘటన!
తాజాగా జరిగిన ఓ ఘటన.. తిరుమలను మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ప్రభుత్వంపైనా టీటీడీ బోర్డు పైనా విమర్శలు వచ్చేలా మార్చింది.
By: Tupaki Desk | 12 April 2025 5:20 PM ISTతిరుమల పవిత్రతను కాపాడేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నామని.. సీఎం చంద్రబాబు పదే పదే చె బుతున్నారు. అంతేకాదు.. ఎప్పటికప్పుడు తన దృస్టికి వచ్చిన అంశాలపై ఆయన స్పందిస్తూనే ఉన్నా రు. అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నారు అయినప్పటికీ.. క్షేత్రస్థాయి సిబ్బందిలో మార్పు రావడం లేదు. మరి ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరుగుతోందా? లేక వైకుంఠధాముని సన్నిధిలో ఏం జరిగినా.. ఆయనే చూసుకుంటాడని వదిలేస్తున్నారో తెలియడం లేదు.
తాజాగా జరిగిన ఓ ఘటన.. తిరుమలను మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ప్రభుత్వంపైనా టీటీడీ బోర్డు పైనా విమర్శలు వచ్చేలా మార్చింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శనం.. సెకను కాలమైనా లబిస్తే చాలని అందరూ అనుకుంటారు. ఆయన దర్శనం కోసం తపించి పోతారు. ఇక, తిరుమల కొండ చేరింది మొదలు.. గోవిందుని నామస్మరణలో మునిగిపోతారు. కాళ్లకు చెప్పులు తీసేసి.. క్యూలైన్లలో చేరి.. స్వామి దర్శన భాగ్యం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు.
కానీ.. తాజాగా శ్రీవారి దర్శనానికి పాదరక్షలతో ఏకంగా మహా ద్వారం వరకు వచ్చేశారు ఇద్దరు భక్తులు. వాస్తవానికి తిరుమల క్యూలైన్‌లోకివచ్చేప్పుడే.. సిబ్బంది చెప్పులు తీసేయాలని చెబుతారు. కానీ, ఎవరూ ఈ మాట చెప్పలేదో.. లేక తమకు తెలియదో కానీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి పాదరక్షలు ధరించిన భక్తులు మహా ద్వారం దగ్గరకు చేరుకున్నారు. వాస్తవానికి ఈ మధ్య దూరంలో మూడు ప్రాంతాల్లో తనిఖీ చేసే అవకాశం ఉంది. మరి ఆ తనిఖీలు ఏమయ్యాయో కూడా తెలియదు.
సదరు భక్తులు పాదరక్షలతోనే మహాద్వారంవరకు వచ్చేసినా.. టీటీడీ అదికారులు ఎవరూ గుర్తించలేక పోయారు. చివరకు మరో అడుగు దూరంలో మహాద్వార గడప ఉన్నదనగా.. అక్కడే కానిస్టేబుల్‌గా ఉన్న మహిళా ఉద్యోగి గుర్తించి పాదరక్షలు తీసేయించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. టీడీపీ విషయంలో దారుణంగా విఫలమైన భద్రతా అధికారులు.. అంటూ కామెంట్లు మొదలయ్యాయి. తిరుమల లో వరుస అపచారాలు జరుగుతున్నా.. టీటీడీ నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
