మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తికి షాక్.. బెజవాడలో కేసు.. ఏం జరిగింది?
వైసీపీ కీలక నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
By: Tupaki Political Desk | 4 April 2026 12:14 PM ISTవైసీపీ కీలక నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తోపుదుర్తికి చెందిన నిర్మాణ సంస్థ రాక్రీట్ పేదల ఇళ్ల నిర్మాణంలో మోసం చేసిందని విజయవాడలో కేసు నమోదు చేయించింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తికి చెందిన కాంట్రాక్టు సంస్థ వల్ల సుమారు 4 కోట్ల మేర నష్టం జరిగిందని, పేదల ఇళ్లు నిర్మాణం మధ్యలో నిలిచిపోయాయని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ విషయం పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజా వ్యవహారంతో ప్రభుత్వ హిట్ లిస్టులో మరో వైసీపీ నేత చేరారని వ్యాఖ్యానిస్తున్నారు.
గత ప్రభుత్వంలో అధికారం అడ్డం పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేదల ఇళ్లతో చెలగాటమాడారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. విజయవాడ శివార్లలోని నున్న జగనన్న మోడల్ కాలనీ, పళ్లతిప్పలో మరో కాలనీ నిర్మాణానికి తోపుదుర్తికి చెందిన రాక్రీట్ సంస్థ కాంట్రాక్టు తీసుకుందని చెబుతున్నారు. సుమారు 3 వేల ఇళ్లను నిర్మిస్తామని కాంట్రాక్టు కుదుర్చుకోవడమే కాకుండా, ప్రభుత్వం నుంచి దశల వారీగా మెటీరియల్ కూడా తీసుకుందని ఆరోపిస్తున్నారు. కానీ రాక్రీట్ సంస్థ పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని, కొన్ని ఇళ్ల నిర్మాణం మధ్యలోనే నిలిపివేసిందని చెబుతున్నారు.
దీనిపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అంతర్గత విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం పేదల గృహ నిర్మాణం పేరుతో రాక్రీట్ రూ.4 కోట్ల విలువైన మెటీరియల్ తీసుకుని పనులు చేయలేదని అధికారులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేయాలని కోరుతూ కలెక్టర్ లక్ష్మీ షా తాజాగా విజయవాడ పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. న్యాయ సలహా అనంతరం కమిషనర్ ఆదేశాలతో రాక్రీట్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
నున్న, పళ్లతిప్ప లే అవుట్లలో చెరో 1500 చొప్పున ఇళ్ల నిర్మాణానికి రాక్రీట్ సంస్థ కాంట్రాక్టు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు నిర్ణయించారు. అయితే రాక్రీట్ సంస్థ ఆ మొత్తానికి పనులు చేపట్టలేమిన చెబుతూ ఒక్కో ఇంటికి రూ.35 వేల చొప్పున అదనంగా కావాలని అడిగిందని, ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకారం కుదరిందని చెబుతున్నారు. రాక్రీట్ అడిగిన అదనపు మొత్తాన్ని డ్రాక్వా సంఘాల ద్వారా రుణంగా ఇప్పించారని చెబుతున్నారు. అయితే మూడు దశల్లో ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన రాక్రీట్ మోసం చేసిందని, ప్రభుత్వం నుంచి తీసుకున్న సిమెంట్, స్టీల్ పక్కదారి పట్టించిందని అధికారులు ఆరోపిస్తున్నారు.
గృహ నిర్మాణం విషయంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న రాక్రీట్ సంస్థ గతంలో అధికారం అడ్డుపెట్టుకుని తనకు నచ్చిన విధంగా నిబంధనలు మార్చుకుందని ఆరోపిస్తున్నారు. రాక్రీట్ సంస్థ ప్రయోజనాల కోసం పునాదుల కోసం రూ.70 వేలు చెల్లించేలా నింధనలు మార్ారని వ్యాఖ్యానిస్తున్నారు. అంతకుముందు ఈ ధర రూ.50 వేలు ఉండేదని, తరవాత ప్రభుత్వం రూ.60 వేలు చేసిందని, కానీ రాక్రీట్ ఈ ధరను రూ.70 వేలకు పెంచుకునేలా పావులు కదిపిందని చెబుతున్నారు.
పునాదుల కోసం రూ.70 వేలు డ్రా చేసిన రాక్రీట్ పనులను మధ్యలోనే వదిలేసిందని గత ప్రభుత్వ హయాంలోనే ఫిర్యాదులు చేశారని అధికారులు చెబుతున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో అప్పట్లో రాక్రీట్ కి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంలో ఈ విషయమై లబ్ధిదారులు మళ్లీ ఫిర్యాదులు చేయడంతో రాక్రీట్ పై కేసు నమోదు అయిందని చెబుతున్నారు. ఈ పరిణామాలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ఎలా చూస్తారు? ఈ విషయంలో ప్రభుత్వ తదుపరి చర్యలు ఏ విధంగా ఉండనున్నాయనేది హాట్ టాపిక్ అవుతోంది.
