Begin typing your search above and press return to search.

8 గంటల కసరత్తు అనంతరం అధికారికంగా పొత్తు లెక్కలు!

అంచనాల్ని పక్కన పెట్టేసి అధికారిక సమాచారాన్ని ఉమ్మడి ప్రకటన రూపంలో ప్రకటించారు.

By:  Tupaki Desk   |   12 March 2024 4:47 AM GMT
8 గంటల కసరత్తు అనంతరం అధికారికంగా పొత్తు లెక్కలు!
X

కొంతకాలంగా సాగుతున్న చర్చలకు పుల్ స్టాప్ పెడుతూ సోమవారం దాదాపు 8 గంటలకు పైనే సాగిన సుదీర్ఘ కసరత్తు ముగిసింది. తెలుగుదేశం.. జనసేన.. బీజేపీల మధ్య పొత్తు లెక్కలు తేలిపోయాయి. అంచనాల్ని పక్కన పెట్టేసి అధికారిక సమాచారాన్ని ఉమ్మడి ప్రకటన రూపంలో ప్రకటించారు.

దీని ప్రకారం తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా.. 17 ఎంపీ సీట్లకు తన అభ్యర్థుల్ని బరిలో నిలపనుంది. అదే సమయంలో జనసేనకు 21 అసెంబ్లీ స్థానాల్ని కేటాయించింది. కేవలం 2 ఎంపీ స్థానాల్ని మాత్రమే ఇచ్చింది. బీజేపీ విషయానికి వస్తే.. ముందు నుంచి సాగుతున్న అంచనాలకు తగ్గట్లే ఆరు ఎంపీ స్థానాల్ని ఇవ్వటం ఓకే అయినా.. అనూహ్యంగా పది అసెంబ్లీ స్థానాల్ని ఇవ్వటం మాత్రం అందరిని సర్ ప్రైజ్ అయ్యేలా చేసింది.

ఈ క్రమంలో బీజేపీకి భారీగా అసెంబ్లీ స్థానాల్ని కేటాయించిన నేపథ్యంలో.. అందుకు జనసేన మూల్యం చెల్లించుకోవటం ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలెట్ అంశంగా చెప్పాలి. ముందుగా ప్రకటించిన దానికి భిన్నంగా 24 అసెంబ్లీ స్థానాల్లో కాకుండా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కేంద్రమంత్రి షెకావత్.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండాలు కలిసి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారన్న దానిపై కూడా స్పష్టత వచ్చేసినట్లుగా చెబుతున్నారు.

మొత్తం ఎపిసోడ్ ను చూసినప్పుడు జనసేనతో పోలిస్తే.. ఏపీలో ఎలాంటి పట్టు లేని బీజేపీ అధికంగా లబ్ధి పొందినట్లుగా చెప్పాలి. బీజేపీకి ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆరు ఎంపీ స్థానాల్ని కోరుకోవటం బాగానే ఉన్నా.. అసెంబ్లీ స్థానాల విషయంలో పదికి తగ్గే ప్రసక్తే లేదని తేల్చేయటం ఆసక్తికరంగా మారింది. పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ ఒక అసెంబ్లీ స్థానాన్ని తాజాగా త్యాగం చేస్తే.. జనసేన అధినేత మూడు అసెంబ్లీ స్థానాల్ని త్యాగం చేయటం గమనార్హం.

మొత్తంగా చూస్తే.. పొత్తు లెక్కల్లో బీజేపీ అధిక ప్రయోజనం పొందిందని చెప్పక తప్పదు. బీజేపీతో పొత్తు కోసం తహతహలాడిన చంద్రబాబు.. వారి డిమాండ్లకు అనుకూలంగా తగ్గక తప్పలేదు. టీడీపీ - బీజేపీ మధ్య సయోధ్యను కుదిర్చిన పవన్ కల్యాణ్.. అందుకు తగ్గ మూల్యం చెల్లించారన్న మాట వినిపిస్తోంది. అసెంబ్లీ సీట్ల విషయంలో బీజేపీ పట్టుదలను పూర్తి చేసేందుకు పవన్ తన పార్టీ నేతలు పోటీ చేయాల్సిన స్థానాల్ని త్యాగం చేసి కమలనాథులకు కట్టబెట్టేయటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.