Begin typing your search above and press return to search.

కాలం చెప్పిన తీర్పు : ఇద్దరు చంద్రులూ మాజీలు!

అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నా బాబు మాత్రం నిర్ణయం తీసుకోవడానికి మాత్రం తీరని జాప్యం చేస్తారు.

By:  Tupaki Desk   |   4 Dec 2023 2:30 AM GMT
కాలం చెప్పిన తీర్పు :  ఇద్దరు చంద్రులూ మాజీలు!
X

ఆ ఇద్దరూ ఒక టైంలో ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. ఒకరు తెలంగాణాకు సీఎం అయితే మరొకరు ఏపీకి సీఎం. ఈ ఇద్దరూ అపర చాణక్యులు. రాజకీయ గండర గండలు. ఇద్దరి ఆలోచనలు పదునైనవి. ఆ ఇద్దరే ఒకరు నారా చంద్రబాబునాయుడు అయితే మరొకరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు.

ఎన్నో పోలికలు ఉన్నట్లే ఈ ఇద్దరిలో తేడాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు ఒక డెసిషన్ తీసుకోవడానికి బాగా లేట్ చేస్తారు. ఆచీ తూచీ అంటూ ముందుకు సాగుతారు. అదే కేసీయార్ అయితే దూకుడు మీద ఉంటారు. ఆయనది అంతా అగ్రెసివ్ మోడ్. అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నా బాబు మాత్రం నిర్ణయం తీసుకోవడానికి మాత్రం తీరని జాప్యం చేస్తారు.

అలా బాబు తీసుకున్న నిర్ణయాలలో సక్సెస్ రేటూ ఉంది. ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇక చంద్రశేఖరావు దూకుడు చాలసార్లు కలసి వచ్చింది. కొన్ని సార్లు బెడిసికొట్టింది. ఇక కేసీయార్ ఎమోషనల్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట. బాబు అయితే ఎత్తులు పొత్తులు వ్యూహాలతో తన పాలిటిక్స్ ని కొనసాగిస్తూ వెళ్తూంటారు.

ఇదిలా ఉంటే 2014 జూన్ 2న కె చంద్రశేఖరావు తెలంగాణా రాష్ట్రానికి మొదటి సీఎం గా ప్రమాణం చేస్తే అదే నెల 8న చంద్రబాబు విభజన ఏపీకి తొలి సీఎం గా ప్రమాణం చేశారు. ఇక కేసీయార్ బాబు ఇద్దరూ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఏడాదికి పైగా ఉంటూ వచ్చారు. అక్కడ నుంచే ఏపీ పాలన బాబు చేశారు. ఓటుకు నోటు కేసు తరువాత 2015 జూన్ నుంచి బాబు ఏపీకి షిఫ్ట్ అయ్యారు.

ఈ ఇద్దరి మధ్యన అనుబంధం కంటే రాజకీయ వ్యూహాలే ఎక్కువగా ఉంటాయి. చంద్రబాబు క్యాబినేట్ లో కేసీయార్ ఒకనాడు మంత్రిగా ఉన్నారు. అదే బాబుని ఆయన 2000లో ఎదిరించి బయటకు వచ్చారు అలా రాజకీయ వ్యూహలతో ఇద్దరూ కొన్ని సార్లు కలసినా ఇద్దరూ రాజకీయంగా పై చేయి ఒకరి మీద ఒకరు సాధించాలనే చూస్తూ వచ్చారు.

అలా బాబు కేసీయార్ మధ్య రాజకీయ చందరంగం సాగుతూండగానే జగన్ ఎంట్రీ ఇచ్చారు. అలా జగన్ తో కేసీయార్ కి మంచి దోస్తీ కుదిరింది అని అంటారు. ఇద్దరికీ ఉమ్మడి శత్రువు బాబు కావడంతో ఈ ఇద్దరూ ఒక్కటిగా ఉంటారని ప్రచారమూ ఉంది. అందుకే బాబుకు 2019 ఎన్నికల్లో కేసీయార్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని, దానికి ప్రతిగా ఇపుడు కేసీయార్ కి బాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని రాజకీయాల్లో ప్రచారం ఉంది.

ఏది ఏమైనా బాబు మాజీగా గత నాలుగున్నరేళ్ళుగా ఉన్నారు. ఇపుడు ఆయన సరసన కేసీయార్ కూడా వచ్చి చేరారు. అలా ఇద్దరు చంద్రులూ మాజీ సీఎంలుగా మిగిలారు. ఈ ఇద్దరి ఆశలు ఆలోచనలూ ఇపుడు ఒక్కటే 2024 ఎన్నికలే. బాబుకు ఏపీలో అధికారం ముఖ్యం. అలాగే ఎక్కువ ఎంపీలు ఉంటే కేంద్రంలో కూడా కీలక పాత్ర టీడీపీ తరఫున పోషించాలని ఉంది.

ఇపుడు కేసేయార్ కి కూడా మిగిలిన ఏకైన ఆప్షన్ లోక్ సభ ఎన్నికలు. అప్పటికి రాజకీయం బీయారెస్ కి అనుకూలం అయితే ఎక్కువ ఎంపీ సీట్లు సాధించి ఢిల్లీ నుంచే రాజకీయ ఆట స్టార్ట్ చేయాలని అలా అక్కడ నుంచి తెలంగాణా రాజకీయాల్లో తన ప్రభావం చూపించాలని యోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే ఇద్దరు మిత్రులు ఇద్దరు చంద్రులు ఇద్దరూ ఇపుడు మాజీ సీఎంలు. అదన్న మాట తెలుగు రాజకీయాల్లో కొత్త కధ.